అమీన్పూర్, నవంబర్ 18: సంగారెడ్డి జిల్లా అమీన్పూర్ మున్సిపల్ పరిధిలోని వందనపురి కాలనీలో రహదారిపై నిర్మిస్తున్న ఓ అక్రమ నిర్మాణాన్ని సోమవారం హైడ్రా ఆధ్వర్యంలో నేలమట్టం చేశారు. సర్వే నంబర్ 840లో వేసిన వెంచర్లో రహదారి పై ఓ నిర్వాహకుడు ఇంటి నిర్మాణం చేపడుతుండగా వందనపురి కాలనీ అసోసియేషన్ అధ్యక్షుడు లింగమయ్యతోపాటు కాలనీవాసులు హైడ్రా కమిషనర్ రంగనాథ్‌ను కలిసి ఫిర్యాదు చేశారు. రంగనాథ్ విచారణ చేపట్టడంతో అక్రమమని తేలింది. అందుకు హైడ్రా అధికారులు తెల్లవారుజామున జేసీబీలతో కూల్చివేశారు. అమీన్పూర్ మున్సిపాలిటీ పరిధిలో మంగళవారం రంగనాథ్ పర్యటించి రహదారులు, ఎఫ్టీఎల్, బఫర్‌జోన్‌లోని నిర్మాణాలు పరిశీలించినున్నట్టు సమాచారం.