రఘురాం(పేరు మార్చాం) వరంగల్‌కు చెందిన గ్రాడ్యుయేట్. ఉపాధి కోసం హైదరాబాద్‌కు వచ్చి ఉప్పల్‌లో స్థిరపడ్డాడు. స్థానికంగా రియల్ ఎస్టేట్ ఏజెంట్‌గా మారాడు. 12ఏళ్లుగా 90 నుంచి 100 ప్లాట్ల వరకు విక్రయించాడు. రెండేండ్ల కిందట పీర్జాదీగూడ సమీపంలో రెండు ఇండిపెండెంట్ ఇండ్లను విక్రయించాడు. తాజాగా ఆ ఇండ్లకు స్థానిక బల్దియా అధికారులు నోటీసులు అంటించారు. దీంతో ఆ ఓనర్లు నేరుగా రఘురాం వెంటపడుతున్నారు. “నీ వల్లే ఈ ఇల్లు కొనుగోలు చేశాం. ఇప్పుడేమో నోటీసులు అంటించారు. నువ్వే పరిహారం చెల్లించాలని ఒత్తిడి చేస్తున్నారు.’
శామీర్‌పేట్‌లో ఓపెన్ ప్లాట్లను విక్రయించే సుదర్శన్..హెచ్ఎండీఏ అనుమతులతో డెవలప్ చేసిన ఓ లేఅవుట్లో నాలుగు ప్లాట్లను తెలిసిన వారికి ఇప్పించాడు. ఇటీవల హైడ్రా నోటీసులు జారీ చేయడంతో సుదర్శన్‌కు కొత్త తలనొప్పులు మొదలయ్యాయి. ప్లాట్లను ఇప్పించినందుకు నువ్వే బాధ్యత వహించాలని కొనుగోలుదారులు తరుముతున్నారు.
HYDRAA | హైదరాబాద్ సిటీబ్యూరో, అక్టోబర్ 14(నమస్తే తెలంగాణ): ఇవేవో ఒకటి రెండు సంఘటనలు మాత్రమే కాదు. హైదరాబాద్ కేంద్రంగా ఇన్నాళ్లు రియల్ ఎస్టేట్ ఏజెంట్లుగా ఉపాధి పొందిన వారు బాధితులుగా మారుతున్నారు. ‘ఎంకి పెళ్లి సుబ్బి చావుకు వచ్చినట్టు’గా రియల్ ఎస్టేట్ ఏజెంట్ల మెడపై ప్రస్తుతం హైడ్రా కత్తి వేలాడుతున్నది. అనుమతులు ఇచ్చిన ప్రభుత్వ సంస్థలు బాగానే ఉన్నాయి. ఇన్నాళ్లు నివాసం ఉన్న ఇంటి యజమానులు బాగానే ఉన్నారు. కానీ ఏజెంట్ల పరిస్థితి తలకిందులుగా మారింది.
ఉపాధి కోసం రియల్ ఎస్టేట్‌లో భూములు, ఫ్లాట్లను విక్రయించే ఎంతో మంది ఏజెంట్లు బలిపీఠం ఎక్కుతున్నారు. కాంగ్రెస్ ప్రభుత్వం కొత్త మ్యాపుల ప్రకారం చెరువుల హద్దులను నిర్ధారించడంతో ఎప్పుడో కట్టిన, డెవలప్ చేసిన వెంచర్లు కూడా ఎఫ్టీఎల్, బఫర్ జోన్ పరిధిలోకి వస్తున్నాయి. ఇండ్లను ఎందుకు కూల్చకూడదో చెప్పాలంటూ నోటీసులు అంటించడంతో యజమానులు బిల్డర్లతోపాటు, ఏజెంట్ల వెంటపడుతున్నారు.
‘రియల్’ కుదుపు
చెరువుల ఆక్రమణల పేరిట కాంగ్రెస్ సర్కార్ రియల్ ఎస్టేట్ రంగాన్ని కుదిపేస్తున్నది. దీంతో భూముల ధరలు ఎక్కడికక్కడ నిలిచిపోయేలా చేస్తోంది. ప్రస్తుతం హైడ్రా నోటీసులు ఇస్తున్న నిర్మాణాలు అనుమతులు లేకుండా, ఆక్రమించుకుని, రాత్రికి రాత్రే కట్టుకున్నవి అనుకుంటే పొరపాటే. ఐదారేండ్ల కిందట అధికారుల నుంచి పక్కా అనుమతులు తీసుకొని నిర్మించుకున్న భవనాలు కూడా హైడ్రా జాబితాలో చేరిపోవడం ఇంటి యజమానులతోపాటు, రియల్ ఎస్టేట్ రంగంపై ఆధారపడినవారిని కూడా ఇప్పుడు కలవరపెడుతున్నది. ముఖ్యంగా ఏజెంట్లు, బిల్డర్లు, కొనుగోలుదారులకు ప్రభుత్వం తీరు తలనొప్పిలా మారింది.
ఏజెంట్లపై ఒత్తిడి…
చుట్టూ ఐదారు జిల్లాలకు కేంద్రంగా ఉన్న హైదరాబాద్ నగరంలో ఎంతోమంది రియల్ ఎస్టేట్ రంగంపై ఆధారపడి జీవిస్తున్నారు. వీరిలో ఓపెన్ ప్లాట్లు, రెసిడెన్షియల్ ఫ్లాట్లతోపాటు, లగ్జరీ విల్లాలను విక్రయించే ఏజెంట్లు, స్థిరాస్తి వ్యాపారులు, కన్సల్టెన్సీ నిర్వాహకులు కూడా ఉన్నారు. ఏజెంట్లతోపాటు, పార్ట్ టైం తరహాలో తెలిసిన వారికి ఓపెన్ ప్లాట్లు ఇప్పించే ప్రభుత్వ, ప్రైవేటు ఉద్యోగులు, గృహిణులు కూడా ఉన్నారు. వీరి సంఖ్య సుమారు 8-10లక్షల పైమాటే. రేవంత్ రెడ్డి సర్కార్ పుణ్యాన వీరి పరిస్థితి ప్రశ్నార్థకంగా మారింది. ఇక భూమి కొనాలంటేనే ప్రజలు భయపడి పోతున్నా రు. ఇదే ప్రస్తుతం రియల్ ఎస్టేట్ రంగం కుదేలుకు కారణమవుతున్నది.