హైదరాబాద్ సిటీబ్యూరో, అక్టోబర్ 20(నమస్తే తెలంగాణ): చెల్లుబాటు అయ్యేవిధంగా ప్రభుత్వ అనుమతులు ఉన్న నిర్మాణాల జోలికి వెళ్లబోమని సీఎం రేవంత్‌రెడ్డి చేసిన ప్రకటనకు తాము కట్టుబడి ఉంటామని హైడ్రా కమిషనర్ రంగనాథ్ తెలిపారు. రియల్ఎస్టేట్ వెంచర్లు సరైన ప్రభుత్వ ఆనుమతులతో నిర్మాణాలు చేపడితే, తాము వాటి జోలికి వెళ్లబోమని ఆదివారం ఆయన ఎక్స్ వేదికగా ట్వీట్ చేశారు. చెరువులు,కుంటలు,నాలాలు, ప్రభుత్వ భూములు కబ్జా చేసిన చోటే హైడ్రా కూల్చివేతలు ఉంటాయని, ప్రభుత్వం ఇచ్చిన అనుమతి పేపర్లు ఉంటే అధికారులను సంప్రదించాలని సీఎం చేసిన వ్యాఖ్యల వీడియోను పోస్ట్ చేశారు. హైదరాబాద్‌లో చెరువులు, పార్కులను కబ్జా చేశారని హైడ్రా రెండు నెలల్లో 23 చోట్ల 262 నిర్మాణాలను కూల్చివేసింది.
పర్మిషన్లు ఉన్నా కూల్చేసిన వాటి సంగతేంటి?
హైడ్రా వ్యవహారంలో సీఎం రేవంత్‌రెడ్డి శనివారం చేసిన వ్యాఖ్యలపై బాధితుల నుంచి ప్రశ్నలు వెల్లువెత్తుతున్నా యి. హైడ్రా ఆధ్వర్యంలో అమీన్పూర్, పటేల్‌గూడలో పలు నిర్మాణాలను ఇప్పటికే కూల్చివేశారు. తమకు పర్మిషన్లు ఇచ్చి, ఆస్తిని నమోదు చేసి, కరెంట్, నల్లా కనెక్షన్లు ఇచ్చిన ప్రభుత్వమే ఇవి చట్ట విరుద్ధమని కూల్చేసిందని బాధితు లు ఆవేదన వ్యక్తంచేస్తున్నారు. ఇప్పుడేమో పర్మిషన్లు ఉన్నవారి జోలికి వెళ్లబోమని సీఎం చెప్తున్నారని, మరి తమ పరిస్థితేమిటని బాధితులు ప్రశ్నిస్తున్నారు. హైడ్రా దూకుడుగా కూల్చివేతలు ప్రారంభించడంతో పేద, మధ్యతరగతి వర్గాలకు చెందిన పలువురు ఇండ్లు కోల్పోయి వీధినపడ్డారు. కూల్చివేతల సమయంలో ఆయా ఇండ్ల యజమానులు తమ వద్ద ఉన్న పర్మిషన్ల పేపర్లను చూపించినా అధికారులు పట్టించుకోలేదు. ఇప్పుడేమో అనుమతులు ఉన్న వాటి జోలికి వెళ్లబోమని హైడ్రా కమిషనర్ ప్రకటించిన నేపథ్యంలో కూల్చివేసిన తమ ఇండ్లకు ప్రభుత్వం ఎటువంటి న్యాయం చేస్తుందని బాధితులు ప్రశ్నిస్తున్నారు. అనుమతులు ఉన్నా హైడ్రా కూల్చివేసిన ఇండ్లకు నష్టపరిహారం చెల్లించాలని కోరుతున్నారు.