హైదరాబాద్ సిటీబ్యూరో, సెప్టెంబర్ 22 (నమస్తే తెలంగాణ): కూల్చివేతలకు పండుగలు, ఆదివారాలతో సంబంధం లేదని హైడ్రా కమిషనర్ రంగనాథ్ స్పష్టం చేశారు. సెలవు రోజుల్లోనూ కూల్చివేతలు చేపట్టవచ్చని హైకోర్టు అనుమతి ఇచ్చిందని గుర్తు చేశారు. బతుకమ్మ పండుగ రోజున కూడా సెలవేనని, అందుకే గాజుల రామారంలో కూల్చివేతలు చేపట్టామని తెలిపారు. సోమవారం హైడ్రా కార్యాలయంలో నిర్వహించిన మీడియా సమావేశంలో రంగనాథ్ మాట్లాడుతూ ఆక్రమణల నుంచి భూములను రక్షించడం చాలా కష్టమని, అందుకోసం కొన్ని కఠిన నిర్ణయాలను కూడా తీసుకోవాల్సి ఉంటుందని తమ చర్యలను సమర్థించుకున్నారు. కూల్చివేతలకు తాము ఎంచుకున్న విధానాన్ని కర్ణాటక నుంచి వచ్చిన ఇంజినీర్లు కూడా మెచ్చుకున్నారని తెలిపారు. తాము నిబద్ధతతో పనిచేస్తున్నామని చెప్పారు. ఆక్రమణలని తేలితే పూర్తయిన నిర్మాణాలను కూడా కూల్చడానికి వెనుకాడబోమని స్పష్టం చేశారు.
ప్రతి దానికీ మమ్మల్నే నిందిస్తున్నారు
గ్రేటర్ హైదరాబాద్ పరిధిలో జరిగే ప్రతి తప్పిదాన్ని హైడ్రాకే ఆపాదిస్తున్నారని, ఏం జరిగినా తమనే నిందిస్తున్నారని రంగనాథ్ అసహనం వ్యక్తం చేశారు. గ్రేటర్ హైదరాబాద్ పరిధిలో జీహెచ్ఎంసీ, జలమండలి, విద్యుత్తు, పోలీసు శాఖలు కూడా ఉన్నాయని, ఎవరి పని వారు సక్రమంగా చేస్తే ఇబ్బందులు తలెత్తవని వ్యాఖ్యానించారు. అన్ని శాఖల పనులు చేయడానికి తమకు వంద చేతులు లేవని, ప్రతిదీ తమనే చేయమంటే ఎలా? అని ప్రశ్నించారు. అన్ని శాఖల తప్పిదాలకు తమనే బాధ్యులను చేస్తున్నారని ఆవేదన వ్యక్తంచేశారు. నగరంలో నాలాలు ఉప్పొంగకుండా ఏం చర్యలు తీసుకుంటున్నారని విలేకరులు ప్రశ్నించగా, నాలాల పునరుద్ధరణ బాధ్యత తమది కాదని సమాధానమిచ్చారు. పూడికతీత పనులు నిరంతరం కొనసాగించాలని, ఇందుకు జీహెచ్ఎంసీ అధికారులు సహకరించాలని కోరారు.
ఇటీవల కురిసిన భారీ వర్షాలకు నలుగురు వ్యక్తులు వరదలో కొట్టుకుపోవడానికి కారణాలేంటని అడగ్గా, ఆ ప్రాంతాల్లో వర్షం వచ్చిన ప్రతిసారి భారీగా వరద వస్తుందని చెప్పారు. వరద వస్తుందని తెలిసినా వారు ఆ దారిలో వెళ్లారని, అందుకే కొట్టుకుపోయినట్టు తేల్చారు. నగరంలోని పలు బస్తీలు, కాలనీల్లో పేదల ఇండ్లు చిన్నగా, తక్కువ ఎత్తుతో ఉండటం వల్లనే వర్షపు నీరు ఇండ్లలోకి చేరుతుందని చెప్పారు. బస్తీల్లో కొద్దిపాటి స్థలంలో తక్కువ ఎత్తుతో నిర్మాణం చేపడతారని అందుకే మునుగుతున్నాయని, వరద ప్రభావంతో ఎక్కువగా నష్టపోతున్నారని తేల్చారు. నగరం కాంక్రీట్ జంగిల్‌గా మారడం, నాలాల పరిమాణం తగ్గడం వల్లే అవి పొంగి పొర్లుతున్నాయని చెప్పారు.
గాజులరామారంలో పేదలు లేరు
హైడ్రా ఏర్పడిన 15 నెలల నుంచి ఇప్పటిదాకా 581 నిర్మాణాలను కూల్చివేశామని రంగనాథ్ ప్రకటించారు. గాజులరామారంలో ఆదివారం 260 నిర్మాణాలు కూల్చామని మరో 640 నిర్మాణాలను కూలుస్తామని చెప్పారు. వాటిలో ప్రజలు నివాసం ఉంటున్నారని ఆగామని, ఆక్రమణకు గురైందని తేల్చిన తర్వాత కూల్చివేతలు కొనసాగిస్తామని చెప్పారు. గాజులరామారం భూముల్లో పేదలెవరూ లేరని, అక్కడ కూల్చినవన్నీ రౌడీ షీటర్లవేనని తెలిపారు. ఆక్రమణదారుల్లో పెద్ద ఎత్తున రాజకీయ నేతలున్నారని పేర్కొన్నారు. వారిలో ఎమ్మెల్యే అరికెపూడి గాంధీ కుటుంబం ఉందా? లేదా? అనేది చెప్పలేమని తెలిపారు. రాజకీయ నేతలు ఎవరెవరు ఉన్నారనే వివరాలను ప్రభుత్వానికి నివేదిస్తామని చెప్పారు. బుల్డోజర్లను అడ్డుకుని నిరసన తెలిపిన వారు కూడా ఆక్రమణదారుల భూములకు కాపలాగా ఉండేవారేనని చెప్పారు. కూల్చిన నిర్మాణాలన్నీ అసంపూర్తిగా ఉన్నవేనని, విద్యుత్తు మీటర్లు, తలుపులు బిగించిన ఇండ్లను కూల్చబోమని హామీ ఇచ్చారు. విద్యుత్తు కనెక్షన్‌కు అనుమతి ఇచ్చిన అధికారులపై ప్రభుత్వానికి ఫిర్యాదు చేస్తామని తెలిపారు. హైడ్రా కూల్చివేతల్లో చాలావరకు అనుమతులతో నిర్మించినవే ఉంటున్నాయని మీడియా ప్రతినిధులు గుర్తుచేయగా.. అనుమతులు ఇచ్చిన సంబంధిత శాఖల అధికారులపై ప్రభుత్వానికి ఫిర్యాదు చేస్తామని తెలిపారు.
తుది నోటిఫికేషన్ ఇచ్చాకే సల్కం చెరువులో కూల్చివేతలు
సల్కం చెరువులోని ఫాతిమా స్కూల్ భవనానికి ఇప్పటివరకు ప్రాథమిక నోటిఫికేషన్ మాత్రమే ఇచ్చామని రంగనాథ్ తెలిపారు. తుది నోటిఫికేషన్ వచ్చాక నిర్మాణాలను కూలుస్తామని పేర్కొన్నారు. అక్కడ పేద పిల్లలకు ఉచితంగా చదువు చెప్తున్నారా? లేదా? అనేది తమ పరిధిలోని అంశం కాదని స్పష్టం చేశారు. చెరువులను ఎవరు కబ్జా చేసినా నిబంధనల ప్రకారమే చర్యలు తీసుకుంటామని తెలిపారు. గ్రేటర్ వ్యాప్తంగా 150 చెరువులకు నోటిఫికేషన్ ఇచ్చామని చెప్పారు. నగరంలో 6 ప్రధాన చెరువులను పునరుద్ధరించి, దాదాపు 70 ఎకరాల భూములను స్వాధీనం చేసుకునేందుకు ప్రయత్నిస్తున్నామని ఆయన తెలిపారు. ఇందుకోసం మరిన్ని నిధులు అవసరం అవుతాయని, కార్పొరేట్ సోషల్ రెస్పాన్సిబిలిటీ (సీఎస్ఆర్) కింద ప్రముఖ కంపెనీలు ముందుకొస్తే బాగుంటుదని అభిప్రాయపడ్డారు.
గూడు చెదిరె.. గోడు మిగిలె!
మేడ్చల్ మల్కాజిగిరి జిల్లా గాజులరామారం బస్తీలో హైడ్రా కూల్చివేతల ఒక్కరోజు తర్వాతి దృశ్యమిది. ఒక్కసారే 260 ఇండ్లు హైడ్రా బుల్డోజర్ల దెబ్బకు ఇలా నేలమట్టమయ్యాయి. తలదాచుకునేందుకు ఉన్న ఒక్క గూడునూ కండ్లముందే సర్కారు కర్కశంగా కూల్చేస్తే.. ఎవరిని నిందించాలో, ఎవరిని నిలదీయాలో తెలియని పరిస్థితి ఆ పేదలది. రోడ్డున పడ్డ కుటుంబాన్ని చూసుకుని రోదిస్తున్న ఓ మహిళ.
బొమ్మరిల్లూ జాగ్రత్త బిడ్డా!
ఇల్లు కూలింది. దర్వాజ ఒరిగింది. గాజులరామారంలో ఛిన్నాభిన్నమైన శిథిలాల మధ్య చిన్నారులు అమాయకంగా ఆడుకుంటున్నారు. ‘ఇనుప రెక్కల గద్ద’ ఉన్న గూడును కూల్చేస్తే.. ఇలా ముక్కలైన కలలను పేర్చుకుని ‘బొమ్మరిల్లు’ కట్టుకునే పనిలో నిమగ్నమై ఉన్నారు. జాగ్రత్త పిల్లలూ.. పేద బతుకులపై పగబట్టే బుల్డోజర్లకు ఇక్కడ కొదువే లేదు. ఏలినవారి కాఠిన్యానికి వయోభేదమూ గుర్తుకురాదు.
చట్టానికి కళ్లు లేవు.. న్యాయానికి ఇల్లు లేదు!
గాజులరామారంలో కూల్చివేసిన తమ ఇం డ్ల వద్దే వంటపాత్రలను శుభ్రం చేసుకుంటున్న ఓ మహిళ
ముల్లె సర్దుకున్న.. మూట సర్దుకున్న..
గాజులరామారంలో హైడ్రా కూల్చివేసిన తన ఇంటి నుంచి మిగిలిన సామగ్రిని తెచ్చుకుంటున్న వ్యక్తి