AV Ranganath | హైదరాబాద్ సిటీబ్యూరో ప్రధాన ప్రతినిధి, అక్టోబర్ 6 (నమస్తే తెలంగాణ): రాజకీయ నాయకులు అబద్ధాలాడుతుంటారని, వ్యాపారవేత్తలు నాలుక మడతవేస్తుంటారని జనబాహుళ్యంలో ఓ నమ్మకం ఏర్పడింది. ప్రభుత్వ అధికారులు ముఖ్యంగా ఓ ఐపీఎస్ నోటి నుంచి అబద్ధాలు వెలువడటం పరిశీలకులను విస్మయపరుస్తున్నది. హైడ్రా (హైదరాబాద్ డిజాస్టర్ రెస్పాన్స్ అండ్ అసెట్ ప్రొటెక్షన్ ఏజెన్సీ)కి కమిషనర్.. ప్రభుత్వం-ప్రజలకు మధ్య వారధిలా ఉండాల్సిన అధికారి ఏవీ రంగనాథ్ అబద్ధాలు ఆడటం ఎంతవరకు సమంజసం?! ఆయన అలవోకగా అబద్ధాలు ఆడుతూ.. పూటకో పరిధి వర్ణిస్తూ.. రోజుకో వైఖరి ప్రదర్శిస్తున్నారు. ఇవేవో గాలిలో చేసే ఆరోపణలు కావు. కాంగ్రెస్ ప్రభుత్వం ఆగస్టు 19న హైడ్రాను ఏర్పాటు చేస్తూ అధికారికంగా జీవో జారీ చేయడానికి ఒకరోజు ముందే రంగనాథ్ వేసిన తప్పటడుగుపై ఇంతవరకు వివరణ ఇవ్వలేదు. అప్పటినుంచి ఇప్పటివరకు ఆయన ప్రకటనలు, వైఖరి విచిత్రంగా ఉన్నాయి.
పరిధి దాటి అడుగులు
రేవంత్ సర్కారు హైడ్రా ఏర్పాటు చేసి, దాని పరిధిని నిర్ణయిస్తూ ఆగస్టు 19న జీవో 99 జారీచేసింది. కానీ దానికి ఒకరోజు ముందుగానే హైడ్రా నార్సింగి మున్సిపాలిటీతోపాటు అవుటర్ రింగురోడ్డు దాటి గండిపేట ఎఫ్టీఎల్లో ఉన్నాయంటూ పలు నిర్మాణాలను కూల్చివేసింది. ఇందులో ఓఆర్ఆర్ అవతలి ఖానాపూర్ గ్రామం కూడా ఉంది. అయితే ఈ గ్రామం ఓఆర్ఆర్ లోపల ఉన్న నార్సింగి మున్సిపాలిటీ పరిధిలోకి వస్తుంది కాబట్టి దానిపై తమ అధికారం చెల్లుతుందని రంగనాథ్ వివరణ ఇచ్చారు.
కానీ అదేరోజు ఓఆర్ఆర్ లోపల ఉన్న ఏ మున్సిపాలిటీతోనూ సంబంధంలేని గ్రామపంచాయతీలు హిమాయత్‌నగర్, దాని పరిధిలోని అప్పోజీగూడ, చిలుకూరు గ్రామపంచాయతీ పరిధుల్లోని కూడా పలు నిర్మాణాలను కూల్చివేశారు. ఈ గ్రామాలలోకి హైడ్రా ఎందుకు వెళ్లిందనే దానిపై ఇప్పటివరకు కమిషనర్ వివరణ ఇవ్వలేదు. కేవలం ఒక పారిశ్రామికవేత్త నిర్మాణాలను కూల్చివేసేందుకే హైడ్రా ఆ గ్రామాలలోకి వెళ్లిందనేది బహిరంగ రహస్యం.
జన్వాడపై జీవోకు విరుద్ధంగా వ్యాఖ్యలు
జీవో 99 ప్రకారం హైడ్రా పరిధి 2053.44 చదరపు కిలోమీటర్లు. ఇందులో జీహెచ్ఎంసీతోపాటు ఏడు మున్సిపల్ కార్పొరేషన్లు, సికింద్రాబాద్ కంటోన్మెంట్ ఏరియా, టీఎస్ఐఐసీ, ఐలాతో సహా 61 పారిశ్రామిక ప్రాంతాలు, 20 మున్సిపాలిటీలు, 33 గ్రామ పంచాయతీలు ఉన్నాయి. ఈ గ్రామ పంచాయతీల్లో జన్వాడ (నంబర్ 32) కూడా ఉంది. కానీ హైడ్రా కమిషనర్ రంగనాథ్ మాత్రం జన్వాడ తన పరిధిలోకి రాదంటారు.
ఇదేమంటే.. అది 111 జీవో పరిధిలో ఉన్నందున, హైడ్రాకు సంబంధం లేదంటారు. మరి 111 జీవో పరిధిలో ఉన్న ఖానాపూర్ గ్రామంలో హైడ్రా ఆగస్టు 18న ఎందుకు కూల్చివేతలు చేపట్టింది? చిలుకూరు, హిమాయత్‌నగర్ గ్రామ పంచాయతీ, దాని పరిధిలోని అప్పోజీగూడలో కూడా అదేరోజు కూల్చివేతలు జరిగాయి. మరి ఇక్కడ 99 జీవో ప్రామాణికమా? 111 జీవో ప్రామాణికమా? రంగనాథ్ సమాధానం ఇవ్వాల్సిన బాధ్యత ఉంది.
111 జీవోపై మారిన హైడ్రా వైఖరి
వాస్తవానికి హైడ్రా తొలుత 111 జీవో పరిధిని పట్టించుకోలేదు. అందుకే ఖానాపూర్, అప్పోజీగూడల్లో కూల్చివేతలు చేపట్టింది. కారణం దాని లక్ష్యం జన్వాడ. ఈ క్రమంలోనే జన్వాడలోని ఫాంహౌజ్ ముందు రెండు, మూడు రోజులపాటు హైడ్రామా నడిచింది. నీటిపారుదల శాఖ అధికారులు ఫాంహౌజ్ ముందున్న బుల్వాపూర్ నాలాను సర్వే చేశారు. ప్రహరీగోడ మినహా మిగిలిన నిర్మాణం అంతా నిబంధనల మేరకే ఉందని తేలింది.
ఆ సమయంలో చేవెళ్లలో ఒక కార్యక్రమంలో మంత్రి కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డి మాట్లాడుతూ.. ‘హైడ్రా 111 జీవో పరిధిలో ఉన్న ఒక్క నిర్మాణం జోలికి కూడా రాదు.. ఇది నా హామీ’ అని చెప్పారు. దీంతో జన్వాడ ఎపిసోడ్ పక్కకు పోయింది. అప్పటినుంచి 111 జీవో తమ పరిధిలోకి రాదంటూ హైడ్రా కమిషనర్ ప్రకటించడం మొదలుపెట్టారు. గతంలో 111 జీవో పరిధిలో నిర్మాణాలు కూల్చివేసిన హైడ్రా ఆ తర్వాత వైఖరి ఎందుకు మార్చుకుంది?
అన్నకు అన్నిరకాల అండా..దండ
మాదాపూర్‌లోని ఎన్ కన్వెన్షన్‌కు నీటిపారుదల శాఖ నోటీసులు ఇవ్వగా.. హైడ్రా కూల్చేసింది. దుర్గంచెరువు, సున్నంచెరువు పరిధిలో రెవెన్యూశాఖ నోటీసులు ఇచ్చింది. హస్మత్‌పేట పరిధిలో నీటిపారుదలశాఖ నోటీసులు ఇచ్చింది. కూకట్పల్లి నల్లచెరువు పరిధిలో జీహెచ్ఎంసీ ఇచ్చింది. వీటిల్లో సున్నంచెరువు, నల్లచెరువు పరిధిల్లో హైడ్రా కూల్చివేతలు చేపట్టింది. కానీ దుర్గంచెరువు పరిధిలో నెల రోజుల గడువు ఇచ్చి.. నెలన్నర గడిచినా అటువైపు రెవెన్యూశాఖ, హైడ్రా కన్నెత్తి చూడలేదు. దుర్గంచెరువులో సీఎం రేవంత్‌రెడ్డి అన్న తిరుపతిరెడ్డి నివాసం కూడా ఉంది. అందుకే హైకోర్టుకు వెళ్లి స్టే తెచ్చుకునే దాకా అందరూ మౌనం వహించారు. మరి ఇదేం ద్వంద్వ వైఖరి?
ఒవైపీ వంతు రాగానే నాలుక మడత…
ఓ రాజకీయ లక్ష్యంతో ఆదిలో దూకుడు ప్రదర్శించిన హైడ్రా.. ప్రతిపక్ష ఎమ్మెల్యేలు మల్లారెడ్డి, పల్లా రాజేశ్వర్‌రెడ్డికి చెందిన విద్యా సంస్థలపైనా గురి పెట్టింది. ఈ మేరకు పలు శాఖల నుంచి వాటకి నోటీసులు కూఆ అందాయి. ఇక రేపో మాపో బుల్డోజర్లు దించుతారని అనుకుంటుండగా.. అనూహ్యంగా తెరపైకి ఒవైసీలకు చెందిన ఫాతిమా కాలేజీ వచ్చింది. సల్కం చెరువు ఎఫ్టీఎల్లో యథేచ్ఛగా కాలేజీ నిర్మించిన చిత్రాలు జనబాహుళ్యంలో వైరల్ అయ్యాయి.
ఆ కాలేజీని కూల్చే దమ్ముందా? అన్న సవాళ్లు పెరిగాయి. ఎక్కడ ఇరుకున పడతామోనని భావించిన సీఎం రేవంత్‌రెడ్డి మీడియా చిట్‌చాట్‌లో విద్యార్థుల భవిష్యత్తు దృష్ట్యా విద్యా సంస్థలకు సమయం ఇస్తామని ప్రకటించారు. దానిని అందిపుచ్చుకున్న రంగనాథ్ కూడా విద్యా సంస్థల జోలికి ఇప్పుడే వెళ్లమని చెప్పారు. మల్లారెడ్డి, పల్లా కాలేజీల విషయంలో గుర్తుకురాని విద్యార్థుల భవిష్యత్తు ఒవైసీ కాలేజీ విషయంలోనే ఎందుకు గుర్తొచ్చింది?
జీవో వేరు.. మ్యాపు వేరా?
గత కొన్నిరోజుల నుంచి హైడ్రా కమిషనర్ తమ పరిధిపై మళ్లీ తడబాటు ప్రదర్శిస్తున్నారు. ఈ క్రమంలో అలవోకగా అబద్ధాలతో కూడిన లాజిక్‌లు వల్లిస్తున్నారు. ఇటీవల ఇబ్రహీంపట్నం చెరువు ప్రస్తావన వచ్చినపుడు.. అసలు హైడ్రా అక్కడికి వెళ్లలేదన్నారు. కానీ చెరువును పరిశీలించిన వారిలో హైడ్రా అధికారులు కూడా ఉన్నారు. హెచ్ఎండీఏలో శంషాబాద్ జోన్ ప్లానింగ్ ఆఫీసర్‌గా ఉండి, హైడ్రాకు బదిలీ అయిన రాంరెడ్డి, హైడ్రాలో పని చేస్తున్న ఆర్ఎఫ్ఓ పాపయ్య అక్కడికి వెళ్లారు. మరోసారి ఇబ్రహీంపట్నంపై ఇంకో లాజిక్ వినిపించారు.
ఇబ్రహీంపట్నం మున్సిపాలిటీ అనేది మ్యాపు ప్రకారం హైడ్రా పరిధిలోకి వస్తుందన్నారు. అంటే 99 జీవోలో స్పష్టంగా హైడ్రా పరిధి పేర్కొన్నారు. దీని ప్రకారం ఇబ్రహీంపట్నం చెరువు అవుటర్ అవతల 7-8 కిలోమీటర్ల దూరంలో ఉంది. మరి.. కమిషనర్ రంగనాథ్ చెప్పే మ్యాపు ఏమిటో? దానిని అధికారికంగా ఇప్పటివరకు ఎందుకు విడుదల చేయలేదు? జీవో 99కి భిన్నంగా మ్యాపులో హైడ్రా పరిధి ఉందా? వీటన్నింటికీ సమాధానం చెప్పేదెవరు?!
మూసీతో ఎందుకు సంబంధం ఉండదు?
ఓఆర్ఆర్కు ఈవల ఉన్నదంతా హైడ్రా పరిధియేనని జీవో 99లో పేర్కొన్నారు. కానీ హైదరాబాద్ నగరం నడిబొడ్డున ప్రవహిస్తుతన్న మూసీ నది పరిసరాలు తన పరిధిలోకి రావని హైడ్రా కమిషనర్ చెప్తున్నారు. దాని ప్రత్యేకంగా ఎంఆర్డీసీఎల్ (మూసీ రివర్‌ఫ్రంట్ డెవలప్మెంట్ కార్పొరేషన్ లిమిటెడ్) ఉంది అని అంటున్నారు. ఔటర్ వరకు ఉన్న నీటి వనరులు, ప్రభుత్వ ఆస్తుల పరిరక్షణే హైడ్రా ధ్యేయమైనప్పుడు మూసీ హైడ్రా పరిధిలోకి ఎందుకు రాదు? నగరంలోని చెరువులకు ప్రత్యేకంగా జీహెచ్ఎంసీ, హెచ్ఎండీఏ ఉన్నాయి. గండిపేటకు సంబంధించి ప్రత్యేకంగా జలమండలి, నీటిపారుదల శాఖ ఉన్నాయి.
ఈ శాఖలు, విభాగాలన్నింటి అధికారాలు హైడ్రాకు బదిలీ అయినపుడు ఎంఆర్డీసీఎల్కు ప్రత్యేకంగా అధికారాలు మిగిలి ఉన్నాయా? ఉంటే ఆ విషయాన్ని జీవో 99లో ప్రభుత్వం పేర్కొనాలి కదా? మూసీ పరిధిలో కూల్చివేతలన్నీ రెవిన్యూ శాఖ ఆధ్వర్యంలోనే కొనసాగుతున్నాయి. హైడ్రా కూడా రెవెన్యూ శాఖ నోటీసులిచ్చిన ప్రాంతాల్లోనే కూల్చివేతలు చేపడుతున్నది. మూసీ విషయంలో మాత్రం హైడ్రా ఎందుకు తప్పించుకుంటుంది? ఆస్తుల పరిరక్షణకే హైడ్రా ఉన్నపుడు మూసీ ఎందుకు మినహాయింపు? దీని వెనక మతలబు ఏంది?
పూటకో లాజిక్
ప్రజలు నివాసమున్న నిర్మాణాల జోలికి వెళ్లబోమని సాక్షాత్తు హైడ్రా కమిషనర్ రంగనాథ్ సెలవిచ్చారు. కానీ మాదాపూర్ పరిధిలోని సున్నంచెరువు, మల్లంపేట పరిధిలోని కత్వా చెరువు పరిధిలో జనం నివాసమున్న నిర్మాణాలను కూల్చివేశారు. ఇదేమంటే.. సున్నం చెరువు పరిధిలోని వారు వ్యాపారం చేస్తున్నారని, కత్వా చెరువు పరిధిలో రాత్రికి రాత్రి గృహ ప్రవేశాలు జరిగాయని సెలవిచ్చారు. వాస్తవానికి సున్నంచెరువు పరిధిలో నిరుపేదలు నివసిస్తున్న ఇండ్లు ఉన్నాయి. సంగారెడ్డి పరిధిలోని అమీన్పూర్, కిష్టారెడ్డిపేటల్లో కూడా కొన్నేండ్ల నుంచి నివాసం ఉంటున్న వారి ఇండ్లు కూల్చేశారు.