ఇంతవరకు రాజకీయ పక్షాల ఆరోపణల్లో తరుచూ వినిపిస్తూ వచ్చిన ఆర్-ట్యాక్స్ గురించి ఇప్పుడు వివిధ వర్గాలు ఆందోళన చెందుతున్న పరిస్థితులు కనిపిస్తున్నాయి. రాష్ట్రంలో ముఖ్యనేత బంధువర్గం అనధికార సుంకం వసూలు చేస్తున్నదంటూ కొందరు బిల్డర్లు రాహుల్‌గాంధీకి ఫిర్యాదు చేసినట్టు సమాచారం. ఎస్ఎఫ్టీల లెక్కన రేట్లు ఫిక్స్ చేసి మరీ వసూలు చేస్తున్నారని, కట్టకపోతే హైడ్రా వస్తుందని బెదిరిస్తున్నారని బిల్డర్లు వాపోయినట్టు తెలిసింది.
హైదరాబాద్, మే 15 (నమస్తే తెలంగాణ) : హైడ్రా దెబ్బతో ఇప్పటికే కుదేలైన రియల్ ఎస్టేట్ రంగంపై మరో పిడుగు పడ్డట్టు తెలిసింది. సరి కొత్త ట్యాక్స్‌లు అనధికారికంగా అమల్లోకి వచ్చి రియల్టర్లు బెంబేలెత్తుతున్నట్టు సమాచారం. వీరిపై ప్రభుత్వ పెద్దలు ఆర్-ట్యాక్స్‌ను మోపినట్టు విశ్వసనీయంగా తెలిసింది. రియల్ ఎస్టేట్ వ్యాపారాన్ని మూడు విభాగాలుగా చేసి, క్యాటగిరీని బట్టి స్కేర్ ఫీట్‌కు ఇంత అని రేటు ఫిక్స్ చేసి వసూలు చేస్తున్నట్టు, ట్యాక్స్ కట్టకుంటే హైడ్రా వచ్చి లొంగదీసుకుంటుందని హెచ్చరికలు వస్తున్నట్టు రియల్టర్ వర్గాల్లో చర్చ నడస్తున్నది.
ముఖ్యనేత కనుసన్నల్లో ఆయన బంధువర్గం పర్యవేక్షణలోనే కొనసాగుతున్న ఆర్-టాక్స్ వసూళ్ల బాగోతం ఇటీవల హస్తినకు చేరినట్టు సమాచారం. హైదరాబాద్‌కు చెందిన కొందరు రియల్ ఎస్టేట్ వ్యాపారులు రాహుల్ గాంధీని కలిసి ఫిర్యాదు చేసినట్టు విశ్వసనీయంగా తెలిసింది. తెలంగాణలో ఆర్-ట్యాక్స్ పేరుతో బలవంతపు వసూళ్లు చేస్తున్నారని, అసలే ఇండ్ల కొనుగోళ్లు పడిపోయి, వ్యాపారం సరిగ్గా నడవక అప్పుల పాలైన తమకు ఈ ఆర్-ట్యాక్స్ ఆశనిపాతంగా మారిందని ఫిర్యాదులో పేర్కొన్నట్టు సమాచారం.
ఆర్-ట్యాక్స్ అనేది ముఖ్యనేత కనుసన్నల్లో ఆయన బంధువర్గం అమలు చేస్తున్న అనధికారిక సుంకమని రియల్ ఎస్టేట్ వ్యాపారులు చెప్తున్నారు. రియల్ వ్యాపారాన్ని లగ్జరీ విల్లాలు, విల్లాలు, సాధారణ అపార్ట్మెంట్లు, గృహాలు ఇలా క్యాటగిరీలుగా విభజించి క్యాటగిరీకో రేటు ఫిక్స్ చేసి వసూలు చేస్తున్నట్టు సమాచారం. లగ్జరీ విల్లాలైతే స్కేర్ ఫీట్‌కు రూ.200, విల్లాలకు రూ.150, సాధారణ అపార్టుమెంట్లు, గృహాలకు రూ.100 చొప్పున వసూలు చేస్తున్నట్టు రియల్టర్లు ఇటీవల రాహుల్ గాంధీకి చేసిన ఫిర్యాదులో వివరించినట్టు తెలిసింది. ఎలాంటి ఆటంకం లేకుండా ఇండ్లు కట్టి అమ్ముకోవాలంటే కన్స్ట్రక్షన్ కంపెనీలు ముఖ్యనేతకు కప్పం కట్టాల్సిందేనని వారు రాహుల్‌కు చెప్పినట్టు సమాచారం.
హైదరాబాద్ నగరంలో హైడ్రా వచ్చిన కొంత కాలానికే అధికారుల అండదండలతో అనధికార ఆర్-ట్యాక్స్ అమల్లోకి వచ్చిందని, ఏడాది నుంచి ముక్కు పిండి తమ వద్ద నుంచి వసూలు చేస్తున్నారని రియల్టర్లు గొల్లుమంటున్నారు. సుంకం చెల్లించకుంటే హైడ్రా వస్తుందని బెదిరిస్తున్నట్టు వాపోతున్నారు. ముందుగా హైడ్రా అధికారులు వచ్చి నోటీసులిస్తారని, నోటీసులకు లొంగక పోతే హైడ్రా బుల్డోజర్లు దిగుతాయని, అధికారులు వస్తారని పేరు చెప్పేందుకు ఇష్టపడని ఓ రియల్టర్ తెలిపారు. భవన నిర్మాణం కోసం జీహెచ్ఎంసీ అనుమతించిన ఎస్ఎఫ్టీల మేరకు టాక్స్ వసూలు చేస్తున్నారని ఫిర్యాదులున్నాయి.
హైదరాబాద్ చుట్టూ ఉన్న మేడ్చల్-మలాజిగిరి, రంగారెడ్డి, సంగారెడ్డి, హైదరాబాద్ నగర పరిసరాల్లోని విలువైన ప్రాంతాల్లో లగ్జరీ ఇండ్ల కొనుగోళ్లపై సంపన్న వర్గాల ప్రజలు ఆసక్తి చూపిస్తున్నారని, ఈ ఏడాది మొత్తం 36,974 నివాస గృహాల విక్రయాలు జరిగాయని, ఇందులో 12 శాతం లగ్జరీ విల్లాల వాటా ఉన్నదని రియల్ ఎస్టేట్ వ్యాపారులు చెప్తున్నారు. ఈ విల్లాలకు ఎస్ఎఫ్టీకి రూ 200 చొప్పున ఆర్- టాక్స్ వసూలు చేస్తున్నారని ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. రూ.కోటి నుంచి రూ. 2 కోట్ల ధర పలికే ఇండ్లపై స్కేర్ ఫీట్‌కు 150 చొప్పున వసూలు చేస్తున్నట్టు చెప్తున్నారు. రూ.50-80 లక్షల లోపు నివాసాల మీద రూ 100 చొప్పున వసూలు చేస్తున్నట్టు వాపోయారు.
నగరంలో మొత్తం విక్రయాల్లో మధ్య తరగతి, దిగువ మధ్య తరగతి ప్రజలు కొనుగోలు చేసే రూ.50-80 లక్షల లోపు నివాసాల వాటానే అధికంగా ఉంటుందని, కాంగ్రెస్ అధికారంలోకి వచ్చాక కొత్త కంపెనీలు రాలేదని, కొత్త ఉద్యోగాలు రాలేదని, వర్ ఫ్రమ్ హోమ్‌తో ఆఫీస్ స్పేస్ డిమాండ్ తగ్గిపోయిందని, దీంతో నగరంలో కమర్షియల్ స్పేస్ మిలియన్ల ఎస్ఎఫ్టీలు ఖాళీ ఉన్నాయని రియల్ ఎస్టేట్ వ్యాపారులు చెప్తున్నారు. అపార్ట్మెంట్ల సేల్స్ బాగా పడిపోయని వాపోతున్నారు. హైదరాబాద్ పరిసర ప్రాంతాల్లో 2 లక్షల గృహాలు, అపార్టుమెంట్లు కొనుగోలు లేక ఖాళీగా ఉన్నాయని, నిర్మాణం పూర్తయింది కాబట్టి ట్యాక్స్ కట్టాల్సిందేనని ముక్కుపిండి వసూలు చేస్తున్నట్టు బాధితులు రాహుల్ గాంధీకి వివరించినట్టు అత్యంత విశ్వసనీయంగా తెలిసింది.