హైదరాబాద్, జూన్ 4 (నమస్తే తెలంగాణ) : మేడ్చల్- మలాజిగిరి జిల్లా కూకట్‌పల్లిలోని సర్వే నంబర్ 1003 నుంచి 1006 వరకు ఉన్న 13.17 ఎకరాల స్థలం వ్యవహారంలో తాము జోక్యం చేసుకోబోమని హైడ్రా హైకోర్టుకు హామీ ఇచ్చింది. ఈ స్థలం విషయంలో ఇటీవల హైకోర్టు ఇచ్చిన ఉత్తర్వులు అమలుకావడం లేదంటూ ఎన్వీఎన్ కన్స్ట్రక్షన్స్ మూడు వేర్వేరు కోర్టు ధికరణ పిటిషన్లను దాఖలు చేసింది. వీటిపై జస్టిస్ నగేశ్ భీమపాక గురువారం విచారణ చేపట్టగానే హైడ్రా తరఫు న్యాయవాది జోక్యం చేసుకుంటూ.. కోర్టు ఆదేశించిన వ్యవహారంలో జోక్యం చేసుకోబోమని చెప్పా రు. దీంతో న్యాయమూర్తి కోర్టు ధికరణ పిటిషన్లపై విచారణను ఈ నెల 8కి వాయిదా వేశారు.
పిటిషనర్‌కు చెందిన నిర్మాణాలను కూల్చేసిన వ్యవహారంపై గతంలో తీవ్రంగా స్పందించిన హైకోర్టు, వాటిని 24 గంటల్లోగా పూర్వ స్థితిలో ఉండేలా చ ర్యలు తీసుకోవాలని ఆదేశించింది. ఓవైపు హైకోర్టు ఆదేశాలు, మరోవైపు స్వయంగా హైడ్రా హామీ ఇచ్చినప్పటికీ ఎలాంటి నోటీసులు ఇవ్వకుండా పిటిషనర్‌కు చెందిన స్థలంలోని కాంపౌండ్ ఫెన్సిం గ్, సెక్యూరిటీ గదులు, ప్రవేశద్వారాలను కూల్చివేయడాన్ని గత విచారణలో హైకోర్టు తీవ్రంగా తప్పుపట్టింది. యంత్రాలను ఇతర పరికరాలను ధ్వంసం చేయడం, విద్యుత్తు సరఫరా నిలిపివేయడాన్ని ఆక్షేపించింది. హైకోర్టు ఆదేశాల తర్వాత కూడా హైడ్రా జోక్యం చేసుకుంటున్నదని పిటిషనర్ తరఫు న్యాయవాది చెప్పారు. అయితే హైడ్రా హామీని పరిగణనలోకి తీసుకున్న న్యాయమూర్తి విచారణను వాయిదా వేస్తున్నట్టు ప్రకటించారు.