హైదరాబాద్, సెప్టెంబర్ 25 (నమస్తే తెలంగాణ): హైదరాబాద్ విపత్తు నిర్వహణ-ఆస్తుల పర్యవేక్షణ, పరిరక్షణ సంస్థ(హైడ్రా)కు 169 మంది సిబ్బందిని రాష్ట్ర ప్రభుత్వం కొత్తగా కేటాయించింది. ఈ పోస్టులను వివిధ విభాగాల్లో డిప్యూటేషన్ ప్రాతిపదికన భర్తీ చేయడానికి మునిసిపల్ అడ్మినిస్ట్రేషన్, అర్బన్ డెవలప్మెంట్ డిపార్ట్మెంట్కు అనుమతిస్తూ బుధవారం ఉత్తర్వులు జారీ చేసింది. నలుగురు అదనపు కమిషనర్లు, ఐదుగురు డీసీపీలు, 16 మంది సీఐలు, 16 మంది ఎస్ఐలు, 60 మంది పోలీస్కానిస్టేబుళ్లు, 12 మంది స్టేషన్ ఫైర్ ఆఫీసర్లు, 10 మంది అసిస్టెంట్ ఇంజినీర్లతోపాటు మొత్తం 169 పోస్టులు హైడ్రాకు కేటాయించాలని ప్రభుత్వ ముఖ్య కార్యదర్శి సందీప్‌కుమార్ సుల్తానియా ఉత్తర్వులు జారీచేశారు.
గురుకులాలకు సొంత భవనాలు నిర్మించండి
హైదరాబాద్, సెప్టెంబర్ 25 (నమస్తే తెలంగాణ) : ప్రభుత్వ గురుకుల విద్యా సంస్థలలో సొంత భవనాలు నిర్మించి, వసతి సౌకర్యాలు మెరుగుపరుచాలని సీఎస్ శాంతికుమారికి టీఎస్ యూటీఎఫ్, గురుకులాల సంఘాల జేఏసీ తరఫున ఎమ్మెల్సీ నర్సిరెడ్డి బుధవారం వినతిపత్రం అందజేశారు. ప్రభుత్వ ఆధ్వర్యంలో కొనసాగుతున్న ఐదు రకాల సొసైటీల పరిధిలో 1022 గురుకులాలు కొనసాగుతున్నాయని, వాటిలో 700 గురుకులాలకు సొంత భవనాలు నిర్మించాలని కోరారు.