నేషనల్ స్టూడెంట్ మోటార్ స్పోర్ట్స్ పోటీలుప్రపంచంలోనే అత్యంత వేగవంతమైన ఎలక్ట్రిక్ కార్లు హైదరాబాద్ వీధుల్లో పరుగులు తీశాయి. భవిష్యత్తు కోసం తెలంగాణ సిద్ధంగా ఉందన్న విషయం దీంతో రుజువైంది. ఈ-రేసు రూ. 700 కోట్ల ఆర్థిక కార్యకలాపాలను సృష్టించి అంతర్జాతీయ దృష్టిని హైదరాబాద్ వైపు మళ్లించింది.– కేటీఆర్
హైదరాబాద్, అక్టోబర్ 11 (నమస్తే తెలంగాణ): తమ హయాంలో నిర్వహించిన ఫార్ములా ఈ-రేసు ఒక క్రీడా కార్యక్రమం మాత్రమే కాదని, ఆవిష్కరణలు, క్లీన్ మొబిలిటీ, అత్యాధునిక సాంకేతికతకు తెలంగాణ కేంద్రంగా మారిందని చెప్పేందుకు ప్రతీక అని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ పేర్కొన్నారు. కోయంబత్తూరులో శుక్రవారం జరిగిన 10వ ఎఫ్ఎంఏఈ నేషనల్ స్టూడెంట్ మోటార్ స్పోర్ట్స్ పోటీలు-2025కి ఆయన ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ప్రపంచంలోనే అత్యంత వేగవంతమైన ఎలక్ట్రిక్ కార్లు హైదరాబాద్ నగర వీధుల్లో పరుగెత్తాయని, భవిష్యత్తు కోసం తెలంగాణ సిద్ధంగా ఉందన్న విషయం దీంతో రుజువైందని అన్నారు. ఈ రేసు దాదాపు రూ. 700 కోట్ల ఆర్థిక కార్యకలాపాలను సృష్టించి అంతర్జాతీయ దృష్టిని హైదరాబాద్ వైపు మళ్లించిందని తెలిపారు. తెలంగాణ స్థిరమైన, సాంకేతిక ఆధారిత పారిశ్రామిక అభివృద్ధి లక్ష్యాన్ని కలిగి ఉందని, త్వరలోనే దేశ మొబిలిటీ వ్యాలీగా హైదరాబాద్ ఆవిర్భవించబోతున్నదని ధీమా వ్యక్తంచేశారు. మోటార్ స్పోర్ట్స్ అంటే కేవలం వేగం కాదని, అది తమ సామర్థ్యాలను పరీక్షించుకోవడం, హద్దులను ఛేదించడమని, యువత కూడా తమ జీవితంలో రేస్ కారులా దూసుకుపోవాలని కేటీఆర్ సూచించారు.
యువత ఉద్యోగాలు సృష్టించాలి
వందల మంది యువ ఇంజినీర్లకు సందేశమిస్తూ అవకాశాల కోసం ఎదురు చూడకుండా, వాటిని వారే సృష్టించుకునే విధంగా ఎదగాలని కేటీఆర్ పిలుపునిచ్చారు. ‘యువత సొంతంగా ఒక క్యూను సృష్టించగలిగినప్పుడు, ఇతరులు ఏర్పాటు చేసిన క్యూలో ఎందుకు నిలబడాలి?’ అని ప్రశ్నించారు. ‘ఉద్యోగాల కోసం ఎదురు చూడకుండా, ఉద్యోగాలు ఇచ్చే యజమానులుగా మారాలి. పెద్ద కలలు కనడం ప్రారంభించాలి. ఆ తర్వాత తమ సామర్థ్యాన్ని చూసి తామే ఆశ్చర్యపోతారు’ అని పేర్కొన్నారు. తెలంగాణ రాష్ట్ర సాధన ప్రయాణాన్ని గురించి ఈ సందర్భంగా ఆయన గుర్తుచేశారు. ఒకప్పుడు రాష్ట్ర ఏర్పాటు అసాధ్యమని చాలామంది సందేహం వ్యక్తంచేశారు. కానీ, ఇప్పుడు 11 సంవత్సరాల తర్వాత అనేక రంగాలలో దేశానికి ఆదర్శంగా నిలబడ్డామని, తెలంగాణ సాధించిన ప్రగతి, విశ్వాసానికి పట్టుదలకు, దార్శనికతకు నిదర్శనంగా ఉన్నామని స్పష్టం చేశారు. ఆదాయం కంటే ప్రభావానికి, అధికారం కంటే ప్రామాణికతకు ప్రాధాన్యం ఇవ్వాలని, వేగం, విస్తరణ పట్ల ఆసక్తి కలిగి ఉండాలని సూచించారు. మోటార్ స్పోర్ట్స్ అయినా, పరిపాలన అయినా, జీవితంలో అయినా విజయం యాదృచ్ఛికంగా రాదని, మనం మన అవకాశాలను కల్పించుకుని, ధైర్యంతో వాటిని అమలు చేసినప్పుడే భవిష్యత్తు నిర్మితమవుతుందని కేటీఆర్ పేర్కొన్నారు. ప్రపంచంలోనే అతిపెద్ద స్టార్టప్ ఇంక్యుబేటర్
ఐటీ మంత్రిగా తన హయాంలో ప్రపంచంలోనే అతిపెద్ద స్టార్టప్ ఇంక్యుబేటర్ అయిన టీహబ్ దేశంలోనే అతిపెద్ద ప్రోటోటైపింగ్ కేంద్రమైన టీవర్స్ అని, ఇటు వంటి సంస్థల ద్వారా తెలంగాణ అంతర్జాతీయ స్థాయిలో ప్రశంసలు పొందిందని కేటీఆర్ వివరించారు. ఒక ఆలోచన టీహబ్ నుంచి టీవర్స్కు వెళ్లడానికి టీ తాగేంత సమయం మాత్రమే పడుతుందంటూ ఆలోచన అమలు వేగం గురించి చమతరించారు.