కాంగ్రెస్ ప్రభుత్వ ఆలోచనలు ‘భూమి’ చుట్టే తిరుగుతున్నాయి. తీసుకుంటున్న నిర్ణయాలు, చేపడుతున్న కార్యక్రమాలు అంతిమంగా రియల్ఎస్టేట్ వ్యాపారానికో, ‘బిగ్’ దందాకో దారితీస్తున్నాయి. ఫోర్త్‌సిటీ అయినా, హిల్ట్ పాలసీ అయినా, హాట్‌టాపిక్‌గా నడుస్తున్న మూసీ సుందరీకరణ అయినా.. అన్నింటా అదే అగుపిస్తున్నది. కాంగ్రెస్ ప్రభుత్వం కొలువుదీరినప్పటి నుంచీ చేపట్టిన ప్రతి ప్రాజెక్టు వెనుక రియల్ఎస్టేట్ కోణమే కొట్టొచ్చినట్టు కనిపిస్తున్నది. తాజాగా హైదరాబాద్ రియల్ఎస్టేట్ రంగంలోనే అతిపెద్ద కుంభకోణానికి తెరలేచిందనే ఆరోపణలు వినిపిస్తున్నాయి. టీడీఆర్ (ట్రాన్స్ఫరబుల్ డెవలప్మెంట్ రైట్స్) బాండ్లకు సంబంధించి ముఖ్యనేత అనుచరులు సూత్రధారులుగా నడిపిన ఈ ‘బిగ్’ దందాలో.. సర్కారే పాత్రధారి! సామాన్య కొనుగోలుదారులే సమిధలు! మూడు దశల్లో స్కామ్‌కు కామ్‌గా రంగం సిద్ధం చేసినట్టు తెలుస్తున్నది. టీడీఆర్లన్నీ అగ్గువకు కొనేయ్! 22 శాతంగా ఉన్న వాటిని 60 శాతానికి పెంచుకో! మార్కెట్లో కొరత సృష్టించాక.. ప్రతి నిర్మాణానికీ బాండ్లను తప్పనిసరి చేస్తూ ప్రభుత్వం జీవో జారీ చేయడం! కుంభకోణం వెనుక కుట్ర ఇదే!
హైదరాబాద్ సిటీబ్యూరో ప్రధాన ప్రతినిధి, మార్చి 24 (నమస్తే తెలంగాణ) : హైదరాబాద్ రియల్ ఎస్టేట్‌ను ముఖ్యనేత అనుచరుల గుప్పిట్లోకి మళ్లించేందుకు పకడ్బందీగా ట్రాన్స్ఫరబుల్ డెవలప్మెంట్ రైట్స్ (టీడీఆర్) బాండ్ల కుంభకోణానికి ప్రణాళికలు రచించారని తెలుస్తున్నది. అందుకు కొద్దినెలలుగా పక్కాగా రంగం సిద్ధంచేశారని సమాచారం. ఈ కుంభకోణానికి మొత్తం మూడు దశల్లో ప్రణాళిక రచించినట్టు చెప్తున్నారు. మొదట మార్కెట్లోని 90% బాండ్లను అగ్గువకు వారే కొనుగోలు చేశారని, ఆ తర్వాత 22-27 శాతానికి లభించే బాండ్ల ధరను ఏకంగా 60 శాతానికి పెంచారని, మూడో దశలో వాటి వినియోగాన్ని విస్తృతం చేసేందుకు రాష్ట్ర ప్రభుత్వం ద్వారా ‘నిర్మాణ రంగంలో టీడీఆర్ బాండ్ల వినియోగం అనివార్యం’ అని ఉత్తర్వులు విడుదల చేయించారని చెప్తున్నారు. దీంతో సామాన్య బిల్డర్లు మొదలు బడా నిర్మాణ సంస్థల వరకు ఇటుక పేర్చాలంటే టీడీఆర్‌ను కొనుగోలు చేయక తప్పని పరిస్థితులు కల్పించిందని చెప్తున్నారు. తద్వారా ‘బిగ్’ టీమ్ బాండ్లను భారీ ధరలకు అమ్మి రూ.కోట్లు కొల్లగొట్టనున్నదని చెప్తున్నారు
హైదరాబాద్ నగరంలో మౌలిక వసతుల కల్పనలో భాగంగా ఫ్లైఓవర్లు, రోడ్ల విస్తరణ, ఇతర ప్రాజెక్టులను చేపట్టాలంటే ప్రాజెక్టు వ్యయం కంటే భూసేకరణ వ్యయం భారీగా పెరిగిపోతున్నది. ఈ నేపథ్యంలో నిధులలేమితో అభివృద్ధి పనులు నిలిచిపోకుండా ఉండేందుకు, అటు ఆస్తులు కోల్పోయిన బాధితులు సైతం నష్టపోకుండా ఉండేందుకు ఉమ్మడి రాష్ట్రంలో 2012 నుంచి టీడీఆర్ (ట్రాన్స్ఫర్ ఆఫ్ డెవలప్మెంట్ రైట్స్) బాండ్ల జారీ విధానాన్ని అమల్లోకి తెచ్చారు. నిబంధనల ప్రకారం ఆస్తి కోల్పోయిన వారికి ఎంత నష్టపరిహారం చెల్లించాల్సి ఉంటుందో ఆ మేరకు అంత విలువైన టీడీఆర్ బాండ్లను జారీ చేస్తారు. ఇలా జీహెచ్ఎంసీ, హెచ్ఎండీఏ గతంలో రూ.వందల కోట్ల విలువైన బాండ్లు జారీ చేశాయి. ఆయా బాండ్ల వివరాలు ఆయా విభాగాల (జీహెచ్ఎంసీ, హెచ్ఎండీఏ) వెబ్సైట్లలో అప్లోడ్ చేసి ‘టీడీఆర్ బ్యాంకు’గా అందుబాటులో ఉంచుతారు.
ఈ బాండ్లు అవసరం ఉన్న బిల్డర్లు, నిర్మాణ సంస్థలు నేరుగా బాండు ఉన్న వారిని సంప్రదించి అప్పటి మార్కెట్లో ఉన్న మేరకు ధర చెల్లించి వాటిని పొందుతారు. దానిని తమ నిర్మాణ ప్రాజెక్టుల్లో వినియోగించుకుంటారు. రెండుమూడు రోజుల కిందటివరకు ఈ బాండ్ల వినియోగంలో అధికారులుగానీ ప్రభుత్వ జోక్యంగానీ ఎక్కడా ఉండేది కాదు. ఆస్తి కోల్పోయినవారు తమ ఇష్టానుసారం బాండ్లను విక్రయించుకునేవారు. కేసీఆర్ ప్రభుత్వ హయాంలో వ్యూహాత్మక రహదారుల అభివృద్ధి కార్యక్రమం (ఎస్ఆర్డీపీ), వ్యూహాత్మక నాలా అభివృద్ధి కార్యక్రమం (ఎస్ఎన్డీపీ) ఇలా మౌలిక వసతుల కల్పనను పెద్దఎత్తున చేపట్టిన సంగతి తెలిసిందే. దీంతో టీడీఆర్ బాండ్లు భారీగా పెరిగిపోయాయి. కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడేనాటికి హైదరాబాద్ నగర మార్కెట్లో దాదాపు రూ.వెయ్యి కోట్ల విలువైన బాండ్లు అందుబాటులో ఉన్నాయని అంచనా.
తెలంగాణ ఏర్పడిన తర్వాత జీహెచ్ఎంసీ దాదాపు 37.32 లక్షల చదరపు గజాల టీడీఆర్ బాండ్లను జారీ చేయగా అందులో 20 లక్షల చదరపు గజాల మేర బాండ్ల వినియోగం పూర్తయింది. ఇంకా 15.36 లక్షల చదరపు గజాల బాండ్లు జీహెచ్ఎంసీ టీడీఆర్ బ్యాంకులో ఉన్నాయి. అదేవిధంగా హెచ్ఎండీఏకు సంబంధించి మరో లక్షన్నర చదరపు అడుగుల మేర బాండ్లు ఆ విభాగం బ్యాంకులో ఉన్నాయి. కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడేనాటికి మార్కెట్లో టీడీఆర్ బాండ్ల విలువ సుమారు 22 నుంచి 27% వరకు ఉన్నది. అంటే రూ.100 విలువైన బాండ్లను రూ.22-27 వరకు కొనుగోలు చేసే పరిస్థితులు ఉన్నాయి. దీనిని అనుకూలంగా మలుచుకున్న సదరు ‘బిగ్ బృందం’ గుట్టుచప్పుడు కాకుండా భారీ ఎత్తున బాండ్లను కొనుగోలు చేసింది. దాదాపు రూ.500-600 కోట్ల విలువైన బాండ్లను కొనుగోలు చేసిందని మార్కెట్‌వర్గాలు చెప్తున్నాయి. అయితే, వీటి కొనుగోలు ప్రక్రియ పూర్తయ్యే వరకు జీహెచ్ఎంసీ, హెచ్ఎండీఏ నుంచి కొత్తగా టీడీఆర్ బాండ్ల జారీ నిలిపివేశారని రియల్ఎస్టేట్ వర్గాలు తెలిపాయి.
ఈ విషయం బయటికిపొక్కి ఎవరైనా ప్రశ్నిస్తే ‘బాండ్ల జారీ నిలిపివేయాలని ప్రభుత్వం నుంచి ఆదేశాలున్నాయి’ అని అప్పట్లో ప్లానింగ్ విభాగం వర్గాలు బుకాయించాయి. ప్రభుత్వం ఇలా ఎందుకు మౌఖిక ఆదేశాలు జారీ చేసిందని ఆరా తీసేలోపే బిగ్ బృందం 90% బాండ్లను తమ గుప్పిట్లోకి తీసుకున్నది. మార్కెట్లో టీడీఆర్ బాండ్ల కృత్రిమ కొరతను సృష్టించింది. సదరు బృందం నుంచి కొనుగోలు చేసిన బాండ్లు మినహా మిగిలిన బాండ్ల వివరాలను ఆన్లైన్లో కనబడకుండా చేశారని, ఇందులో అధికారుల హస్తం కూడా ఉన్నదని అప్పట్లో ఆరోపణలొచ్చాయి. అయితే, వీరి బాండ్లను మాత్రమే బిల్డర్లు కొనుగోలు చేసేలా జీహెచ్ఎంసీ జోన్‌కు ఒక దళారీని నియమించి ఎప్పటికప్పుడు పర్యవేక్షించినట్టు చెప్తున్నారు. మార్కెట్లో టీడీఆర్‌ల కొరత సృష్టించి రేటును ఒక్కసారిగా 60 శాతానికి పెంచారని సమాచారం. దీంతో సాధారణ బిల్డర్లు గగ్గోలు పెట్టారు. ఈ క్రమంలో మామూలు బిల్డర్లు కొత్త ప్రాజెక్టులను చేపట్టకుండా చేతులెత్తేశారు. బడా నిర్మాణ సంస్థలు కొన్ని అప్పటికే తాము కొనుగోలు చేసిన వాటిని వినియోగించుకోగా, మిగిలిన వాటికి ఎక్కువ రేటు చెల్లించి కొనుగోలు చేశాయి.
నిర్మాణ రంగంలో బిల్డర్లు, నిర్మాణ సంస్థలు టీడీఆర్ బాండ్ల వినియోగం వారి ఇష్టానుసారంగానే ఉండేది. ఇష్టముంటే బాండ్లు, లేకపోతే ఆ మేరకు డబ్బులు చెల్లిస్తే సరిపోయేది. అంటే బిగ్ బృందం సేకరించిన బాండ్ల విక్రయం బిల్డర్లు, నిర్మాణ సంస్థల దయ మీద ఆధారపడి ఉండేది. కానీ, ప్రభుత్వం ఇచ్చిన వరుస ‘అనివార్య’ ఉత్తర్వులతో పరిస్థితులు పూర్తిగా మారిపోయాయి. ఈ ఏడాది జనవరిలో రాష్ట్ర ప్రభుత్వం పది అంతస్తుల నిర్మాణంలో 10% మేర టీడీఆర్ బాండ్ల వినియోగాన్ని తప్పనిసరి చేస్తూ జీవో-16 జారీ చేసింది. దీంతో సామాన్య, మధ్య తరగతి బిల్డర్లపై పెద్దగా ప్రభావాన్ని చూపలేదు. ఈ నెల 21న ప్రత్యేకంగా టీడీఆర్‌లపై ప్రభుత్వం మరో జీవో-95 జారీ చేసింది.
ఇందులో 750-2000 చదరపు మీటర్ల విస్తీర్ణంలోని నిర్మాణాలకూ టీడీఆర్ బాండ్లను తప్పనిసరి చేసింది. మరో అడుగు ముందుకేసి భవన నిర్మాణాల ఉల్లంఘనలకు పాల్పడినా టీడీఆర్ బాండ్లతో వాటిని మాఫీ చేసుకునే వెసులుబాటు కల్పించింది. అంటే 10% వరకు ఉల్లంఘనలకు పాల్పడితే బాండ్లు సమర్పించి ఆక్యుపెన్సీ సర్టిఫికెట్లు పొందేలా జీవో-95లో వెసులుబాటు కల్పించారు. ఈ జీవోలతో సామాన్య, మధ్య తరగతి బిల్డర్ నుంచి బడా నిర్మాణ సంస్థల వరకు తమ ప్రాజెక్టుల్లో టీడీఆర్ బాండ్లులేనిదే ఇటుక పేర్చలేని పరిస్థితులు కల్పించారు. తద్వారా మార్కెట్లో బాండ్లకు భారీ డిమాండ్ పెరుగుతుంది. అప్పుడు సదరు బిగ్ బృందంలో చేతుల్లో ఉన్న బాండ్లు కాసులు కురిపించేలా వ్యూహాన్ని అమలు చేశారనేది మార్కెట్‌వర్గాలు చెప్తున్నాయి.