హైదరాబాద్, ఆగస్టు 11 (నమస్తే తెలంగాణ) : తెలంగాణ ప్రభుత్వం ఆతిథ్యం ఇవ్వనున్న ఖేలో ఇండియా యూత్ గేమ్స్-2026 పోటీలను ప్రతిష్టాత్మకంగా నిర్వహించాలని ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి అధికారులను ఆదేశించారు. మంగళవారం ఎంసీఆర్హెచ్ఆర్డీలోని బోధి పెవిలియన్‌లో ఖేలో ఇండియా యూత్ గేమ్స్ ఏర్పాట్లు, నిర్వహణపై మంత్రి వాకిటి శ్రీహరితో కలిసి ఉన్నతాధికారులతో సమీక్ష నిర్వహించారు. డిసెంబర్లో జరిగే పోటీల్లో వివిధ రాష్ట్రాల నుంచి క్రీడాకారులు రానున్నందు మౌలిక వసతులు చేపట్టాలని సీఎం ఆదేశించారు. నగరంలోని స్టేడియాల్లో ప్రస్తుత పరిస్థితిని పరిశీలించి, క్రీడా పోటీలకు అనుగుణంగా అభివృద్ధి పనులు చేపట్టాలని సూచించారు. ప్రారంభోత్సవ, ముగింపు వేడుకలకు సంబంధించిన ముఖ్య అతిథులు, ప్రముఖ క్రీడాకారులు, సినీ ప్రముఖులను కార్యక్రమాల్లో భాగస్వాములను చేసేందుకు ఇప్పటి నుంచే కసరత్తు ప్రారంభించాలని ఆదేశించారు. తెలంగాణకు చెందిన అర్జున అవార్డు గ్రహీతలు, స్పోర్ట్స్‌హబ్ బోర్డు సభ్యులు, ఒలింపిక్స్ అసోసియేషన్‌తోపాటు జాతీయస్థాయి క్రీడా ప్రతినిధులను కార్యక్రమంలో భాగస్వాములను చేయాలని సూచించారు. ఖేలో ఇండియా యూత్ గేమ్స్‌లో భాగంగా 20 విభాగాల్లో పోటీలు నిర్వహించనున్న నేపథ్యంలో ప్రదేశాలను గుర్తించి ఏర్పాట్లు చేయాలని ఆదేశించారు. సమావేశంలో ప్రభుత్వ సలహాదారు రామకృష్ణారావు, ఎస్ఏటీజీ చైర్మన్ శివసేనారెడ్డి, క్రీడాశాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి జయేశ్‌రంజన్, ఎస్ఏటీజీ ఎండీ సోనీబాలదేవి తదితరులు పాల్గొన్నారు.