హైదరాబాద్, జూన్ 4 (నమస్తే తెలంగాణ): బీజేపీ గోషామహల్ ఎమ్మెల్యే రాజాసింగ్‌కు సొంత పార్టీ రాష్ట్ర నాయకత్వం నోటీసులు ఇవ్వనున్నదని తెలుస్తున్నది. పార్టీ అంతర్గత విషయాలను మీడియా ముందు వెల్లడిస్తున్నారని రాజాసింగ్ వైఖరిపై బీజేపీ కేంద్ర నాయత్వం సీరియస్‌గా ఉన్నట్టు తెలుస్తున్నది. ఈ నేపథ్యంలో హైకమాండ్ ఆదేశాలతో రాష్ట్ర పార్టీ నోటీసులు ఇవ్వనున్నట్టు సమాచారం. ఆయన వివరణ ఆధారంగా చర్యలుంటాయని పార్టీ వర్గాల్లో చర్చ జోరందుకున్నది.
ఇవేమీ తనకు పట్టవన్నట్టు రాజాసింగ్ సొంత పార్టీ నేతలపై విరుచుకుపడుతున్నారు. నన్ను సస్పెండ్ చేస్తే అందరి జాతకాలు బయట పెడతా అంటూ రాజాసింగ్ చేసిన వ్యాఖ్యలు ఆ పార్టీలో తీవ్ర దుమారం రేపాయి. ఇటీవల రాజాసింగ్ అంశం రాష్ట్ర కార్యవర్గ భేటీలో చర్చకు వచ్చింది. రాజాసింగ్ వ్యాఖ్యలతో పార్టీకి నష్టం చేకూరుతున్నదని కీలక నేతలు ఈ భేటీలో అవేదన వ్యక్తం చేసినట్టు తెలిసింది.
తనపై కరీంనగర్ నుంచే వార్ మొదలైందని.. దొంగలంతా ఒక్కటయ్యారని రాజాసింగ్ వ్యాఖ్యానించారు. ఈ వ్యాఖ్యలు బండి సంజయ్‌ని ఉద్దేశించే చేశారని పార్టీలో చర్చ మొదలైంది. మరి రాజాసింగ్‌పై పార్టీ నాయకత్వం ఏ మేరకు చర్యలు తీసుకుంటుందో తేలాల్సి ఉందని చర్చ నడుస్తున్నది.