హైదరాబాద్ సిటీబ్యూరో, జూలై 5(నమస్తే తెలంగాణ) : హైదరాబాద్ మహానగరానికి మణిహారంగా మారాల్సిన మెట్రో రైల్ ప్రాజెక్ట్.. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల నడుమ దోబూచులాడుతున్నది. ఇటీవల ఢిల్లీ వేదికగా ఉన్నత స్థాయి సమీక్ష హడావుడిగా ముగిసి 12 రోజులు గడిచినా, అడుగుముందుకు పడకపోగా వారి వైఫల్యం మాత్రం కొట్టొచ్చినట్టు కనిపిస్తున్నది. రెండు ప్రభుత్వాలు చేస్తున్న జాప్యాన్ని ఒకరిపై ఒకరు నెట్టుకుంటూ కాలయాపన చేస్తూ లేఖల పర్వానికి తెరతీశారు. సీఎం రేవంత్‌రెడ్డి అడుగు ముందుకేసి కేంద్ర మంత్రులు మనోహర్‌లాల్ ఖట్టర్, కిషన్‌రెడ్డికి లేఖలు రాశారు.
ఢిల్లీ సమావేశాల్లో మెట్రో ఫేజ్-1 ఆస్తుల విలువ నిర్ధారణ, అధిక వడ్డీ రుణాల పునర్వ్యవస్థీకరణ, ఫేజ్-2 విస్తరణకు నిధుల సమీకరణ బాధ్యతలను కేంద్ర ప్రభుత్వ నోడల్ ఏజెన్సీ ఎస్బీఐ క్యాప్స్‌కు అప్పగించాలని ఉమ్మడిగా నిర్ణయించారు. దీనిపై కేంద్రం వద్ద అంగీకరించిన సీఎం రేవంత్‌రెడ్డి.. ఇప్పుడేమో జాప్యం జరుగుతున్నదంటూ కేంద్రానికి లేఖలు రాయడం మొదలుపెట్టారు. సమావేశం జరిగి రెండు వారాలవుతున్నా కేంద్ర పట్టణ మంత్రిత్వ శాఖ ఇప్పటివరకు టర్మ్స్ ఆఫ్ రిఫరెన్స్‌ను ఖరారు చేయకుండా నిర్లక్ష్యం చేస్తున్నదని లేఖలో పేర్కొన్నారు. అదేవిధంగా ఎస్బీఐ క్యాప్స్‌కు బాధ్యతలు అప్పగించలేదని గగ్గోలు పెట్టారు.
కేంద్రానికి లేఖలు రాయడం, దానికి కేంద్రం నుంచి మొక్కుబడి సమాధానం రావడం మెట్రో విషయంలో సర్వసాధారణమైంది. ఈ రోటీన్ పొలిటికల్ మైలేజ్ గేమ్‌తో సగటు హైదరాబాదీ ప్రయాణికుడికి వచ్చే లాభమేంటనే చర్చ నడుస్తున్నది. ఫేజ్-1 స్వాధీనం ప్రక్రియ ఆలస్యం కావడంతో మెట్రో రోజూవారీ నిర్వహణలో అనిశ్చిత స్థితి నెలకొన్నదని, సాంకేతిక లోపాలు, రద్దీ నియంత్రణ వంటి అంశాలను లేఖలో పేర్కొన్న సీఎం రేవంత్‌రెడ్డి.. ఒకవేళ స్వాధీన ప్రక్రియ పూర్తి కాకపోతే ప్రత్యామ్నాయ మార్గాలను ముందే ఎందుకు ఆలోచన చేయలేదని నగరవాసులు ప్రశ్నిస్తున్నారు. ప్రచార ఆర్భాటానికి నెత్తిన వేసుకున్న మెట్రో గుదిబండను, ఎల్అండ్టీతో వచ్చిన అప్పులు, నెలవారీ వడ్డీల భారం పేచీని తప్పించుకొనేందుకే కేంద్రానికి లేఖలు రాస్తున్నారనే విమర్శలు వస్తున్నాయి. ఇక ఫేజ్-2 డీపీఆర్‌ల ఆమోదం, నిధుల సమీకరణ ఆలస్యమైతే ప్రాజెక్టు అంచనా వ్యయం కోట్ల రూపాయలకు పెరిగిపోతుందనే అవగాహన లేకుండా, ప్రజాధనాన్ని ప్రాజెక్టుల పేరిట కుమ్మరించడమే లక్ష్యంగా కాంగ్రెస్ పనిచేస్తున్నదనే ఆరోపణలు ఉన్నాయి.
డీపీఆర్ కేంద్రానికి అప్పగించేశాం.. అనుమతులు ఇవ్వట్లేదంటూ కూనిరాగాలు తీసిన రేవంత్ సర్కార్.. ఈ రెండున్నరేండ్లలో మెట్రో విషయంలో చేసిందేమీ లేదు. తాజాగా అదే విధానాన్ని అనుసరిస్తూ సంప్రదింపులు, చర్చలు, లేఖల బాటను అనుసరిస్తున్నారు. ఢిల్లీ స్థాయిలో ప్రత్యేక ప్రతినిధులను పంపి ఒత్తిడి తీసుకురావడంలో రాష్ట్ర ప్రభుత్వం ఎందుకు వెనుకబడిందనే విమర్శలున్నాయి. హైదరాబాద్ వంటి అంతర్జాతీయ నగర ప్రజారవాణా వ్యవస్థ కీలక ఫైళ్లను కేంద్ర శాఖతొక్కిపెడుతుండటం.. తెలంగాణపై కేంద్రానికి పక్షపాత వైఖరి ఉన్నదనే అనుమానాలను బలపరుస్తున్నది. హైదరాబాద్ భవిష్యత్ అవసరాలకు మెట్రో ఫేజ్-2 విస్తరణ అత్యంత కీలకం. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు ఈ లేఖల పర్వానికి ముగింపు పలికి మెట్రో విస్తరణ చేయాలని నగరవాసులు డిమాండ్ చేస్తున్నారు.