హైదరాబాద్: హైదరాబాద్ మెట్రోలో ప్రయాణికుల సంఖ్య రికార్డు స్థాయికి చేరింది. శుక్రవారం ఒక్కరోజే నాలుగు లక్షల మంది ప్రయాణించినట్లు మెట్రో రైల్ అధికారులు వెల్లడించారు. గణేశ్ నిమజ్జనం సందర్భంగా నిన్న రాత్రి 2 గంటల వరకు మెట్రో సర్వీసులు నిర్వహించిన విషయం తెలిసిందే. దీంతో మెట్రో రైళ్లలో ప్రయాణించినవారి సంఖ్య భారీగా పెరిగింది.
ఒక్క మియాపూర్-ఎల్బీనగర్ కారిడార్లోనే 2.46 లక్షల మంది ప్రయాణించారని, నాగోల్-రాయదుర్గం మార్గంలో 1.49 లక్షలు, జేబీఎస్-ఎంజీబీఎస్ కారిడార్లో 22 వేల మంది ప్రయాణించారని అధికారులు తెలిపారు. అత్యధికంగా ఖైరతాబాద్ స్టేషన్లో 22 వేల మంది రైలు ఎక్కగా, 40 వేల మంది రైలు దిగినట్లు పేర్కొన్నారు.