హైదరాబాద్, ఏప్రిల్ 13 (నమస్తే తెలంగాణ): ఎండల తీవ్రతతో రాష్ట్రం నిప్పులకొలిమిలా మారింది. పెరిగిన ఎండలతోపాటు వడగాలులు, ఉక్కపోతతో ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. గత మూడ్రోజులుగా ఎండలకు భయపడి బయటకు రావాలంటే జనం జంకుతున్నారు. దీంతో మధ్యాహ్న సమయాల్లో రహదారులన్నీ నిర్మానుష్యంగా మారుతున్నాయి. ఈక్రమంలో రాష్ట్రవ్యాప్తంగా అన్ని జిల్లాలలో దాదాపు 41 డిగ్రీలకుపైగా ఉష్ణోగ్రతలు నమోదైనట్టు హైదరాబాద్ వాతావరణ కేంద్రం సోమవారం ఒక ప్రకటనలో వెల్లడించింది. దీంతో ఆయా జిల్లాలకు ఎల్లో అలర్ట్ జారీచేసినట్టు తెలిపింది.
హైదరాబాద్లో కూడా దాదాపు 40 డిగ్రీల ఉష్ణోగ్రత నమోదైనట్టు వివరించింది. ఉత్తర మధ్యప్రదేశ్ నుంచి దక్షిణ తమిళనాడు వరకు ఏర్పడిన ద్రోణి కారణంగా వచ్చే మూడ్రోజులు ఉష్ణోగ్రతలు మరింత పెరిగే అవకాశాలున్నట్టు వెల్లడించింది. ఫలితంగా రాష్ట్రమంతటా వేడిగాలులు వీస్తాయని తెలిపింది. ఆదిలాబాద్ జిల్లా తలమడుగులో అత్యధికంగా 41.8 డిగ్రీలు నమోదు కాగా, నిర్మల్ జిల్లాలో 41.7, భద్రాద్రి కొత్తగూడెంలో 41.6, జగిత్యాలలో 41.6, జోగుళాంబ గద్వాలలో 41.6, కామారెడ్డిలో 41.6, ఖమ్మంలో 41.6 డిగ్రీల గరిష్ఠ ఉష్ణోగ్రతలు నమోదయ్యాయని పేర్కొన్నది.
ఇదిలా ఉండగా ఈనెల 19 నుంచి 31వరకు అత్యవసర హెచ్చరిక జారీ చేసినట్టు హైదరాబాద్ వాతావరణ కేంద్రం తెలిపింది. ఈ తేదీల్లో ఉదయం 10 గంటల నుంచి మధ్యాహ్నం 3గంటల వరకు ఎవరూ బయటకు వెళ్లకూడదని హెచ్చరించింది. ఈ తేదీల్లో ఉష్ణోగ్రతలు 45 డిగ్రీల నుంచి 55 వరకు పెరిగే అవకాశాలున్నాయని పేర్కొన్నది. ఈ సమయంలో భూమి మీద నేరుగా 70శాతం అతినీలలోహిత సూర్య కిరణాలు ప్రసరిస్తాయని వివరించింది. వీటి ఫలితంగా శ్వాస తీసుకోవడంలో ఇబ్బందితోపాటు, అకస్మాత్తుగా అస్వస్థతకు గురవుతారని అప్పుడు వెంటనే వైద్యులను సంప్రదించాలని సూచించింది.
ఉక్కపోత నుంచి ఉపశమనం పొందేందుకు గాలి సరిగా వచ్చేలా గదుల తలుపులు తెరిచి ఉంచుకోవాలని తెలిపింది. అధిక ఉష్ణోగ్రతల కారణంగా మొబైల్ ఫోన్లు పేలే ప్రమాదమున్నదని హెచ్చరించింది. పెరుగు, మజ్జిగ, నిమ్మ రసంతోపాటు చల్లని పానీయాలను తరచూ తీసుకోవాలని సూచించింది. ముఖ్యంగా ద్విచక్ర వాహనాలతోపాటు, కార్లల్లో ఇంధనాన్ని ఫుల్ ట్యాంక్ చేయించవద్దని హెచ్చరించింది.