హైదరాబాద్, జూలై 18 (నమస్తే తెలంగాణ)/సిటీబ్యూరో : ఈశాన్య బంగాళాఖాతంపై కొనసాగుతున్న రుతుపవన ద్రోణి, నైరుతి ఉత్తరప్రదేశ్ ప్రాంతంలో వాయుగుండం కారణంగా పలు జిల్లాల్లో మోస్తారు నుంచి భారీ వర్షాలు కురుస్తున్నట్టు హైదరాబాద్ వాతావరణ కేంద్రం వెల్లడించింది. దక్షిణ కోస్తా, పరిసర ప్రాంతాల్లో ఏర్పడిన ఉపరితల చక్రవాత ఆవర్తనం, తూర్పు పశ్చిమ ద్రోణి ప్రభావంతో ఈ నెల 23 వరకు తెలుగు రాష్ర్టాల్లో భారీ వర్షాలు కురువనున్నట్టు పేర్కొన్నది. గంటలకు 65 కిలోమీటర్ల వేగంతో గాలులు వీస్తాయని వెల్లడించింది. రాష్ట్రంలోని దాదాపు 21 జిల్లాల్లో లోటు వర్షపాతం నమోదైన పరిస్థితుల్లో రాబోయే రోజుల్లో కురిసే వానలు లోటును తీరుస్తాయని అధికారులు తెలిపారు.
శనివారం కామారెడ్డి, మెదక్, సిద్దిపేట, సంగారెడ్డి, మేడ్చల్-మల్కాజిగిరి, హైదరాబాద్, రంగారెడ్డి, వికారాబాద్, మహబూబ్నగర్, నాగర్కర్నూల్ జిల్లాల్లో భారీ వర్షం కురిసే అవకాశం ఉండగా, ఆయా జిల్లాలకు ఎల్లో అలర్ట్ జారీచేశారు. ఆదివారం ఆదిలాబాద్, కుమ్రంభీం, మంచిర్యాల, జగిత్యాల, రాజన్న సిరిసిల్ల, జయశంకర్-భూపాలపల్లి, నిజామాబాద్, భద్రాద్రి-కొత్తగూడెం, ములుగు, ఖమ్మం, నిజామాబాద్, వరంగల్, నల్లగొండ, కరీంనగర్, మెదక్, మహబూబ్నగర్ జిల్లాల్లో అకడకడ భారీ వర్షాలు కురిసే అవకాశం ఉన్నట్టు అధికారులు స్పష్టంచేశారు. ప్రజలంతా అప్రమత్తంగా ఉండాలని సూచించారు. గడిచిన 24 గంటల్లో అత్యధికంగా మహబూబ్నగర్ జిల్లా బాలానగర్లో 10.08సెం.మీటర్ల వర్షపాతం నమోదైంది.
భాగ్యనగరాన్ని ముంచెత్తిన వాన..
హైదరాబాద్లో భారీ వర్షం కురిసింది. 3 గంటల నుంచి రాత్రి వరకు ఎడతెరిపి లేకుండా కురవడంతో వాహనదారులు తీవ్ర అవస్థలు పడ్డారు. భారీ వర్షానికి రహదారులు, కాలనీలు జలమయమయ్యాయి. లోతట్టు ప్రాంతాలు, పలు కాలనీలు చెరువులను తలపించాయి. ప్రజలు బయటకు రావొద్దని అధికారులు హెచ్చరించారు. మియాపూర్-గచ్చిబౌలి రహదారిలో కార్లు వరదలో మునిగిపోయాయి.
శివారు ప్రాంతమైన నాదర్గుల్లో భారీ వర్షానికి గోడకూలి ఓ మహిళ మృతి చెందింది. మాదాపూర్, హైటెక్ సిటీ, కొండాపూర్ తదితర ఐటీ కారిడార్లలో భారీగా ట్రాఫిక్ స్తంభించింది. జీహెచ్ఎంసీ, హైడ్రా ముందస్తు చర్యల్లో విఫలంతోనే కాలనీలు నీట మునిగిపోయాయని ప్రజలు ఆరోపిస్తున్నారు. నాలుగు రోజులు వర్షాలు ఉండటంతో సహాయక చర్యలను ముమ్మరం చేయాలని డిమాండ్ చేస్తున్నారు.