ఏడేండ్లలో ఐటీ రంగం విశేష ప్రగతి
ట్విట్టర్ ద్వారా మంత్రి కేటీఆర్ వెల్లడి
హైదరాబాద్, ఫిబ్రవరి 10 : తెలంగాణలో ఐటీ రంగం గత ఏడేండ్లలో విశేష ప్రగతి సాధించిందని రాష్ట్ర ఐటీ, పరిశ్రమలు, పురపాలక శాకల మంత్రి కేటీఆర్ పేర్కొన్నారు. ఈ రంగం అభివృద్ధికి తాము చేపట్టిన చర్యల వల్ల రాష్ర్టానికి, ప్ర త్యేకించి హైదరాబాద్‌కు అనేక ప్రతిష్ఠాత్మక సంస్థలు, భారీగా పెట్టుబడులు వచ్చాయని తెలిపారు. ఈ మేర కు ట్విట్టర్ ద్వారా ఓ సంక్షిప్త వీడియోను పోస్ట్ చేశారు. ఐటీశాఖ మంత్రిగా తాను బాధ్యతలు చేపట్టినప్పటినుంచే హైదరాబాద్‌ను ఐటీ గమ్యస్థానంగా మార్చేందుకు ప్రయత్నాలు ప్రారంభిచానని, ఆ రంగానికి చెందిన ప్రముఖులను సంప్రదించి అనేక చర్యలు చేపట్టానని చెప్పారు. తొలుత టెక్ ఎకోసిస్టం అభివృద్ధికి చర్యలు చేపట్టానని, ఔత్సాహిక పారిశ్రామికవేత్తలను ప్రోత్సహించేందుకు టీ-హబ్, మహిళా పారిశ్రామికవేత్తలను ప్రోత్సహించేందుకు వీహబ్‌ను ఏర్పాటు చేశానని వివరించారు. అనంతరం ఇన్నోవేషన్, ఆర్అండ్డీ (రీసెర్చ్ అండ్ డెవలప్మెంట్) సంస్థలను ఏర్పాటు చేయించి వాటి అవసరాలకు అనుగుణంగా నైపుణ్యంగల మానవ వనరుల అభివృద్ధికి ట్రిపుల్ఐటీ, ఐబీఎస్ లాంటి ప్రఖ్యాత విద్యాసంస్థల సహకారం తీసుకొన్నామని చెప్పారు. గ్రామీణ యువతలోని సృజనాత్మకతను వెలికితీసేందుకు టీఎస్ ఇన్నోవేషన్ సెల్‌ను, మెరుగైన వృత్తిశిక్షణ కోసం టీ-వర్క్స్‌ను ఏ ర్పాటు చేశామని తెలిపారు. ప్రఖ్యాత పరిశోధనా సం స్థల సహకారంతో రాష్ట్రంలో పలు సంస్థల ఏర్పాటుకు చర్యలు చేపట్టడంతోపాటు మౌలిక వసతులను మెరుగుపరిచామని, లాస్ట్ మైల్ కనెక్టివిటీ రవాణా వ్యవస్థను తీర్చిదిద్దామని, ట్రాఫిక్ సమస్య పరిష్కారానికి ఎస్ఆర్డీపీ ప్రాజెక్టును అమలు చేస్తున్నామని పేర్కొన్నారు. దీంతో రాష్ట్రం భారీ పెట్టుబడులకు గమ్యస్థానంగా మారిందని, అనేక బహుళజాతి సంస్థలు ఇక్కడ తమ సంస్థలను ఏర్పాటుచేశాయని తెలిపారు.