హైదరాబాద్ సిటీబ్యూరో, ఆగస్టు 14 (నమస్తే తెలంగాణ): దేశ ఐటీ రాజధానిగా పేరొందిన బెంగళూరు మహానగరంతో హైదరాబాద్ నువ్వా-నేనా అన్నట్టుగా పోటీ పడుతున్నది. తెలంగాణ ప్రత్యేక రాష్ట్రంగా ఏర్పాటైన తర్వాత ఐటీ, ఫార్మా రంగాలు హైదరాబాద్‌లో అభివృద్ధిని పరుగులు పెట్టిస్తున్నాయి. హైదరాబాద్‌లో జాతీయ, అంతర్జాతీయ కంపెనీలు రూ.వేల కోట్ల పెట్టుబడులు పెడుతుండటంతో అదే స్థాయిలో యువతకు ఉద్యోగ, ఉపాధి అవకాశాలు లభిస్తున్నాయి. ఫలితంగా 2014 సంవత్సరంలో రూ.57,258 కోట్లుగా ఉన్న తెలంగాణ ఐటీ ఎగుమతులు.. ఇప్పుడు దాదాపు 4 రెట్లకుపైగా పెరిగి రూ.2,41,275 కోట్లకు చేరాయి. ఇదే సమయంలో ఉద్యోగాలు 3 రెట్లు అధికమై 3,23,396 నుంచి 9,05,715కు పెరిగాయి. నిరుడు దేశంలో కొత్తగా కల్పించిన ఐటీ ఉద్యోగాల్లో 33 శాతంగా ఉన్న తెలంగాణ వాటా ఈ ఏడాది 44 శాతానికి పెరిగింది. దీంతో హైదరాబాద్‌లో రియల్ ఎస్టేట్ రంగం దేశంలోని మరే ఇతర మెట్రో నగరానికి సాధ్యం కానంత వృద్ధి రేటుతో ముందుకు దూసుకుపోతున్నది. ఇటీవల దేశంలోని 8 మెట్రో నగరాల్లో హైదరాబాద్ వివిధ అంశాల్లో తొలి రెండు స్థానాల్లో నిలవడమే ఇందుకు నిదర్శనం.
ఆఫీస్ స్పేస్ లీజింగ్‌లో బెంగళూరును అధిగమించి హైదరాబాద్ అగ్రస్థానంలో నిలిచింది. కొవిడ్ సెకండ్ వేవ్ నెమ్మదించిన తర్వాత కార్పొరేట్ సంస్థల నుంచి డిమాండ్ పెరగడంతో ఆఫీస్ స్పేస్ లీజింగ్‌లో హైదరాబాద్ మార్కెట్ లీడర్‌గా ఆవిర్భవించిందని అమెరికన్ సంస్థ ‘కొలియర్స్’ తన నివేదికలో వెల్లడించింది. దేశంలో రెండో అత్యంత ఖరీదైన రెసిడెన్షియల్ మార్కెట్‌గా హైదరాబాద్ నిలిచిందని, గృహ విక్రయాల్లో ముంబై తర్వాత అత్యధిక వృద్ధిని నమోదు చేసిందని ‘ప్రాపర్టీ టైగర్ డాట్‌కామ్’ పేర్కొన్నది. భౌగోళికంగా హైదరాబాద్‌కు ఉన్న అనుకూలతలతోపాటు రాష్ట్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన నూతన విధానాలు, మౌలిక వసతుల అభివృద్ధి తదితర అంశాలే ఇందుకు కారణమని రియల్ ఎస్టేట్ మార్కెట్ నిపుణులు అభిప్రాయపడుతున్నారు.
కొవిడ్ సంక్షోభంతో యావత్ ప్రపంచం కుదేలైనప్పటికీ హైదరాబాద్‌లోని ఐటీ రంగంపై ఆ మహమ్మారి పెద్దగా ప్రభావం చూపలేకపోయిందని, పైపెచ్చు హైదరాబాద్‌లోనే ఎక్కువ మందికి ఉపాధి అవకాశాలు లభించాయని ప్రభుత్వ నివేదికలు స్పష్టం చేస్తున్నాయి. ముఖ్యంగా హైదరాబాద్‌లో ఐటీ ఉద్యోగావకాశాలు భారీగా పెరగడంతో ఇక్కడ స్థిర నివాసం ఏర్పాటు చేసుకునేందుకు ఎంతో మంది ఇండ్లు, ప్లాట్లు కొనుగోలు చేస్తున్నారు. దీంతో హైదరాబాద్ నలుమూలలా రియల్ ఎస్టేట్ రంగం అభివృద్ధి పథంలో పరుగులు పెడుతున్నది. రాష్ట్రంలో ఐటీతోపాటు పారిశ్రామిక రంగ అభివృద్ధికి ప్రభుత్వం విప్లవాత్మక విధానాలను ప్రవేశపెట్టడంతో కరోనా సమయంలోనూ తెలంగాణకు భారీగా పెట్టుబడులు వచ్చాయి. క్రమేణా ఇవి మరింత పెరుగుతుండటంతో హైదరాబాద్‌లో సగటున వారానికో కొత్త ఐటీ కంపెనీ తన కార్యాలయాన్ని ప్రారంభిస్తున్నది.
హైదరాబాద్‌తోపాటు నగర శివారు ప్రాంతాల్లో రాష్ట్ర ప్రభుత్వం విస్తృత స్థాయిలో మౌలిక వసతులను కల్పిస్తుండటం రియల్ ఎస్టేట్ రంగానికి పెద్ద వరంగా మారింది. దీంతో రెండు తెలుగు రాష్ట్రాలతోపాటు ఇతర రాష్ర్టాలకు చెందినవారు సైతం ఇక్కడ స్థిరపడేందుకు ఎంతో ఆసక్తి చూపుతున్నారు. భారీగా ఇండ్లు, ప్లాట్లు, ఫాంహౌస్‌లు, వ్యవసాయ భూములను కొనుగోలు చేస్తున్నారు. ఈ నేపథ్యంలో ప్రభుత్వం హైదరాబాద్‌తో సమానంగా శివారు ప్రాంతాలపైనా దృష్టి సారించింది. రోడ్లు, మంచినీరు, విద్యుత్తు, డ్రైనేజీ తదితర మౌలికవసతుల కల్పనకు ప్రాధాన్యమిస్తున్నది. దీంతో స్థానికంగా రియల్ ఎస్టేట్ మార్కెట్ నానాటికీ పుంజుకుంటున్నది. ఇటీవల కోకాపేటలో హెచ్ఎండీఏ అభివృద్ధి చేసిన లేఅవుట్లో ఎకరం ధర రూ.100.75 కోట్లు పలకడమే ఇందుకు నిదర్శనం.
ఐటీతోపాటు, ఫార్మా, లైఫ్‌సైన్సెస్ రంగాల్లోనూ హైదరాబాద్ సత్తా చాటుతున్నది. ఈ రంగాల్లో పరిశోధనలకు ఇక్కడి వాతావరణం సానుకూలంగా ఉండటం, నిర్వహణ వ్యయం చాలా తక్కువగా ఉండటం ఇందుకు కారణమని ఎఫ్‌డీఐ బెంచ్‌మార్క్ నివేదిక వెల్లడించింది. ఆర్అండ్డీ కార్యకలాపాల నిర్వహణకు ఢిల్లీ, చెన్నై, బెంగళూరుల కంటే హైదరాబాద్ ఎంతో అనుకూలంగా ఉన్నదని, దీంతో పలు జాతీయ, అంతర్జాతీయ కంపెనీలు హైదరాబాద్‌లో భారీగా పెట్టుబడులు పెడుతున్నాయని పేర్కొన్నది.