హైదరాబాద్, సెప్టెంబర్ 18(నమస్తే తెలంగాణ): రోమ్ నగరం తగలబడుతుంటే నీరో చక్రవర్తి హాయిగా ఫిడేలు వాయించుకున్నట్టుగా ఉన్నది కాంగ్రెస్ ప్రభుత్వం తీరు. భారీ వర్షాలు, వరదలతో రాష్ట్ర ప్రజలు అల్లాడుతుంటే.. సీఎం రేవంత్‌రెడ్డి మాత్రం రాజకీయాల్లో మునిగితేలుతున్నారనే విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. దగ్గరుండి వరద పరిస్థితులపై నిరంతరం సమీక్షిస్తూ, ప్రజల ఆర్తనాదాలను వినాల్సిన సీఎం.. తనకు సంబంధం లేదన్నట్టుగా గురువారం ఢిల్లీకి వెళ్లిపోయారు. దీంతో సీఎం వ్యవహార శైలిపై తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.
భారీ వర్షాల నేపథ్యంలో ప్రజలకు ఇబ్బంది కలగకుండా ముందస్తుగా తీసుకోవాల్సిన చర్యలపై సీఎం రేవంత్‌రెడ్డి సమీక్షించిన దాఖలాలు లేవని అధికార వర్గాలు పేర్కొంటున్నాయి. ప్రజలను మభ్యపెట్టడానికి మాత్రం సీఎంవో ఆఫీసు నుంచి ప్రెస్నోట్లు వెలువడుతున్నాయని చెప్తున్నారు. వర్షాల నేపథ్యంలో సీఎం రేవంత్‌రెడ్డి అధికారులతో మాట్లాడారని, సహాయక చర్యలు చేపట్టాలంటూ ఆదేశించారని ప్రెస్నోట్లలో వస్తున్నాయి. తమను సీఎం పిలిచింది లేదని.. వర్షాలు, వరదలపై సమీక్షించింది లేదని అధకారులే చెప్తున్నారు. కొన్నిసార్లు సీఎంకు తెలియకుండానే పీఆర్వోలు ప్రెస్నోట్లను రోటీన్లో భాగంగా పంపిస్తున్నట్టుగా చెప్పుకుంటున్నారు.
మున్సిపల్‌శాఖ సైతం సీఎం రేవంత్‌రెడ్డి వద్దనే ఉన్నది. వరదలతో హైదరాబాద్ ఉక్కిరిబిక్కిరి అవుతున్నా.. సీఎంగా కాకపోయినా కనీసం మున్సిపల్ మంత్రిగానైనా సమీక్షించకపోవడం విమర్శలకు తావిస్తున్నది. ఒకవేళ మున్సిపల్ శాఖకు ప్రత్యేకంగా మంత్రి ఉంటే పరిస్థితి వేరే విధంగా ఉండేదేమో..ఆయనైనా పట్టించుకునేవారమోననే అభిప్రాయాలున్నాయి. అన్నీ తన వద్దే పెట్టుకున్న సీఎం.. ప్రజల ఇబ్బందులను మాత్రం పరిష్కరించలేకపోతున్నారనే ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి.
రెండురోజులుగా భారీవర్షాలు రాష్ర్టాన్ని ముంచెత్తుతున్నాయి. హైదరాబాద్ నగరంలో కుంభవృష్టి బీభత్సం సృష్టిస్తున్నది. బుధవారం రాత్రి దాదాపు నాలుగు గంటలపాటు కురిసిన భారీవర్షం నగరాన్ని అతలాకుతలం చేసింది. రోడ్లన్నీ చెరువులను తలపించాయి. ఎక్కడికక్కడ కిలోమీటర్ల మేర వాహనాలు నిలిచిపోయి ట్రాఫిక్‌జాం అయింది. వాహనదారులు రాత్రంతా రోడ్లపైనే జాగారం చేశారు. కొంత మంది రాత్రి బయలుదేరితే తెల్లవారుజామున 3 గంటలకు ఇండ్లకు చేరారు. గురువారం సాయంత్రం నుంచే నగరంలో వర్షభీభత్సం మొదలైంది. సాయంత్రం పూట వర్షం పడడంతో వాహనదారులు చుక్కలు చూశారు.
బుధవారాన్ని మించి నరకయాతన అనుభవించారు. దీంతో పాటు భారీవర్షాలతో నగరవాసులు నరకం చూస్తున్నారు. కాలనీలు మునిగిపోయి, ఇండ్లలోకి నీళ్లు రావడంతో తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. పరిస్థితి ఇంత దారుణంగా ఉంటే.. సీఎం రేవంత్‌రెడ్డి పత్తా లేరంటూ ప్రజలు విమర్శిస్తున్నారు. ఏదో కంటితుడుపు చర్యగా అప్రమత్తంగా ఉండాలని అధికారులను సీఎం రేవంత్‌రెడ్డి ఆదేశించినట్టుగా రాత్రి 10.26కు సీఎంవోలు ప్రకటన వచ్చింది. క్లిష్ట పరిస్థితుల్లో ప్రజలకు ఇబ్బంది రాకుండా తన అధికార యంత్రాంగాన్ని అప్రమత్తం చేయడంలో రేవంత్‌రెడ్డి అట్టర్‌ప్లాప్ అయ్యారనే విమర్శలు వ్యక్తమవుతున్నాయి.
ఓవైపు కుండపోత వర్షాలతో రాష్ట్రం అతలాకుతలం అవుతుంటే సీఎం రేవంత్‌రెడ్డి మాత్రం రాజకీయాలపైనే దృష్టి పెట్టారన్న ఆరోపణలు ఉన్నాయి. వరదలు, వర్షాలు, ఇబ్బందులను ఇక్కడే వదిలేసి గురువారం ఢిల్లీకి పయనమయ్యారు. రాత్రి వర్షం వస్తుంది.. తెల్లారితే పోతుంది అనే ధోరణిలో వ్యవహరిస్తున్నారని అధికారవర్గాలు తెలిపాయి. పోనీ వెళ్లేముందు అధికారులనైనా అప్రమత్తం చేశారా? అంటే అదీ లేదని అంటున్నారు. సీఎం ఇలా ఉంటే అధికారులు మరెలా ఉంటారని, వారు సైతం ప్రజల బాధలను పట్టించుకోవడం లేదన్న విమర్శలు ఉన్నాయి. క్లిష్ట సమయంలో క్షేత్రస్థాయిలోకి వెళ్లకుండా నిర్లక్ష్యం ప్రదర్శిస్తున్నారు. బుధ, గురువారాల్లో రాత్రి వర్షం బీభత్సం సృష్టించగా రోడ్లపై అధికారులుగానీ, సహాయక సిబ్బంది గానీ లేకపోవడమే ఇందుకు నిదర్శనమని అంటున్నారు.