Hyderabad | హైదరాబాద్, జూన్ 14 (నమస్తే తెలంగాణ): కేసీఆర్ విజన్.. కేటీఆర్ మిషన్.. వెరసి బీఆర్ఎస్ హయాంలో ఐటీరంగంలో తెలంగాణ నూతన చరిత్రను లిఖించింది. బీఆర్ఎస్ పదేండ్ల పాలనలో ఐటీ ఎగుమ తులు నాలుగు రెట్లు పెరుగడమే దీనికి రుజువు. ఇది ఒక్కరోజులో జరిగింది ఏమీ కాదు.. కొత్త రాష్ట్రంలో వ్యాపార అనుకూల వాతావరణాన్ని ఏర్పాటుచేస్తేనే కంపెనీలు మనదగ్గరకు వస్తాయని కేసీఆర్ ప్రభుత్వం ముందే గుర్తించింది. ఈ క్రమంలోనే ఐటీ మౌలిక వసతులను అందుబాటులోకి తేవడంతోపాటు కంపెనీలకు కావాల్సిన ప్రోత్సాహకాలను అందించింది. ‘టాస్క్’ వంటి కార్యక్రమాలతో పారిశ్రామిక అవసరాలకు కావాల్సిన మానవ, సాంకేతిక వనరులను కల్పించింది.
దీంతో ప్రపంచ దిగ్గజ కంపెనీలు తమ గ్లోబల్ కేపబులిటీ సెంటర్లను (జీసీసీ) హైదరాబాద్‌లో ఏర్పాటు చేయడానికి క్యూకట్టాయి. జీసీసీలను ఆకర్షించడంలో ‘సిలికాన్ వ్యాలీ ఆఫ్ ఇండియా’గా పిలిచే బెంగళూరును తోసిరాజని హైదరాబాద్ ముందువరుసలో నిలిచిందంటే కేసీఆర్ ప్రభుత్వం వేసిన అప్పటి ‘ఐటీ’ పునాదులేనని చెప్పకతప్పదు. గ్లోబల్ టెక్ కంపెనీలను ఏర్పాటు చేయడమే కాదు సుశిక్షితులైన ఉద్యోగులను కూడా అందిస్తూ మల్టీనేషనల్ కంపెనీలను ఆకర్షించడంలో హైదరాబాద్ దేశానికే దిక్సూచీగా నిలిచింది. అందుకే గ్లోబల్ కేపబులిటీ సెంటర్ల(జీసీసీ)కు కేంద్ర బిందువుగా హైదరాబాద్ మారింది. దేశవ్యాప్తంగా రెండు వేల జీసీసీ ఎకో సిస్టమ్లుండగా.. హైదరాబాద్‌లోనే 355 జీసీసీలున్నాయి.
అంటే దేశంలో కొత్తగా ప్రారంభించే ప్రతీ 100 జీసీసీల్లో 18 సెంటర్లు హైదరాబాద్‌లోనే కొలువుదీరుతున్నాయి. తద్వారా దేశంలో అత్యధికంగా జీసీసీ సెంటర్లు ఉన్న రాష్ర్టాల్లో తెలంగాణ ముందు వరుసలో నిలిచింది. హైదరాబాద్‌లోని మొత్తం జీసీసీల్లో 3 లక్షల మంది ఉద్యోగాలు చేస్తున్నారు. వచ్చే ఐదు నుంచి ఏడేండ్ల కాలంలో 35-40 శాతం కొత్త జీసీసీలు మన దేశంలో ప్రారంభం కానున్నట్టు నివేదికలు చెప్తున్నాయి. వాటన్నింటికీ గమ్యస్థానం హైదరాబాద్ కాబోతున్నట్టు పారిశ్రామిక నిపుణులు అంచ నా వేస్తున్నారు. ఐటీ, రీసెర్చ్, ఫైనాన్స్, కస్టమర్ సేవల కోసం ఎంఎన్‌సీలు హైదరాబాద్‌లో ఇప్పటికే వందలాది జీసీసీలను ఏర్పాటు చేశాయి. ప్రతిష్టాత్మక ఎలీ లిల్లీ, మారియట్ ఇంటర్నేషనల్, ఎవర్‌నార్త్ వంటి సంస్థలు తమ గ్లోబల్ సెంటర్లను హైదరాబాద్‌లో ప్రారంభించాయి. దీంతో గ్లోబల్ ఇన్నోవేషన్, టెక్నాలజీ హబ్‌గా హైదరాబాద్ మారినట్టు అర్థమవుతున్నది.
నాడు బీఆర్‌ఎస్‌పాలనలో ఐటీ రంగం అభివృద్ధికి ప్రవేశపెట్టిన పాలసీలతో అనేక జీసీసీలు రాష్ట్రంలో తమ సంస్థలు పెట్టేందుకు మొగ్గుచూపుతున్నట్టు పారిశ్రామిక రంగ నిపుణులు చెప్తున్నారు. మౌలిక సదుపాయాల కల్పన, ప్రతిభా సామర్థ్య వృద్ధి, ఐటీ సెక్టార్లో వినూత్న ఆవిష్కరణలు, అత్యున్నత జీవన ప్రమాణాలు వెరసి ప్రపంచ స్థాయి దిగ్గజ కంపెనీలు హైదరాబాద్ వైపు చూసేలా చేస్తున్నట్టు వివరిస్తున్నారు. బీఆర్ఎస్ హయాంలో నాటి ఐటీ పరిశ్రమల శాఖ మంత్రి కేటీఆర్ ప్రత్యేక చొరవతో తెలంగాణలో వ్యాపార అనుకూల వాతావరణం, ప్రభుత్వపరంగా ప్రోత్సాహం, ఐటీ మౌలిక వసతులను అందుబాటులోకి తేవడంతో అనేక జీసీసీలు తెలంగాణ బాట పట్టాయి. ఐటీ పరిశ్రమలకు 15 రోజుల్లో అనుమతి ఇవ్వడానికి టీఎస్ఐపాస్, టీఎస్‌బీపాస్ వంటి కార్యక్రమాలను బీఆర్ఎస్ ప్రభుత్వం తీసుకొచ్చింది. కేటీఆర్ ఆధ్వర్యంలో ఏర్పాటుచేసిన తెలంగాణ అకాడమీ ఫర్ స్కిల్ అండ్ నాలెడ్జ్ ద్వారా ఇస్తున్న శిక్షణ ఆయా జీసీసీలతో పాటు ఐటీ కంపెనీల్లో ఉద్యోగార్థులకు ఎంతగానో ఉపయోగపడింది. దేశంలోనే అతిపెద్ద స్టార్టప్ ఇంక్యుబేటర్ టీహబ్, టీహబ్ 2.0, మహిళా ఔత్సాహిక పారిశ్రామిక వేత్తలను ప్రోత్సహించేందుకు వీహబ్‌లను బీఆర్ఎస్ హయాంలో ప్రతిష్టాత్మకంగా నిర్మించారు. వీటిద్వారా సుశిక్షితులైన ఉద్యోగులు గ్లోబల్ కంపెనీల చేతికొచ్చారు.
ఐటీ రంగానికి ప్రపంచవ్యాప్తంగా ఉన్న ప్రాధాన్యతను గుర్తించిన అప్పటి బీఆర్ఎస్ ప్రభుత్వం ప్రతీ ఐదేండ్లకు ఒకసారి ఐటీ పాలసీని కొత్తగా రూపొందించాలని నిర్ణయించింది. ఇందులో భాగంగానే 2016, 2021లో పాలసీలను రూపొందించి విజయవంతంగా అమలు చేసింది. వీటికి తోడు ఐటీ శాఖ పరిధిలోఎమర్జింగ్ టెక్నాలజీ వింగ్‌ను ఏర్పాటు చేసి 10 టెక్నాలజీలను ప్రభుత్వ కార్యకలాపాలకు సమర్థవంతంగా వినియోగించింది. టెక్నాలజీ రంగంలో వస్తున్న కొత్త మార్పులను ఎప్పటికప్పుడు అందిపుచ్చుకొనేందుకు అప్పటి ఐటీమంత్రి కేటీఆర్ నేతృత్వంలో ఐటీశాఖ ముందుచూపుతో వ్యవహరించింది. వీటి ఫలితమే.. ప్రపంచంలోనే టాప్-5 టెక్ కంపెనీలు హైదరాబాద్‌కు క్యూకట్టాయి. పదేండ్లలో ఐటీ ఎగుమతులు నాలుగు రెట్లు పెరిగాయి. దేశంలోని ప్రతీ 3 కొత్త ఐటీ ఉద్యోగాల్లో ఒకటి తెలంగాణ నుంచే సాకారమైంది.
‘సిలికాన్ వ్యాలీ ఆఫ్ ఇండియా’గా చెప్పుకొనే బెంగళూరును తోసిరాజని ఐటీహబ్‌గా హైదరాబాద్ మారుతున్నది. బీఆర్ఎస్ పదేండ్ల పాలనలో తీసుకొన్న నిర్ణయాలే ఇందుకు కారణమయ్యాయి.
ఇతర దేశాల్లోని ప్రతిభావంతుల సేవలను, కార్యనిర్వహణ సామర్థ్యాన్ని తక్కువ ఖర్చుతో ఉపయోగించుకోవడానికి ఎంఎన్సీ కంపెనీలు ప్రత్యేక కేంద్రాలను ఏర్పాటుచేస్తాయి. వాటినే గ్లో బల్ కేపబులిటీ సెంటర్లు (జీసీసీ)గా పిలుస్తారు. ఆ కంపెనీలు తమ వ్యాపార వృద్ధికి ఈ కేంద్రాలలోని మానవ, సాంకేతిక వనరులను వినియోగించుకొంటాయి. హైదరాబాద్ కేంద్రం గా నడిచే జీసీసీలు దేశవ్యాప్తంగా స్టార్టప్ కల్చర్‌కు దశ, దిశను చూపుతున్నట్టు నిపుణులు చెప్తున్నారు.
గడిచిన ఐదేండ్లలో హైదరాబాద్‌కు జీసీసీలు క్యూకట్టాయి. ఇక్కడ ఉన్న మౌలిక వసతులు, టాలెంటే దానికి కారణం.
– శ్రీకాంత్ శ్రీనివాసన్, నాస్కామ్ వీపీ
జీసీసీలకు అడ్డాగా హైదరాబాద్ మారింది. గడిచిన 18 నెలల్లో దేశంలో ప్రారంభమైన 25-30 శాతం జీసీసీలు హైదరాబాద్‌కే రావడం దీనికి రుజువు. ఇక్కడి ఐటీ వాతావరణం ఎంతో బాగుంది.
-విక్రమ్ అహూజా, ఎన్ఎస్ఆర్ సహ వ్యవస్థాపకుడు
మిగిలిన మెట్రో సిటీలతో పోలిస్తే హైదరాబాద్ ఎంతో బెటర్. టాలెంట్ ఉన్న ఉద్యోగులు ఇక్కడ దొరుకుతారు. బెంగళూరు, ముంబైతో పోలిస్తే ఇక్కడ కాస్ట్ ఆఫ్ లివింగ్ ఎంతో తక్కువ. ఢిల్లీతో పోలిస్తే భద్రతపరంగా హైదరాబాద్ సౌకర్యవంతంగా ఉంటుంది. రవాణా సదుపాయాలు కూడా మెరుగ్గా ఉన్నాయి.
– కార్తీక్ పద్మనాభన్, జిన్నోవ్ మేనేజింగ్ పార్ట్నర్
హైదరాబాద్ +35.7%
పుణె +11.11%
చెన్నై మార్పులేదు
ఢిల్లీ -6.6%
బెంగళూరు -16.66%
ముంబై -16.66%
ఆధారం: ఏఎన్ఎస్ఆర్ రీసెర్చ్-2025 టెక్నాలజీ రంగంలో
2016 – తెలంగాణ ఐసీటీ పాలసీ
2016 – ఎలక్ట్రానిక్స్ పాలసీ
2016 – ఇన్నోవేషన్ పాలసీ
2016 – డేటా సెంటర్స్ పాలసీ (దేశంలోనే మొదటిది)
2017 – ఇంటర్నెట్ ఆఫ్ థింగ్స్ (ఐవోటీ) పాలసీ
2019 – బ్లాక్ చెయిన్ పాలసీ (దేశంలోనే మొదటిది)