Bus Bhavan | హైదరాబాద్, ఏప్రిల్ 3 (నమస్తే తెలంగాణ) : ఏపీ, తెలంగాణ ఆస్తుల పంచాయితీ బస్ భవన్ వేదికగా మరోసారి తెరపైకి వచ్చిం ది. తెలంగాణ ప్రభుత్వం తీసుకున్న నిర్ణయం పై ఏపీఎస్ఆర్టీసీ మండిపడుతున్నది. హైదరాబాద్‌లో ఉన్న బస్‌భవన్‌లోని ‘ఏ’ బ్లాక్‌ను తెలంగాణ వాణిజ్య పన్నుల శాఖకు కట్టబెట్టడంపై ఏపీ భగ్గుమంటున్నది. తాళాలు పగులగొట్టి మరీ వాణిజ్య పన్నుల శాఖ అధికారులు ప్రవేశించడంపై ఏపీఎస్ఆర్టీసీ తీవ్ర అభ్యంతరం వ్యక్తంచేస్తున్నది. హైదరాబాద్‌లోని పం జాగుట్ట, సికింద్రాబాద్ వాణిజ్య పన్నుల శాఖ కార్యాలయాలను బస్ భవన్‌లోని ‘ఏ’ బ్లాక్‌లోకి తరలించాలని తెలంగాణ ప్రభుత్వం నిర్ణయించింది. తెలంగాణ సీఎస్ నుంచి అనుమతులు లభించడంతో, మార్చి 30న పంజాగు ట్ట డివిజన్ జాయింట్ కమిషనర్ తన సిబ్బందితో కలిసి బస్ భవన్‌కు చేరుకున్నారు. ఆ సమయంలో బస్ భవన్‌లోని ‘ఏ’ బ్లాక్ కార్యాలయం లాక్ చేసి ఉండటంతో, తాళాలు పగులగొట్టి మరీ లోపలికి ప్రవేశించారు.
ఈ చర్య ను ఏపీఎస్ఆర్టీసీ యాజమాన్యం తీవ్రంగా పరిగణించింది. ఏపీ పునర్విభజన చట్టం 2014 ప్రకారం ఏపీఎస్ఆర్టీసీ, టీజీఎస్ఆర్టీసీ మధ్య ఆస్తుల డెమెర్జర్ (విడగొట్టడం) ప్రక్రియ ఇంకా పూర్తి కాలేదు. ఈ అంశం ప్రస్తుతం కేంద్ర హోం మంత్రిత్వ శాఖ పరిధిలో ఉంది. విభజన సమయంలో కుదిరిన ప్రాథమిక ఒప్పందం ప్రకారం.. బస్ భవన్‌లోని ‘ఏ’ బ్లాక్ ఏపీఎస్ఆర్టీసీకి, ‘బీ’ బ్లాక్ టీజీఎస్ఆర్టీసీకి కేటాయించబడ్డాయి. అప్పటి నుంచి ‘ఏ’ బ్లాక్ ఏపీఎస్ఆర్టీసీ ఆధీనంలోనే ఉంది. దాదాపు 1,25,000 చదరపు అడుగుల విస్తీర్ణం కలిగిన బస్ భవన్ ఉమ్మడి ఆస్తి అని, దీనిపై తమకు హకు ఉందని ఏపీఎస్ఆర్టీసీ వాదిస్తున్నది. తమ అనుమతి లేకుండా తెలంగాణ ప్రభు త్వం ఆ కార్యాలయాన్ని ఎలా కేటాయిస్తుంద ని ప్రశ్నిస్తున్నారు. తెలంగాణ వాణిజ్య పన్నుల శాఖకు చేసిన ఈ కేటాయింపును నిలిపివేయాలని ఏపీ అధికారులు కోరుతున్నారు. కేంద్ర ప్రభుత్వ నిర్ణ యం వెలువడే వరకు యథాతథ స్థితిని కొనసాగించాలని డిమాండ్ చేస్తున్నారు. రెండు రాష్ట్రాల మధ్య కీలక ఆస్తుల పంపకం విషయంలో ఉద్రిక్తతలు చోటు చేసుకోవడం రవాణా శాఖ వర్గాల్లో చర్చనీయాంశమైంది.
ఆర్టీసీ కార్మిక జేఏసీ ఆధ్వర్యంలో చేపట్టబోయే సమ్మెకు సహకారం అందించాలని శుక్రవారం బస్ భవన్లో టీజీఎస్ఆర్టీసీ సూపర్వైజర్ అసోసియేషన్ ప్రధాన కార్యదర్శి వాసుదేవరావును కార్మిక నేతలు కోరారు. సమ్మెకు మద్దతు ఇవ్వాలని కోరు తూ జేఏసీ చైర్మన్ ఈదురు వెంకన్న, వైస్ చైర్మన్ ఎం థామస్ రెడ్డి, కో కన్వీనర్ సుద్దాల సురేశ్, జే రాఘవులు వినతిపత్రం అందించారు. వాసుదేవరావు మాట్లాడు తూ.. కార్మికుల శ్రేయస్సు కోసం చేసే పోరాటంలో న్యాయం ఉందని, ఈ ఉద్యమం అందరికోసం, ఆర్టీసీ పరిరక్షణ కోసం చేస్తున్నట్టు కార్మికుల్లో విశ్వాసం ఉందని తెలిపారు. ఆర్టీసీ విలీనం, పెండింగ్ వేతనాలకోసం సమ్మె చేస్తున్నారని, అసోసియేషన్‌తో సమావేశం నిర్వహించి సమ్మెకు సంపూర్ణ మద్దతు ఇవ్వడానికి నిర్ణయం తీసుకుంటామని హామీ ఇచ్చారు.