హైదరాబాద్, అక్టోబర్ 23 (నమస్తేతెలంగాణ): ఆరు గ్యారెంటీల పేరుతో ప్రజలను మోసం చేసిన కాంగ్రెస్ (Congress) పార్టీ ఓవైపు ఉంటే, పింఛన్లు పెంచి, రంజాన్ తోఫాలు ఇచ్చిన కారు పార్టీ ఉందని, కారు పార్టీ కావాలో, బేకారు పార్టీ కావాలో జూబ్లీహిల్స్ ప్రజలు ఆలోచించుకోవాలని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ (KTR) కోరారు. ఢిల్లీలో బడా మోదీ, తెలంగాణలో చోటా మోదీ రేవంత్‌రెడ్డి ప్రజలకు మాయమాటలు చెప్తూ నట్టేట ముంచుతున్నారని విరుచుకుపడ్డారు. ఆరు గ్యారెంటీలు ఇస్తామని, పింఛన్లు పెంచుతామన్న కాంగ్రెస్ నేతల మాయమాటలు నమ్మి ఓటేసి మోకా ఇస్తే ఇప్పుడు ధోకా చేస్తున్నారని నిప్పులు చెరిగారు. హైడ్రా పేరిట పేదల ఇండ్లపైకి బుల్డోజర్లను పంపి అరాచకం సృష్టిస్తున్నారని మండిపడ్డారు.
అభివృద్ధి చేస్తామని చెప్పి అధికారంలోకి వచ్చిన తర్వాత బుల్డోజర్ పాలన నడుపుతున్నారని ఆగ్రహం వ్యక్తంచేశారు. హైదరాబాద్ యూత్ కరేజ్(హెచ్వైసీ) వ్యవస్థాపకుడు సల్మాన్‌ఖాన్ గురువారం తెలంగాణ భవన్లో బీఆర్ఎస్లో చేరారు. అలాగే, ఎంఐఎంకు చెందిన సీనియర్ నాయకుడు మహమ్మద్ ఇస్మాయిల్, ఆయన అనుచరులు, రహమత్‌నగర్, షేక్‌పేట డివిజన్లకు చెందిన పలువురు మైనార్టీ నాయకులు కూడా బీఆర్ఎస్ పార్టీలో చేరారు. కేటీఆర్ వారికి గులాబీ కండువా కప్పి సాదరంగా పార్టీలోకి ఆహ్వానించారు. అనంతరం ఏర్పాటు చేసిన సమావేశంలో కేటీఆర్ మాట్లాడారు.
కేసీఆర్ పాలనలో అమలైన అభివృద్ధి, సంక్షేమ పథకాలను గుర్తుచేస్తూ 22 నెలల కాంగ్రెస్ పాలనా వైఫల్యాలను ఎత్తిచూపారు. దేశంలో కేసీఆర్ లాంటి సెక్యులర్ లీడర్ మరెవరూలేరని స్పష్టం చేశారు. ఓవైపు యాదాద్రి టెంపుల్‌ను అద్భుతంగా అభివృద్ధి చేసిన ఆయన ముస్లిం, క్రిస్టియన్ల మత విశ్వాసాలకు సముచిత గౌరవమిచ్చారని గుర్తుచేశారు. రూ.200 ఉన్న పింఛన్‌ను రూ. 2000కు పెంచిన ఘనత ఆయనకే దక్కిందని ప్రశంసించారు. క్రిస్మస్, రంజాన్ పండుగలకు నిరుపేదలకు దుస్తులు పంపిణీ చేసి వారి కళ్లల్లో ఆనందం నింపారని చెప్పారు. కానీ సెక్యులర్ పార్టీ అని చెప్పుకొనే కాంగ్రెస్ నాటి నుంచి నేటి వరకు ముస్లింలను మోసం చేస్తున్నదని ధ్వజమెత్తారు.
ఇందిరమ్మ రాజ్యమని గొప్పలు చెప్తున్న సీఎం రేవంత్‌రెడ్డి ఆచరణలో మాత్రం మోసపూరితంగా వ్యవహరిస్తున్నారని కేటీఆర్ మండిపడ్డారు. 22 నెలల పాలనలో ముస్లిం మైనార్టీలకు ఒరగబెట్టిందేమీలేదని ధ్వజమెత్తారు. ‘నిజంగా ముస్లింల పక్షపాతి అయితే ఒక్కరికీ క్యాబినెట్లో చోటేందుకు ఇవ్వలేదు? షబ్బీర్‌అలీని ఎమ్మెల్సీని చేసి మంత్రి పదవి ఎందుకివ్వలేదు? ఎమ్మెల్సీ పదవి ఇస్తామని అజారుద్దీన్, అమీర్ అలీఖాన్‌ను ఎందుకు మోసం చేశారు?’ అంటూ ప్రశ్నాస్త్రాలు సంధించారు. కాంగ్రెస్‌కు ముస్లింల ఓట్లపై ఉన్న ప్రేమ పదవులు ఇవ్వడంలో లేదని విమర్శించారు.
అధికారంలోకి రాగానే ఫ్రీ బస్సు పథకాన్ని అమలు చేసిన కాంగ్రెస్ ఇప్పుడు బస్సు చార్జీలు భారీగా పెంచి పట్టణపేదల నడ్డివిరిచిందని కేటీఆర్ ధ్వజమెత్తారు. ప్రస్తుతం సిటీబస్సు చార్జీలు పెంచిన ప్రభుత్వం స్థానిక ఎన్నికలు కాగానే రాష్ట్ర ప్రజలందరిపై చార్జీల భారం మోపేందుకు సిద్ధమవుతున్నదని ఆరోపించారు. రేవంత్‌రెడ్డి పాలనలో అన్ని వర్గాలు ఆగమయ్యాయని, అన్ని రంగాలు కుప్పకూలాయని విమర్శించారు. బీహార్‌లో ముస్లింలను మోసం చేశారని అక్కడి నితీశ్ సర్కారుపై ఆరోపణలు గుప్పిస్తున్న రాహుల్‌గాంధీ తెలంగాణలో ముస్లింలను రేవంత్ మోసం చేయలేదా? అని ప్రశ్నించారు. ‘గుజరాత్ మాడల్‌ను రాహుల్ బేకార్ అంటారు. రేవంత్‌రెడ్డేమో అదే మాడల్‌ను ఫాలోఅవుతారు.
అదానీ అవినీతిపరుడని రాహుల్ విమర్శిస్తారు. ఇక్కడ మాత్రం రేవంత్‌రెడ్డి అదే అదానీకి రెడ్‌కార్పెట్ వేసి స్వాగతం పలుకుతారు’ ఇదేం ద్వంద్వనీతి అని విమర్శలు గుప్పించారు. ‘అసెంబ్లీ ఎన్నికల ముందర ఆరుగ్యారెంటీలు ఇస్తాం..పింఛన్లు పెంచుతాం..రోడ్లేస్తాం..ై ఫ్లెఓవర్లు కడతాం’ అంటూ ఊదరగొట్టిన రేవంత్‌రెడ్డి 22 నెలల్లో చేసిందేంటని నిలదీశారు. కనీసం ఇప్పటివరకు హైదరాబాద్‌లో ఒక్క ఇటుకైనా పేర్చారా? కనీసం ఒక చిన్న ప్రాజెక్టునైనా పూర్తిచేశారా? ఒక్క ఫ్లైఓవరైనా నిర్మించారా? అని ప్రశ్నాస్త్రాలు సంధించారు. 42 శాతం రిజర్వేషన్లు ఇస్తామని బీసీలను సైతం నిలువునా ముంచారని తూర్పారబట్టారు.
రేవంత్ పాలనలో రాష్ట్రంలో అన్ని రంగాలు కుదేలయ్యాయని కేటీఆర్ విమర్శించారు. కేసీఆర్ హయాంలో ఓ వెలుగు వెలిగిన రియల్ఎస్టేట్ రేవంత్‌పాలనలో కుప్పకూలిందని తూర్పారబట్టారు. భూముల ధరలు దారుణంగా పడిపోవడంతో సామాన్యులు తీవ్ర ఇబ్బందుల్లో కూరుకుపోయారని ఆవేదన వ్యక్తం చేశారు. హస్తం పార్టీ గద్దెనెక్కిన తర్వాత అన్నివర్గాల ప్రజలు అసంతృప్తితో ఉన్నారని చెప్పారు. మోసపూరిత కాంగ్రెస్‌కు జూబ్లీహిల్స్ ఉప ఎన్నికల్లో బుద్ధిచెప్పాలని కోరారు. మరోసారి పొరపాటు చేస్తే తగిన మూల్యం చెల్లించుకోకతప్పదని హెచ్చరించారు.
ప్రధాని మోదీ, ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డిది సోదరబంధమని కేటీఆర్ దెప్పిపొడిచారు. కొట్లాడుకున్నట్టు నటిస్తూ ఇద్దరు కలిసి ప్రజల కండ్లలో కారం కొడుతున్నారని మండిపడ్డారు. పరస్పరం సహకరించుకుంటూ తెలంగాణ ప్రజల చెవుల్లో పువ్వులు పెడుతున్నారని మండిపడ్డారు. వారిద్దరూ ఒక్కటేనని జూబ్లీహిల్స్‌లోని ముస్లిం సోదరులు గ్రహించి రానున్న ఎన్నికల్లో తగిన గుణపాఠం నేర్పాలని సూచించారు. కేసీఆర్ మళ్లీ ముఖ్యమంత్రి కావాలంటే జూబ్లీహిల్స్ గడ్డ నుంచే బీఆర్ఎస్ జైత్రయాత్రకు నాంది పలకాలని విజ్ఞప్తిచేశారు. మంచి చెడూ చూసి ఆలోచించి ఓటేయాలని కోరారు.
గుజరాత్ మాడల్‌ను రాహుల్ బేకార్ అంటారు. రేవంత్‌రెడ్డేమో అదే మాడల్‌ను ఫాలోఅవుతారు. అదానీ అవినీతిపరుడని రాహుల్ విమర్శిస్తారు. ఇక్కడ మాత్రం రేవంత్‌రెడ్డి అదే అదానీకి రెడ్‌కార్పెట్ వేసి స్వాగతం పలుకుతారు. ఇదేం ద్వంద్వనీతి. – కేటీఆర్
దేశంలో కేసీఆర్ లాంటి సెక్యులర్ లీడర్ మరెవరూలేరు. ఓవైపు యాదాద్రి టెంపుల్‌ను అద్భుతంగా అభివృద్ధి చేశారు. మరోవైపు ముస్లిం, క్రిస్టియన్ల మత విశ్వాసాలకు సముచిత గౌరవమిచ్చారు. రూ. 200 ఉన్న పింఛన్‌ను రూ. 2000కు పెంచిన ఘనత ఆయనకే దక్కింది.
– కేటీఆర్
రేవంత్ నిజంగా ముస్లింల పక్షపాతి అయితే క్యాబినెట్లో ఒక్కరికి కూడా చోటెందుకు ఇవ్వలేదు. షబ్బీర్ అలీని ఎమ్మెల్సీని చేసి మంత్రి పదవి ఎందుకివ్వలేదు? ఎమ్మెల్సీ పదవి ఇస్తామని అజారుద్దీన్, అమీర్ అలీఖాన్‌ను ఎందుకు మోసం చేశారు. – కేటీఆర్
ఎవరెన్ని ఎత్తులు వేసినా, వ్యూహాలు పన్నినా, కుట్రలు చేసినా జూబ్లీహిల్స్ గడ్డపై ఎగిరేది గులాబీ జెండానే, గెలిచేది బీఆర్ఎస్ పార్టీయేనని హైదరాబాద్ యూత్ కరేజ్ అధ్యక్షుడు సల్మాన్‌ఖాన్ ధీమా వ్యక్తంచేశారు. మాయమాటలు చెప్పి ఓట్లు దండుకుని గద్దె నెక్కిన కాంగ్రెస్ ఇప్పుడు నిట్టనిలువునా ముంచుతున్నదని విరుచుకుపడ్డారు. 22 నెలల్లో కనీసం శ్మశానవాటిక కూడా నిర్మించలేదని ఆగ్రహం వ్యక్తం చేశారు. కేసీఆర్, కేటీఆర్ గంగాజమున తెహజీబ్ సంస్కృతిని కాపాడితే, మోదీ మార్గదర్శనంలో రేవంత్‌రెడ్డి మంటగలుపుతున్నారని విమర్శించారు.
బడే భాయ్ మోదీ.. చోటే భాయ్ రేవంత్‌రెడ్డి ఇద్దరు ఒక్కటై ముస్లిం సమాజంపై కుట్రలు చేస్తున్నారని ఆరోపించారు. కాంగ్రెస్ సర్కారు తనను నామినేషన్ వేయకుండా అడ్డుకున్నదని విమర్శించారు. నిన్నటి నుంచి తనను కొనేందుకు పెద్ద పెద్ద కాంగ్రెస్ నాయకులు విశ్వప్రయత్నం చేశారని, ఏమి కావాలంటే అది ఇస్తామని, ఎలాంటి పనైనా చేసి పెడతామని ఆశ చూపారని చెప్పారు. కానీ అభిమానుల సూచన మేరకు ఉద్యమ నేపథ్యమున్న తెలంగాణను సాధించిన బీఆర్ఎస్లో చేరానని స్పష్టం చేశారు. కష్టకాలంలో అక్కున చేర్చుకున్న పార్టీ అభివృద్ధికి తనవంతు కృషి చేస్తానని స్పష్టం చేశారు. కేసీఆర్, కేటీఆర్ నాయకత్వంలో పనిచేసే అవకాశం రావడం అదృష్టంగా భావిస్తున్నానని సంతోషం వ్యక్తం చేశారు. గతంలో కేసీఆర్, కేటీఆర్‌ను బాధపెట్టేవిధంగా మాట్లాడిన తనను క్షమించాలని కోరారు.