Gadwal | మల్దకల్ : మనువాడిన భర్తనే ఓ భార్య మట్టుబెట్టింది. అయితే అతను విద్యుత్ షాక్తో మృతి చెందినట్లు చిత్రీకరించే ప్రయత్నం చేసింది భార్య. అనుమానంతో కుటుంబ సభ్యులు ఆమెను నిలదీయగా.. తానే చంపినట్లు ఒప్పుకుంది. ఈ ఘటన జోగులాంబ గద్వాల జిల్లాలో వెలుగు చూసింది.
జోగులాంబ గద్వాల జిల్లా మద్దెలబండకు చెందిన బోయ చిన్న నర్సింహులు శుక్రవారం పొలం వద్ద అనుమానాస్పద స్థితిలో మృతి చెందాడు. నర్సింహులు శరీరంపై దెబ్బలు ఉండడంతో అతడి తల్లిదండ్రులు, బంధువులకు అనుమానం కలిగింది. చిన్న నర్సింహులు భార్య పద్మ నడవడికపై అనుమానంతో శనివారం ఉదయం ఆమెను నిలదీశారు. సరైన సమాధానం రాకపోవడంతో చితకబాదారు. దెబ్బలు తాళలేక నిజం చెప్పింది. గ్రామానికి చెందిన దుబ్బన్నతోపాటు గట్టు మండలంలోని రాయపురం గ్రామానికి చెందిన ముగ్గురు వ్యక్తులతో కలిసి తన భర్తను హత్య చేయించినట్లు ఒప్పుకొన్నది.
కాగా ముందుగా అనుమానాస్పద మృతిగా.. తర్వాత విద్యుదాఘాతంతోనే నర్సింహులు మృతి చెందినట్లు కేసు నమోదు చేయడానికి ఏఎస్సై ఈశ్వరయ్య ప్రయత్నించగా.. ఈ విషయం తెలుసుకున్న కుటుంబ సభ్యులు మృతదేహాన్ని తీసుకొచ్చి మల్దకల్ మండల కేంద్రంలోని బస్టాండ్ వద్ద రోడ్డుపై ఉంచి రాస్తారోకో చేపట్టారు. కొందరు కావాలనే హత్య చేశారని, వారిని వెంటనే అరెస్టు చేయాలని డిమాండ్ చేశారు.
హత్య చేసిన వారిని అరెస్టు చేయకుంటే ఆత్మహత్య చేసుకుంటామని పెట్రోల్ బాటిళ్లతో కొందరు బంధువులు హెచ్చరించారు. దాదాపు ఐదు గంటలపాటు ధర్నా చేపట్టడంతో వాహనాలు నిలిచిపోయి ట్రాఫిక్ స్తంభించిపోయింది. ఈ విషయం తెలుసుకొన్న సీఐ నాగేశ్వర్రెడ్డి అక్కడకు చేరుకొని వారికి సర్దిచెప్పే ప్రయత్నం చేసినా వారు వినలేదు. హత్యకు కారణమైన అనుమానితుల పేర్లు ఎఫ్ఐఆర్లో నమోదు చేసి, అందరికీ శిక్ష పడేలా చూస్తామని ఏఎస్పీ గుణశేఖర్ హామీ ఇవ్వడంతో ఆందోళన విరమించారు.
ఇవి కూడా చదవండి..
Patnam Narender Reddy | కొడంగల్లో ఫార్మా కంపెనీని అడ్డుకుంటాం : మాజీ ఎమ్మెల్యే పట్నం నరేందర్రెడ్డి
KTR | పాలమూరు ఎత్తిపోతల పూర్తి చేస్తే.. కేసీఆర్కు పేరొస్తుందని రేవంత్ రెడ్డికి భయం : కేటీఆర్
KTR | పేద ప్రజల కడుపు కొట్టడానికి సీఎం అయ్యావా..? రేవంత్ రెడ్డిపై కేటీఆర్ ఫైర్