KTR | నాగర్‌కర్నూల్ : పాలమూరు – రంగారెడ్డి ఎత్తిపోతల ప్రాజెక్టు పనులను గత బీఆర్ఎస్ ప్రభుత్వం 95 శాతం పూర్తి చేసిందని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ తెలిపారు. మిగిలిన 5 శాతం పనులు పూర్తి చేస్తే కేసీఆర్‌కు పేరొస్తుందని రేవంత్ రెడ్డికి భయం పట్టుకుందని, అందుకే ఆ పనులు నిలిపివేశాడని కేటీఆర్ ధ్వజమెత్తారు. నాగర్‌కర్నూల్ జిల్లాలో కేటీఆర్ మీడియాతో మాట్లాడారు.
పాలమూరు – రంగారెడ్డి ఎత్తిపోతలను కేసీఆర్ ఎంతో ప్రతిష్టాత్మకంగా చేపట్టారు. వలసల జిల్లాగా పేరుపడ్డ పాలమూరును పచ్చగా చేయాలని చెప్పి పెండింగ్ ప్రాజెక్టులను శరవేగంగా రన్నింగ్ ప్రాజెక్టులుగా మార్చి ఉమ్మడి మహబూబ్‌నగర్ జిల్లాలో కేసీఆర్ 8 లక్షల ఎకరాలకు నీళ్లు అందించారు. పాలమూరు జిల్లా శాశ్వతంగా ధాన్య భాండాగారంగా కావాలన్న ఉద్దేశంతో పాలమూరు ఎత్తిపోతల ప్రాజెక్టును తీసుకున్నాం. కరివెన, ఉద్ధండపూర్, ఏదుల, వట్టెం, నార్లపూర్ రిజర్వాయర్లు పూర్తయ్యాయి. పూర్తి కావడమే కాకుండా కేసీఆర్ సీఎంగా ఉన్నప్పుడు నార్లాపూర్ వద్ద ఒక పంపు ఆన్ చేసి నీళ్లు వదిలారు. 95 శాతం పని పూర్తయింది. అక్కడక్కడ కాల్వల కోసం భూసేకరణ పని చేయాలి రేవంత్ రెడ్డి. కాల్వల భూసేకరణ కోసం ఆ టెండర్ మనమే పిలిచాం.. కానీ వీరు రద్దు చేశారు. కొల్లాపూర్ నుంచి జడ్చర్ల వరకు అన్ని పనులు పూర్తయ్యాయి. మిగిలిన 5 శాతం పనులు పూర్తి చేస్తే నీళ్లు వస్తాయి. నీళ్ల కోసం ఆశతో ప్రజలు ఉన్నారు. 95 శాతం పనులు పూర్తయిన పాలమూరు ఎత్తిపోతలను రేవంత్ రెడ్డి ఎందుకు పట్టించుకోవడం లేదు..? ఆ ప్రాజెక్టును పూర్తి చేస్తే కేసీఆర్‌కు మంచి పేరు వస్తుందనే భయం ఉందా..? ప్రతి నీటి చుక్కలో కేసీఆర్‌ను చూసుకుంటారని భయపడుతున్నావా..? నీ బాధ.. భయం ఏంది..? పదేపదే పాలమూరు బిడ్డను అని చెప్పుకునే నీకు పాలమూరు మీద ఎందుకు ప్రేమ లేదని రేవంత్ రెడ్డిని కేటీఆర్ నిలదీశారు.
నిజంగా నీవు పాలమూరు బిడ్డవు అయితే దీనికి సమాధానం చెప్పు. హైదరాబాద్ నగరానికి తాగు నీరందించే సుంకిశాల ప్రాజెక్టు వద్ద ప్రమాదం జరిగింది. ఆ ప్రాజెక్టు పనులు చేపట్టిన మేఘా ఇంజినీరింగ్‌ను బ్లాక్ లిస్ట్‌లో పెట్టాలని ప్రతిపక్షంగా డిమాండ్ చేశాం. విచారణ చేయించండి.. ఒక్క వర్క్ కూడా ఇవ్వొద్దు అని చెప్పాం. అధికారుల మీద చర్యలు తీసుకుని వారిని బలి పశువులను చేయకండి అని కూడా చెప్పాం. ఇప్పటి వరకు మేఘా ఇంజినీరింగ్ మీద చర్య తీసుకోలేదు. ఇక నెల రోజుల కింద ఒక మాట చెప్పాను. కొడంగల్ లిఫ్ట్ ఇరిగేషన్ ప్రాజెక్టును మేఘాకు కట్టబెడుతారని.. ఈ రోజు పొద్దున అదే వార్తలు వచ్చాయి.. దొంగలు దొంగలు కలిసి ఊర్లు పంచుకున్నట్టు.. రూ. 4350 కోట్ల ప్రాజెక్టును రూ. 80 కోట్ల నష్టం చేసినా మేఘా ఇంజినీరింగ్‌కు కట్టబెట్టారు. రూ. 4350 కోట్ల కాంట్రాక్ట్‌లో సగం మేఘా ఇంజినీరింగ్‌కు, మరో సగం మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి రాఘవ కన్స్ట్రక్షన్స్కు అప్పజెప్పారు. మరి గతంలో ఆంధ్రా కాంట్రాక్టర్లకు కాంట్రాక్టులు ఇస్తున్నారని మాట్లాడిన రేవంత్ రెడ్డి.. ఇప్పుడు చెంపలు వేసుకుని తెలంగాణ ప్రజలకు క్షమాపణ చెప్పాలి. మేఘాను ఈస్ట్ ఇండియా కంపెనీ అని తిట్టి.. నేడు అదే సంస్థకు కొడంగల్ లిఫ్ట్ ఇరిగేషన్ ప్రాజెక్టు కట్టబెట్టడం దారుణం. నీ రంగు, నీ నైజం బయటపడింది. ఈ ఆశించి చేస్తున్నావు అని రేవంత్ రెడ్డిని కేటీఆర్ ప్రశ్నించారు.
కేసీఆర్ అనుమతితో.. మేడిగడ్డను సందర్శించినట్టే.. బీఆర్ఎస్ పార్టీకి చెందిన ప్రజాప్రతినిధులమంతా.. పాలమూరు ఎత్తిపోతల పర్యటనకు బయల్దేరుతాం. పాలమూరు ప్రజలకు వాస్తవాలను వివరిస్తాం. పాలమూరు బిడ్డలకు చేతులు జోడించి నమస్కరిస్తున్నా.. నీళ్లు వస్తాయనే ఆశతో రైతులు తమ భూములను ఇచ్చారు. ఇప్పుడు పనులు పూర్తైన కూడా నీళ్లు ఇవ్వడం లేదు. త్వరలోనే పాలమూరు ఎత్తిపోతల ప్రాజెక్టును సందర్శిస్తాం. రెండు రోజుల పాటు పర్యటించి ప్రతి పంప్ హౌస్‌ను ప్రజలకు చూపిస్తాం. గత 9 నెలలుగా ఈ ప్రాజెక్టును కాంగ్రెస్ ప్రభుత్వం తొక్కి పెడుతోంది.. నీళ్లు రాకుండా చేస్తుంది అని కేటీఆర్ మండిపడ్డారు.
ఇవి కూడా చదవండి..
KTR | పేద ప్రజల కడుపు కొట్టడానికి సీఎం అయ్యావా..? రేవంత్ రెడ్డిపై కేటీఆర్ ఫైర్
Constable Kistaiah | ఆంధ్రా ఆఫీసర్ అహంకారానికి బలవుతున్న అమరుడు కానిస్టేబుల్ కిష్టయ్య సతీమణి
Cabinet Meeting | 20న క్యాబినెట్ భేటీ.. హైడ్రా ఆర్డినెన్స్‌కు చట్టబద్ధత!