Mid Day Meals | హైదరాబాద్, జూన్ 17 (నమస్తే తెలంగాణ) : రాష్ట్రంలోని సర్కారు బడుల్లో విద్యార్థులకు కడుపునిండా మధ్యాహ్న భోజనం అందడంలేదు. సుమారు 18శాతం స్కూళ్ల లో పిల్లలకు నాలుగు ముద్దలు వడ్డించి చేతు లు దులుపుకుంటున్నారు. ఫలితంగా విద్యార్థులు ఆకలితో అలమటిస్తున్నారు. ఇలాంటి ఆందోళనకర పరిస్థితులు రాష్ట్రంలో నెలకొన్నట్టు విద్యాశాఖ సోషల్ ఆడిట్-2024 నివేదికలో వెలుగుచూశాయి. నిబంధనల ప్రకారం విద్యార్థులకు వారంలో 3 రోజులు కోడిగుడ్లు ఇవ్వాలి. కానీ దాదాపు అన్ని చోట్ల రెండు మాత్రమే అందిస్తున్నారు. రాష్ట్రం మొత్తం 21.2 శాతం మంది విద్యార్థులు మధ్యాహ్న భోజ నం తినడంలేదని తేలింది.
రాష్ట్రంలోని 42శాతం స్కూళ్లల్లో విద్యార్థులకు సురక్షిత తాగునీరు కూడా అందడంలేదని సోషల్ఆడిట్ నివేదిక స్పష్టంచేసింది. చాలామంది విద్యార్థులు తమ ఇండ్ల నుంచే మంచి నీటిని తెచ్చుకుంటున్నారు. ప్రాథమిక పాఠశాలల్లో 45శాతం స్కూళ్లకు నల్లా కనెక్షన్లే దిక్కయ్యాయి. 43 శాతం స్కూళ్లల్లో మాత్రమే ఆర్వో ప్లాంట్లున్నాయి. ఉమ్మడి ఖమ్మం, వరంగల్, రంగారెడ్డి జిల్లాల పరిధిలోని బడుల్లో తాగునీటి వసతులను మెరుగుపరచాల్సి ఉందని అధ్యయనం సూచించింది.