హైదరాబాద్ సిటీబ్యూరో/శేరిలింగంపల్లి, జనవరి 7 (నమస్తే తెలంగాణ) : వివిధ ప్రాజెక్టుల పేరిట రైతుల నుంచి వేలాది ఎకరాల్ని బలవంతంగా సేకరిస్తున్న రేవంత్ ప్రభుత్వం, మరోవైపు విద్యాసంస్థలకు కేటాయించిన భూముల్ని మాత్రం వేలం వేసి అమ్మి సొమ్ము చేసుకునేందుకు సిద్ధపడుతున్నది. రేవంత్ సర్కార్ భూపందేరం విషయమై హైదరాబాద్ చుట్టుపక్కలనే కాదు, రాష్ట్రవ్యాప్తంగా నిత్యం ఏదో ఒకచోట రైతులు రోడ్డు ఎక్కుతున్న విషయం తెలిసిందే. ఈ క్రమంలోనే కాంగ్రెస్ సర్కార్ మొన్న కంచె గచ్చిబౌలిలోని సెంట్రల్ యూనివర్సిటీ భూముల్ని చెరపట్టినట్టే గచ్చిబౌలిలోని మనూ (మౌలానా ఆజాద్ నేషనల్ ఉర్దూ యూనివర్సిటీ) భూముల్ని సైతం కొల్లగొట్టేందుకు ప్రణాళిక సిద్ధం చేయడం ఉద్రిక్తతలకు తావిస్తున్నది. భూముల విషయమై రంగారెడ్డి జిల్లా కలెక్టర్ యూనివర్సిటీ వీసీకి షోకాజ్ నోటీసులు ఇవ్వడంతో వెలుగు చూసిన ఘటనపై ఇటు ప్రతిపక్షాలు, అటు విద్యార్థి లోకం భగ్గుమంటున్నది. సర్కారు తీరును నిరసిస్తూ బుధవారం మనూ విద్యార్థులు పెద్ద ఎత్తున ఆందోళన చేపట్టారు.
ప్రభుత్వం స్వాధీనం చేసుకొని వేలం వేసేందుకు యోచిస్తున్న 50 ఎకరాల మనూ భూముల విలువ రూ.5-8 వేల కోట్ల వరకు ఉంటుందని అంచనా. గచ్చిబౌలికి సమీపంలోని రాయదుర్గంలో సర్కారు వేలంలోనే ఎకరా భూమికి రూ.176 కోట్ల వరకు ధర పలికిన విషయం తెలిసిందే. ఈ నేపధ్యంలో మనూ భూముల విలువ ఎకరా రూ.100-176 కోట్లుగా లెక్కగట్టినా రూ.5-8వేల కోట్లే లక్ష్యంగా ప్రభుత్వం పావులు కదుపుతున్నట్టు స్పష్టమవుతున్నది.
తెలంగాణ ప్రభుత్వ వైఖరిని నిరసిస్తూ గచ్చిబౌలిలోని మౌలానా ఆజాద్ నేషనల్ ఉర్దూ యూనివర్సిటీ (మనూ)లో విద్యార్థులు బుధవారం అందోళనకు దిగారు. రాష్ట్ర ప్రభుత్వం 50 ఎకరాలు స్వాధీనం చేసుకోవడానికి నోటీసు జారీచేయడంపై ఆగ్రహం వ్యక్తం చేశారు. ప్రభుత్వం విచ్చలవిడిగా విశ్వవిద్యాలయాలపై పడి భూముల స్వాధీనానికి చేస్తున్న ప్రయత్నాలను ఎండగడుతూ వెంటనే విరమించుకోవాలంటూ పెద్ద ఎత్తున నినదిస్తూ క్యాంపస్‌లో నిరసనకు దిగారు. యూనివర్సిటీ విద్యార్థి సంఘం అధ్వర్యంలో నిరసన కార్యక్రమం చేపట్టారు. ప్లకార్డులతో రాష్ట్ర ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినదించారు. ‘నహీ చలేగా నహీ చలేగా… ల్యాండ్ చోరీ నహీ చలేగా… మనూపే హమ్లా నహీ చలేగా… ఇంక్విలాబ్ జిందాబాద్… స్టూడెంట్ యూనిటీ లాంగ్‌లివ్..’ అంటూ నినాదాలు చేశారు. క్యాంపస్‌లోని పరిపాలన భవనం నుంచి మెయిన్ గేట్ వరకు వందలాది మంది విద్యార్థులు ర్యాలీగా తరలివెళ్లారు. మనూ స్టూడెంట్స్ కలెక్టివ్ పేరిట ఓ అసోసియేషన్‌ను ఏర్పాటు చేసిన విద్యార్థులు యూనివర్సిటీ భూములను రక్షించాలని డిమాండ్ చేశారు. ఖాళీ భూములు తీసుకోవడం అంటే విద్యపై ప్రత్యక్షంగా దాడిచేసినట్టే అని విద్యార్థి నాయకులు ఆగ్రహం వ్యక్తంచేశారు. విశ్వవిద్యాలయాల్లో ఖాళీగా ఉన్న భూములను ప్రభుత్వాలు ధనాగారాలుగా చూస్తున్నాయని, అందుకే లాక్కోవడానికి ప్రయత్నం చేస్తున్నాయని దుయ్యబట్టారు.
రాష్ట్రంలో ఉర్దూ విద్యా ప్రమాణాలను పెంచడమే లక్ష్యంగా కేంద్ర ప్రభుత్వం హైదరాబాద్ కేంద్రంగా అంతర్జాతీయ స్థాయిలో మనూ ఏర్పాటును ఆమోదించింది. ఇందుకోసం అప్పటి రాష్ట్ర సర్కార్ మణికొండ గ్రామంలోని సర్వే నెంబర్ 211, 212లోని 200 ఎకరాల ప్రభుత్వ భూమిని కేటాయించింది. ప్రభుత్వ ఆదేశాలతో హెచ్ఎండీఏ మౌలానా ఆజాద్ నేషనల్ ఉర్దూ యూనివర్సిటీ రిజిస్ట్రార్‌కు అప్పగిస్తున్నట్టు 1998 జూలై 23న పంచనామా చేశారు. బహుళ, భవిష్యత్ ప్రయోజనాలను దృష్టిలో పెట్టుకుని అప్పటి సర్కారు భూమిని విద్యాసంస్థలకు బదలాయించింది. అప్పటి నుంచి వర్సిటీని సువిశాలమైన పరిసరాల్లో నిర్మించి, మిగిలిన భూమిని దశల వారీగా అభివృద్ధి చేసుకుంటూ యూనివర్సిటీ భవనాలతో పాటు పలురకాలుగా వినియోగిస్తున్నది. అయితే ఇందులో ఉన్న 50 ఎకరాల ల్యాండ్ పార్సిల్‌పై కన్నేసిన కాంగ్రెస్ సర్కారు స్వాధీనానికి డిసెంబర్ 15న నోటీసులు జారీ చేసింది. ఈ విషయాన్ని ఇటీవల ‘నమస్తే తెలంగాణ’ వెలుగులోకి తీసుకురావడంతో బీఆర్ఎస్ సహా ఇతర ప్రతిపక్షాలు సైతం సర్కారు తీరును ఎండగడుగుతున్నాయి. మజ్లిస్ శాసనసభాపక్ష నేత అక్బరుద్దిన్ ఓవైసీ అసెంబ్లీ వేదికగా రేవంత్ సర్కారుపై మండిపడ్డారు. విద్యాభివృద్ధికి అదనపు సౌకర్యాలు కల్పించాల్సిన ప్రభుత్వం విద్యాసంస్థకు ఇచ్చిన భూముల్ని వేలంలో అమ్ముకునేందుకు ప్రయత్నించడం ఘోరంగా అభివర్ణించారు. కాగా బుధవారం ఈ అంశంపై మనూ విద్యార్థులు పెద్దఎత్తున ఆందోళన నిర్వహించారు. ప్రభుత్వం వెంటనే నిర్ణయాన్ని వెనక్కి తీసుకొని, కలెక్టర్ షోకాజ్ నోటీసును ఉపసహరించుకోకపోతే హెచ్‌సీయూ తరహాలో పెద్దఎత్తున ఉద్యమానికి దిగుతామని హెచ్చరించారు.
రాష్ట్ర ప్రభుత్వ చర్యను తీవ్రంగా ఖండిస్తున్నాం. ఇతర విశ్వవిద్యాలయాల్లో అనుసరించిన వైఖరినే మనూలోనూ అవలంబించాలని చూస్తున్నారు., 50 ఎకరాల భూములకు షోకాజ్ నోటీసు జారీ చేయ డం ఆందోళనకరం. వర్సిటీల్లో ఖాళీ గా ఉండే భూములను ప్రభుత్వం నిధుల వ నరుగా చూస్తున్నది. హెచ్‌సీయూ భూములను లాక్కోవడానికి ప్రయత్నించినట్టే మనూ భూములూ లాగడానికి యత్నించడం దుర్మార్గం. మనూ భూముల విషయంలో రాష్ట్ర ప్రభుత్వం చేస్తున్న ప్రయత్నాలను ఎట్టి పరిస్థితుల్లో అనుమతించబోం. యూనివర్సిటీ భూములు వర్సిటీలోని విద్యార్థులకే చెందుతాయి. వాటిని నూతన తరగతి గదులు, లైబ్రరీలు, ఇతర వసతుల నిర్మాణానికి ఉపయోగించాలి. అంతేగానీ రాష్ట్ర ప్రభుత్వ ప్రాధాన్యతలను నెరవేర్చడానికి భూములు తీసుకునేందుకు యత్నిస్తే ఊరుకోం. సకాలంలో నిధుల మంజూరు చేయకపోవడం, సీపీడబ్ల్యూడీ వంటి కేంద్ర సంస్థలపై ఆధారపడడం వంటి కారణాలతోనే భూములను వాడకంలోకి తేలేకపోవడంతోనే ఖాళీగా కనిపిస్తున్నాయి.
ప్రభుత్వ చర్య విద్యార్థుల అవసరాలకు వ్యతిరేకంగా ఉంది. మనూలో చాలా మంది మైనారిటీ విద్యార్థులు అభ్యసిస్తున్నారు, వారికి హాస్టల్ వసతి సరిగ్గా లేదు. ఖాళీగా ఉన్న భూముల్లో హాస్టళ్లు, లైబ్రరీలు, ఇతర మౌలిక సదుపాయాలను కల్పించాలి. విద్యానిలయానికి చెందిన భూములను రాష్ట్ర ప్రభుత్వం తీసుకోవాలని చూడడం అమానుషం. రాష్ట్ర ప్రభు త్వ చర్యలు యూనివర్సిటీలు మేలుకొలుపుగా భావించాలి, విద్యార్థులు కావాల్సిన సదుపాయాలపై పోరాటం చేయాలి. వర్సిటీ భూములను ఎట్టి పరిస్థితిలోనూ రక్షించుకుని తీరుతాం. రాష్ట్ర ప్రభుత్వం తీసుకుంటే చూస్తూ ఊరుకోబోం, ఇతర విద్యార్థి సంఘాలు కూడా మద్దతుగా నిలుస్తాయని భావిస్తున్నాం.