కోస్గి, అక్టోబర్ 7: కాంగ్రెస్ ప్రభుత్వం ఇచ్చిన మాట మేరకు రైతులకు వంద శాతం రుణమాఫీ చేయాలని, కొడంగల్‌లో ఫార్మా కంపెనీ ఏర్పాటును వెనక్కి తీసుకోవాలని కొడంగల్ మాజీ ఎమ్మెల్యే పట్నం నరేందర్‌రెడ్డి డిమాండ్ చేశారు. ఈమేరకు సోమవారం నారాయణపేట జిల్లా కోస్గి పట్టణంలో ఆయన మీడియాతో మాట్లాడుతూ.. ఇబ్రహీంపట్నం, మహేశ్వరం నియోజకవర్గంలో 14 వేల ఎకరాలను గత ప్రభుత్వం కేటాయించగా.. ల్యాండ్ అక్యూవేషన్ పూర్తి చేసుకున్న తర్వాత అక్కడ కాదని.. దుద్యాల మండలంలో ఫార్మా కంపెనీ ఏర్పాటు సరికాదని చెప్పారు.
రేవంత్ సర్కారు తీరును వ్యతిరేకిస్తూ 9న ఉదయం 7 గంటలకు పోలేపల్లి ఎల్లమ్మ ఆలయంలో పూజల అనంతరం పాదయాత్ర చేపట్టనున్నట్టు తెలిపారు. మాజీ మంత్రి శ్రీనివాస్‌గౌడ్, ఎమ్మెల్సీ నవీన్‌కుమార్‌రెడ్డితో కలిసి హకీంపేట్, ఆర్బీ తండా, లగచర్ల, దుద్యాల్ వరకు 10 కిలోమీటర్లు యాత్ర కొనసాగుతుందని, అక్కడ ముగింపు కార్యక్రమంలో సబితా ఇంద్రారెడ్డి పాల్గొంటారని చెప్పారు. రైతులు, యువకులు, ఫార్మా బాధితులు, బీఆర్ఎస్ నాయకులు, కార్యకర్తలు, కేసీఆర్ అభిమానులు పెద్ద ఎత్తున తరలివచ్చి కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని పిలుపునిచ్చారు.