HCU Lands | హైదరాబాద్ సిటీబ్యూరో, ఏప్రిల్ 7 (నమస్తే తెలంగాణ) : హెచ్‌సీయూ భూములను దాటి దాదాపు ఏడెనిమిది కిలోమీటర్ల అవతల ఉన్న కోకాపేటలోని నియోపొలిస్ భూములే బీఆర్ఎస్ హయాంలో నిర్వహించిన బహిరంగ వేలంలో ఎకరాకు రూ.100 కోట్ల ధర పలికాయి. మరి ఐటీ కారిడార్‌లో అత్యంత విలువైన కీలక ఫైనాన్షియల్ డిస్ట్రిక్ట్‌కు ఆనుకొని ఉన్న హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీ భూములకు రూపాయి ఎక్కువే పలకాలిగాని తక్కువ ధరకే అమ్మేందుకు స్కెచ్ ఎవరు వేశారు? అసలు రేవంత్ సర్కారు అంత అగ్గువకు భూములను తెగనమ్మాలని చూడడం వెనుక మతలబు ఏమైనా ఉన్నదా? అంటే అన్ని వైపుల నుంచీ ‘అవును’ అన్న సమాధానమే వస్తున్నది. పక్కా ప్రణాళిక ప్రకారమే అధికారికంగా ఆ భూముల ధర తగ్గించి అగ్గువకు వేలం వేసేందుకు భారీ స్కెచ్ వేశారనే విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. ఒకటీ అరా కాదు! కనిష్ఠంగా దీని వెనుక సుమారు రూ.10 వేల కోట్ల స్కాం దాగి ఉన్నదనే ఆరోపణలు వినిపిస్తున్నాయి.
సాధారణంగా మనం ఏదైనా వ్యవసాయ భూమినిగాని, ప్లాటుగాని అమ్మాలనుకుంటే ఏం చేస్తాం? బహిరంగ మార్కెట్లో ఎంత ధరకు పోతున్నదో, చుట్టుపక్కల ఎంతకు పోయిందో ముందుగా వాకబు చేస్తాం! ఆతర్వాత దానికి కొసరు జోడించి మార్కెట్లో రేటు ప్రకటిస్తాం! ఎవరు ఎక్కువకు కొంటామని ముందుకొస్తే వాళ్లకు అమ్ముతాం! కానీ.. బహిరంగ మార్కెట్లో ఉన్నదాని కంటే తక్కువకే.. అదీ అగ్గువకే ఎవరూ అమ్మాలనుకోరు కదా! మరి.. సాక్షాత్తూ సీఎం రేవంత్‌రెడ్డి సర్కారు ఏకంగా 400 ఎకరాలను బహిరంగ మార్కెట్ కంటే.. అందునా అధికారులు నిర్ణయించిన ధర కంటే అగ్గువకు అమ్మాలనుకున్నది! ఇదేదో ఔటర్ రింగు రోడ్డుకు అవతల ఉన్న భూములను కూడా కాదు! ఐటీ కారిడార్‌లో అత్యంత విలువైన కీలక ఫైనాన్షియల్ డిస్ట్రిక్ట్‌కు ఆనుకొని ఉన్న హెచ్‌సీయూ భూములను!
బీఆర్ఎస్ సర్కారు పోరాట ఫలితం..
రంగారెడ్డి జిల్లా శేరిలింగంపల్లి మండలం కంచ గచ్చిబౌలి గ్రామ పరిధిలోని సర్వేనంబరు 25లో హెచ్సీయూకు చెందిన 400 ఎకరాల భూమి ఉన్న విషయం తెలిసిందే! దీన్ని ఉమ్మడి రాష్ట్రంలో 2003లో సీఎంగా ఉన్న చంద్రబాబునాయుడు అత్యంత చవకగా ఎకరాకు రూ.50 వేల చొప్పున ఐఎంజీ అకాడమీస్ భారత్ అనే సంస్థకు కట్టబెట్టేందుకు ఒప్పందం కుదుర్చుకున్నారు. మంత్రివర్గ ఆమోదం లేకుండా, కుట్రపూరితంగా జరిగిన ఈ భూముల పందేరాన్ని 2004లో అధికారంలోకి వచ్చిన వైఎస్ రాజశేఖర్‌రెడ్డి ప్రభుత్వం రద్దు చేసింది. 2006లో భూములను వెనక్కి తీసుకున్నది. దీంతో సదరు సంస్థ న్యాయస్థానాన్ని ఆశ్రయించింది. అప్పటి ప్రభుత్వం న్యాయపరంగా పోరాటం చేసింది. అప్పటి నుంచీ కోర్టులోనే ఈ కేసు పెండింగ్‌లో ఉన్నది. తెలంగాణ ఏర్పడిన తర్వాత కేసీఆర్ ప్రభుత్వం ఈ అత్యంత విలువైన భూములను కాపాడుకునేందుకు పకడ్బందీ చర్యలు తీసుకుని న్యాయపోరాటాన్ని కొనసాగించింది. సమర్థవంతమైన వాదనలు వినిపించేందుకు ప్రముఖ న్యాయవాదులను నియమించింది. దాని ఫలితంగానే 18 ఏండ్ల తర్వాత హైకోర్టు నిరుడు మార్చిలో తుది తీర్పు ఇచ్చింది. చంద్రబాబు సదరు సంస్థకు కట్టబెట్టిన విధానాన్ని తప్పుబడుతూ ఈ భూములు ప్రభుత్వానివేనని కోర్టు తేల్చిచెప్పింది. న్యాయపరమైన చిక్కులు వీడిపోవడంతో రాష్ట్ర ప్రభుత్వం తన ఆధీనంలోకి తీసుకున్నది.
భూములపై కొందరి కన్ను!
హెచ్‌సీయూ భూములపై హైకోర్టు తీర్పు వచ్చిన తర్వాత కొందరు ప్రముఖుల కన్ను ఈ భూములపై పడినట్టు తెలుస్తున్నది. ఈ మేరకు ప్రభుత్వ పెద్దలతో అప్పట్లోనే సంప్రదింపులు జరగడంతో భూముల వేలంపై ప్రాథమికంగా నిర్ణయం తీసుకున్నట్టు సమాచారం. కాగా నిరుడు మే 12న అంటే హైకోర్టు తీర్పు వచ్చిన సుమారు 2 నెలలకు సీఎం రేవంత్‌రెడ్డి సెంట్రల్ యూనివర్సిటీ మైదానంలో ఫుట్‌బాల్ ఆడేందుకు వెళ్లిన విషయాన్ని పలువురు గుర్తు చేస్తున్నారు. ఈ నేపథ్యంలోనే ప్రభుత్వం 400 ఎకరాలను అమ్మేందుకు చర్యలు మొదలుపెట్టింది. ఇందులో భాగంగా రెవెన్యూ శాఖ నుంచి టీజీఐఐసీకి భూములను బదలాయించేందుకు అన్ని కసరత్తులూ పూర్తిచేసింది. జూన్ 26న 400 ఎకరాలను రెవెన్యూ శాఖ నుంచి టీజీఐఐసీకి బదలాయిస్తూ జీవో 54ను జారీ చేసింది. కంచ గచ్చిబౌలిలోని సర్వేనంబరు 25లో ఉన్న 400 ఎకరాల రెవెన్యూ శాఖ భూమిని అభివృద్ధి చేసి ఐటీ రంగానికి వినియోగించడంతో పాటు మిశ్రమ వినియోగం కోసం టీజీఐఐసీకి బదలాయిస్తున్నట్టుగా ఉత్తర్వుల్లో స్పష్టం చేశారు.
‘కోకాపేట’ ఆధారంగా ఎకరా 75 కోట్లుగా నిర్ధారణ!
సెంట్రల్ వర్సిటీకి చెందిన 400 ఎకరాల భూమిని రెవెన్యూ శాఖ నుంచి టీజీఐఐసీకి బదలాయిస్తూ జారీ చేసిన జీవో 54లోనే ఎకరా ధరను కూడా నిర్ధారించారు. ఇందులో దేని ప్రామాణికంగా ఈ ధరను నిర్ధారించారనే అంశాన్ని కూడా స్పష్టంగా పేర్కొన్నారు. కేసీఆర్ ప్రభుత్వ హయాంలో జరిగిన కోకాపేట నియోపోలీస్ భూముల వేలాన్ని ఇందుకు ప్రామాణికంగా తీసుకున్నారు. గతంలో కోకాపేట, సమీప ప్రాంతాల భూముల వేలం, విక్రయాలను పరిగణనలోకి తీసుకుంటే హెచ్‌సీయూ భూముల ధర ఎకరా రూ.75 కోట్లుగా నిర్ధారించినట్టు పొందుపరిచారు. బోర్డు స్టాండింగ్ ఆర్డర్స్ (బీఎస్‌వో)-24 నిబంధనల మేరకు మార్కెట్ విలువ ఎకరా రూ.75 కోట్ల చొప్పున ఈ బదలాయింపు చేస్తున్నట్టు చెప్పారు. అంటే ఎకరా రూ.75 కోట్ల చొప్పున 400 ఎకరాలకు రూ.30 వేల కోట్లపై బీఎస్‌వో-24 నిబంధనల ప్రకారం పన్ను రాయితీ వర్తిస్తుందన్నమాట! కాగా గతంలో జరిగిన విధానాల మేరకు టీజీఐఐసీ ఈ భూములను అమ్మి, నిధులను సమీకరించుకోవచ్చని ఉత్తర్వుల్లో స్పష్టం చేశారు.
నివేదిక ఆధారంగానే భూముల వేలానికి కసరత్తు!
హెచ్సీయూకు చెందిన 400 ఎకరాల భూములపై అధికారిక విలువను కాదని, ప్రైవేట్ సంస్థ ద్వారా తెప్పించుకున్న నివేదిక ఆధారంగానే ప్రభుత్వం రూ.10 వేల కోట్ల రుణం తీసుకున్నట్లుగా స్పష్టమవుతున్నది. ఈ నేపథ్యంలో దీని ఆధారంగానే భూముల వేలానికి కూడా రంగం సిద్ధం చేసినట్టు తెలిసింది. ఈ మేరకు టీజీఐఐసీ ద్వారా ఆ భూములను అభివృద్ధి చేసేందుకు కంపెనీల నుంచి ఆసక్తి వ్యక్తీకరణ బిడ్లను కూడా ఆహ్వానించింది. 400 ఎకరాల భూములను వేలం వేసేందుకు వీలుగా అభివృద్ధి పనులను చేపట్టేందుకు కొన్ని కంపెనీలు ముందుకొచ్చిన దరిమిలా వారితో ప్రీ బిడ్ సమావేశాన్ని కూడా నిర్వహించారు. అయితే ఇక్కడే సర్కారు వ్యూహం బెడిసికొట్టింది. భూములను వేలం వేసేందుకు కసరత్తు మొదలుకావడంతో వర్సిటీ విద్యార్థులు అప్రమత్తమయ్యారు. తమ వర్సిటీ భూములను కాపాడుకోవడంతో పాటు అరుదైన జీవ వైవిధ్యం, జంతువులున్న ఆ లంగ్‌స్పేస్‌ను కాపాడుకునేందుకు ఉద్యమ బాట పట్టారు. ఎలాగైనా ఆ భూములను వేలం వేసేందుకే పక్కా ప్రణాళిక రూపొందించిన ప్రభుత్వ పెద్దలు విద్యార్థులపై ఖాకీ కాఠిన్యాన్ని ప్రదర్శించారు. ప్రభుత్వ ఆదేశానుసారం పోలీసులు విద్యార్థినులను సైతం జుట్టుపట్టి ఈడ్చుకెళ్లి వాహనాల్లో వేసి అక్కడి నుంచి తరలించారు. అయినా విద్యార్థులు వెనక్కి తగ్గలేదు. పర్యావరణవేత్తలు, మేధావులు వారికి తోడు కావడం, విద్యార్థులు బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్‌ను కలిసి మద్దతు కోరడాన్ని ప్రభుత్వ పెద్దలు జీర్ణించుకోలేకపోయారు. రాత్రికిరాత్రే వందల సంఖ్యలో బుల్డోజర్లను పంపి వేలాది చెట్లను కూల్చడంతో మూగజీవాలు చెల్లాచెదురయ్యాయి.
కోకాపేట కంటే విలువైన భూములు..
ప్రభుత్వం నిరుడు జూన్‌లో జారీ చేసిన జీవో 54లో కేసీఆర్ ప్రభుత్వ హయాంలో జరిగిన కోకాపేట భూముల వేలాన్ని ప్రామాణికంగా తీసుకొని సెంట్రల్ యూనివర్సిటీ భూముల ధరను ఎకరా రూ.75 కోట్లుగా నిర్ధారించారు. కానీ వాస్తవానికి ఆ భూముల కంటే హెచ్‌సీయూ భూములు మరింత విలువైనవని రియల్ నిపుణులు చెప్తున్నారు. కోకాపేటలో నియోపోలీస్ భూములు కొండలు, గుట్టలు. ఐటీ కారిడార్‌కు కొద్ది దూరంలో ఉంటాయి. కానీ హెచ్‌సీయూ భూములు ఐటీ కారిడార్‌కు ఆనుకొని ఉన్నాయి. చదునైన భూములతో పాటు పక్కనే అత్యంత విలువైన లంగ్స్పేస్లా సెంట్రల్ యూనివర్సిటీకి చెందిన మరిన్ని వేల ఎకరాల అటవీ ప్రాంతం ఉన్నది. ఈ క్రమంలో హెచ్‌సీయూ భూములకు కోకాపేట కంటే ధర ఎక్కువగా ఉంటుందనడంలో సందేహం లేదు. కాగా ప్రభుత్వం భూ విలువపై నివేదిక తెప్పించుకున్న పరీష్రావు పన్సె-రావు అసోసియేట్స్ హెచ్‌సీయూ పరిసరాల్లో జరిగిన భూ క్రయ, విక్రయాలను విచారించినట్టు నివేదికలో స్పష్టం చేసింది. కానీ ప్రభుత్వ రికార్డుల్లోనే కోకాపేట భూములు ఎకరా రూ.100 కోట్లు పోయిన ఆధారాలున్నాయి. మరి వాటిని ఎందుకు పరిగణనలోనికి తీసుకోలేదు? అధికారిక రికార్డులను పరిగణనలోనికి తీసుకోకుండా బ్రోకర్లు, నివాసితులతో వాకబు చేసినట్టుగా సదరు సంస్థ నివేదికలో చెప్పడమే పెద్ద విడ్డూరంగా ఉన్నదని రియల్ నిపుణులు విస్మయం వ్యక్తంచేస్తున్నారు. ముఖ్యంగా ఆ నివేదికలో అధికారులు నిర్ధారించిన దాని కంటే ఎకరా రూ.23 కోట్లు తగ్గడమే కాకుండా వాస్తవ విలువ, ఆగమేఘాల మీద అమ్మకం (డిస్ట్రెస్ సేల్) అనే మరో రెండు అంశాలను చేర్చి అంతకంటే ఘోరంగా ధరను తగ్గించడమంటేనే దీని వెనుక కుట్ర దాగి ఉన్నదన్న విమర్శలు వస్తున్నాయి.
నివేదిక ఆధారంగానే రూ.10 వేల కోట్ల రుణం
ప్రభుత్వం అధికారిక ఉత్తర్వుల్లోనే ఎకరా రూ.75 కోట్ల ధరను పొందుపరిచినందున ఆ భూములను తాకట్టు పెట్టి రుణం తెచ్చుకోవాలనుకుంటే అంతకు రూపాయి ఎక్కువే చూపాలి. ఆ మేరకు ఈ భూముల కంటే అవతల ఉన్న కోకాపేటలో ప్రభుత్వం వేలం వేసినప్పుడు ఎకరా రూ.100 కోట్ల ధర పలికిన వాస్తవాన్ని ఆధారంగా చూపే వెసులుబాటు ఉన్నది. కానీ ఇక్కడే రేవంత్‌రెడ్డి సర్కారు వేరేలా ఆలోచించిందనేందుకు ఢిల్లీకి చెందిన ‘పరీష్రావు పన్సె-రావు అసోసియేట్స్’ ఇచ్చిన భూ విలువ నిర్ధారణ నివేదికనే నిదర్శనం. ఏకంగా ఎకరాకు రూ.23 కోట్ల తగ్గుదలతో తెప్పించుకున్న నివేదిక ఆధారంగానే ప్రభుత్వం టీజీఐఐసీ ద్వారా 400 ఎకరాలను తనఖా పెట్టి రూ.10 వేల కోట్ల రుణాన్ని తీసుకున్నది. ఈ ప్రక్రియను నిర్వహించినందుకు మధ్యవర్తిత్వం వహించిన బ్యాంకు కన్సార్షియంకు ఒక శాతం అంటే రూ.100 కోట్లు ఇచ్చారనే ప్రచారం జరుగుతున్నది. అయితే భూముల విక్రయానికి పక్కా స్కెచ్ వేసిన ప్రభుత్వం అందుకే తాకట్టు ప్రక్రియలో భూములను అమ్మి రూ.10 వేల కోట్ల రుణాన్ని చెల్లించే వెసులుబాటును కూడా పొందుపరచడం గమనార్హం.
5 నెలలకే ఎకరాకు రూ.23 కోట్ల తగ్గుదల
రెవెన్యూ శాఖ నుంచి టీజీఐఐసీకి బదలాయించిన సమయంలో ఎకరా ధర రూ.75 కోట్లుగా అధికారిక నిర్ధారణ జరిగిన సెంట్రల్ యూనివర్సిటీ భూముల ధర ఐదు నెలల్లోనే ఎకరాకు రూ.23 కోట్లు తగ్గడం గమనార్హం. ఇదంతా ప్రణాళికలో భాగంగానే జరిగిందనే విమర్శలున్నాయి. ఇందులో భాగంగా ప్రభుత్వం 400 ఎకరాల భూముల బహిరంగ మార్కెట్ విలువపై నివేదిక రూపొందించే బాధ్యతను ప్రభుత్వ అనుమతి ఉన్న భూ విలువ నిర్ధారిత సంస్థకు అప్పగించింది. ఈ మేరకు ఢిల్లీకి చెందిన ‘పరీష్రావు పన్సె-రావు అసోసియేట్స్’ నిరుడు నవంబర్ 23న ఆ భూములను పరిశీలించింది. ఒకేరోజులో అంటే నవంబర్ 23న వాల్యువేషన్ నివేదికను రూపొందించింది. ఐటీ, మిశ్రమ రంగాలకు వినియోగించేందుకు అనుమతి ఉన్న ఈ భూముల విలువ ఎకరా రూ.52 కోట్లుగా నిర్ధారించింది. ఇందుకోసం సదరు సంస్థ చుట్టుపక్కల ఉన్న బ్రోకర్లు, నివాసితులను వాకబు చేసినట్టు తెలిసింది. అసలు అక్కడ నివాసితులెవరున్నారనేది సదరు సంస్థకే తెలియాలి. అదేవిధంగా బహిరంగ మార్కెట్లో జరిగిన ఇటీవలి క్రయ, విక్రయాలు, నమ్మదగిన వర్గాల నుంచి సేకరించిన సమాచారం ఆధారంగా హెచ్‌సీయూ భూముల విలువ ఎకరాకు రూ.50-55 కోట్ల వరకు ఉంటుందని నిర్ధారణకు వచ్చినట్టుగా ఆ సంస్థ తన నివేదికలో పేర్కొంది. వీటన్నింటినీ పరిగణనలోనికి తీసుకొని ఎకరాకు రూ.52 కోట్లుగా నిర్ధారించింది.
అగ్గువకే అమ్మేందుకు స్కెచ్!
ప్రభుత్వం అధికారిక ఉత్తర్వుల్లోనే ఎకరా భూమి ధరను రూ.75 కోట్లుగా నిర్ధారించిన తర్వాత వాల్యుయేషన్ సంస్థ ఎకరా రూ.52 కోట్లుగా నివేదిక ఇవ్వడం వెనుకనే భారీ స్కాం దాగి ఉన్నదనే ఆరోపణలు వినిపిస్తున్నాయి. సామాన్యులే బ్యాంకు రుణాలు కావాలంటే తమ ప్లాట్లు, భూముల ధర బహిరంగ మార్కెట్ కంటే రూపాయి ఎక్కువ ఉండేలా జాగ్రత్తలు తీసుకుంటారు. కానీ ఇక్కడ ప్రభుత్వం లైసెన్సు ఉన్న ఒక ప్రైవేట్ సంస్థ ద్వారా ఎకరాకు రూ.23 కోట్ల తక్కువకు విలువను నిర్ధారించుకున్నదంటే దీని వెనక ఎంత పెద్ద కుట్ర ఉన్నదో అర్థం చేసుకోవచ్చని పలువురు చెప్తున్నారు. ఇలా రూ.30 వేల కోట్ల విలువైన 400 ఎకరాల విలువను రూ.20,800 కోట్లుగా ఉన్నదని సదరు సంస్థ తన నివేదికలో స్పష్టం చేసింది. అంతేకాదు.. ఇది బహిరంగ మార్కెట్ విలువైతే.. ఆ భూముల వాస్తవ విలువ (రిలియబుల్ వాల్యూ) ఎకరా ధర రూ.41.60 కోట్లు ఉంటుందని, 400 ఎకరాలకు రూ.16,640 కోట్లు వస్తాయని చెప్పింది. ఇక మరో విచిత్రమైన విషయమేమిటంటే ఫటాఫట్మని అమ్మాలనుకుంటే ఎకరా ధర రూ.36.40 కోట్లేనని చెప్పింది. ఇలా 400 ఎకరాలకు రూ.14,560 కోట్లు మాత్రమే వస్తాయని నివేదికలో స్పష్టం చేసింది. కుట్రలో భాగంగా 5 దఫాలుగా వేలాన్ని నిర్వహించాలనుకున్న ప్రభుత్వ పెద్దలు మొదటి దఫా వంద ఎకరాలను అమ్మేందుకు నిర్ణయించినట్టు విశ్వనీయ సమాచారం. ఆ మేరకు ఒక ఫార్మా – రియల్ కంపెనీతో సంప్రదింపులు చేసినట్టు ఆరోపణలున్నాయి.
ఆ నివేదిక ప్రకారం..
భాగ్యనగరికి పశ్చిమాన.. అత్యంత విలువైన ఫైనాన్షియల్ డిస్ట్రిక్ట్ ప్రాంతంలో… కనీసం ఎకరా వంద కోట్లు పలికే చోట… కొలువైన హైదరాబాద్ సెంట్రల్ వర్సిటీ భూముల్లోకి…
పక్కనే కోకాపేటలో ప్రభుత్వం నిర్వహించిన అధికారిక వేలంలోనే, రాళ్లు రప్పలతో నిండిన భూమే, ఎకరా వంద కోట్లకు అమ్ముడు పోయింది. అత్యంత సుందరమైన, ప్లెయిన్ ల్యాండ్‌గా ఉన్న వర్సిటీ భూమి మాత్రం ఎకరా 52 కోట్లేనట. రియల్ ఎస్టేట్ బ్రోకర్లు, నివాసితులు, ఇటీవల జరిగిన క్రయ విక్రయాల నుంచి ఆరా తీసి 50-55 కోట్లుగా నిర్ధారించామని వాల్యుయేషన్ రిపోర్టులో పేర్కొన్నారు. భూముల ధరకు ప్రాతిపదిక అంతకుముందు జరిగిన లావాదేవీ మాత్రమేనన్నది జీవోలో ఉండగా, ఈ రిపోర్టు తయారు చేసిన వారికిగానీ, ప్రభుత్వ పెద్దలకు గానీ కోకాపేట వందకోట్లు ఎందుకు కనిపించలేదు? అధికారులు నిర్ధారించిన ధర అకస్మాత్తుగా, అడ్డగోలుగా ఎకరా రూ.23 కోట్లు ఎందుకు తగ్గిపోయింది?
కేసీఆర్ ప్రభుత్వ హయాంలో జరిగిన కోకాపేట (నియోపొలిస్) భూముల వేలంలో పలికిన ఎకరా వంద కోట్ల ధరను, ఇటీవల పరిసర గ్రామాల్లో జరిగిన ప్రభుత్వ వేలం పాటలను పరిగణనలోకి తీసుకుని వర్సిటీ భూములకు బేస్ ప్రైస్‌ని రూ.75 కోట్లుగా ఖరారు చేసినట్టు అధికారులు జీవోలో పేర్కొన్న దృశ్యం.
వర్సిటీ భూముల విలువ ఎకరానికి రూ.52 కోట్లేనంటూ పరిష్రావు పన్సే- రావ్ అసోసియేట్స్‌తో 23.11.2024 న రేవంత్ ప్రభుత్వం తెప్పించుకున్న వాల్యుయేషన్ రిపోర్టు.
అవసరమైతే మరింత తగ్గించుకునేందుకు వీలుగానేమో, పరిష్రావు పన్సే- రావ్ అసోసియేట్స్ ఇచ్చిన నివేదికలో వాస్తవ ధర ఎకరా 41.60 కోట్లే అని, ఫటాఫట్ (డిస్ట్రెస్ సేల్) అమ్మితే ఎకరా 36.40 కోట్లకు దాటదని పేర్కొన్న దృశ్యం.
కంచె గచ్చిబౌలిలోని హైదరాబాద్ సెంట్రల్ వర్సిటీ భూముల ధరను ఎకరా 75 కోట్లుగా నిర్ధారిస్తూ అధికారులు ఇచ్చిన పత్రం. ఈ ధరకే 400 ఎకరాల భూములను తెలంగాణ పారిశ్రామిక మౌలిక సదుపాయాల కల్పన సంస్థ (టీజీఐఐసీ)కి బదలాయించారు. ఆ మేరకు జారీచేసిన ఉత్తర్వులు (జీవో నం.54. తేదీ 26.6.2024)