హైదరాబాద్, ఏప్రిల్ 9 (నమస్తే తెలంగాణ): హెచ్‌సీయూ భూముల అమ్మకంలో భారీ స్కాం జరిగిందని, అందులో బీజేపీకి చెందిన ఒక ఎంపీ హస్తం ఉన్నదంటూ బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ఆరోపించిన నేపథ్యంలో బీజేపీ ఎంపీలు హెచ్‌సీయూను సందర్శించారు. ఈటల, రఘునందన్‌రావు, విశ్వేశ్వర్‌రెడ్డి బుధవారం వర్సిటీకి వెళ్లి వీసీ, రిజిస్ట్రార్‌తో భేటీ అయ్యారు. కంచ గచ్చిబౌలి భూములు యూనివర్సిటీకి చెందినవా? లేక ప్రభుత్వానికి చెందినవా? అని అడిగి తెలుసుకున్నారు. భూముల రికార్డులను పరిశీలించారు. అనంతరం మీడియాతో మాట్లాడారు. ఈ సందర్భంగా కేటీఆర్ చేసిన ఆరోపణలను విలేకర్లు ప్రస్తావించారు. దీనికి రఘునందన్ బదులిస్తూ.. ‘బీజేపీ ఎంపీ పేరు బయటకి వస్తే నిజానిజాలు తెలుస్తాయి కదా’ అని సమాధానాన్ని దాటవేశారు. లీగల్ అంశాలు తెలుసుకొనేందుకు హెచ్సీయూకు వచ్చామని, తాము పరిశీలించిన అంశాలను పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు కిషన్‌రెడ్డి దృష్టికి తీసుకెళ్తామని చెప్పారు.
ట్రిపుల్ఆర్ అనుమతులు వేగవంతం చేయండి ; అధికారులకు కేంద్ర హోం మంత్రిత్వశాఖ సూచనలు
హైదరాబాద్, ఏప్రిల్ 9 (నమస్తే తెలంగాణ): హైదరాబాద్ రీజినల్ రింగురోడ్డు(ట్రిపుల్ఆర్) ఉత్తర భాగం అనుమతుల ప్రక్రియ వేగవంతం కోసం కేంద్ర రోడ్డురవాణాశాఖ అధికారులు చర్యలు తీసుకోవాలని కేంద్ర హోంశాఖ సూచించింది. ప్రతిపాదిత హైదరాబాద్-అమరావతి గ్రీన్‌ఫీల్డ్ ఎక్స్‌ప్రెస్ హైవే నిర్మాణానికి పచ్చజెండా ఊపింది. సమగ్ర ప్రాజెక్ట్ రిపోర్ట్ తయారీ కోసం చర్యలు చేపట్టాలని తెలిపింది. కేంద్ర హోంశాఖ కార్యదర్శి గోవింద్‌మోహన్ ఫిబ్రవరి 3న సమావేశం నిర్వహించారు. ఆ మినిట్స్‌ను ఇటీవల రెండు రాష్ర్టాలకు పంపారు.