వేములవాడ టౌన్: మహాశివరాత్రి సందర్భంగా రాష్ట్రంలోని ప్రముఖ శైవక్షేత్రమైన వేములవాడ (Vemulawada) రాజరాజేశ్వర స్వామి ఆలయానికి భక్తులు పోటెత్తారు. రాజన్నకు కోడెలు సమర్పించుకుని మొక్కులు తీర్చుకోవడానికి బుధవారం వేకువజామునే పెద్ద సంఖ్యలో తరలివచ్చారు. అయితే అధికారుల నిర్లక్ష్యంతో భక్తులకు తిప్పలు తప్పలేదు. రద్దీకి అనుగునంగా సౌకర్యాలు కల్పించడంలో విఫలమయ్యారు. ప్రదర్శనం కల్పిస్తామని అధికారులు చెప్పడంతో గంటల తరబడి భక్తులు లైన్లలో నిలబడాల్సి వచ్చింది.
మహాశివరాత్రి పర్వదినం సందర్భంగా అర్ధరాత్రి స్థానికులు, మీడియాకు, ప్రజాప్రతినిధులకు ఏర్పాటుచేసిన ప్రత్యేక దర్శనంలోనూ ఇబ్బందులు పడక తప్పలేదు. ప్రధాన ఆలయంలో గంటల క్యూలో నిలబడి భక్తులు తీవ్ర ఇబ్బందులకు గురయ్యారు. అర్ధరాత్రి నుంచే క్యూలో 6 గంటలపాటు వేచి ఉన్నప్పటికీ దర్శనం కాలేదని, ప్రధాన ఆలయంలోకి అనుమతించలేదని భక్తులు ఆవేదన వ్యక్తం చేశారు. రాజన్న దర్శనం కాకుండానే శిఖర దర్శనం చేసుకున్నట్లు తెలిపారు.
రాజన్న ఆలయ, పోలీస్ అధికారుల మధ్య సమన్వయ లోపం
రాజన్న ఆలయ సిబ్బంది, పోలీసు అధికారుల మధ్య సమన్వయ లోపం భక్తులకు ఇబ్బంది కలిగించింది. క్యూలైన్లలో భక్తులను క్రమసంఖ్యలో పంపించాల్సిన సిబ్బంది పట్టించుకోకపోవడంతో, బారీ కేడ్ల పైనుంచి దూకి ఒకరినొకరు చూసుకుంటూ గొడవపడడం కనిపించింది. వీఐపీలు, అధికారులు తమ బంధు సేవలోనే తరించి తరించిపోతున్నారని భక్తులు ఆగ్రహం వ్యక్తం చేశారు.