హైదరాబాద్: రాష్ట్ర వ్యాప్తంగా శైవ క్షేత్రాలు కార్తిక శోభను (Karthika Masam) సంతరించుకున్నాయి. కార్తిక మాసం తొలి సోమవారం కావడంతో మహాశివుని ఆలయాలకు భక్తులు పోటెత్తారు. తెల్లవారుజామునే శివయ్యను దర్శించుకుని, ఆలయాల్లో కార్తిక దీపాలను వెలిగించారు. పెద్ద సంఖ్యలో భక్తులు తరలిరావడంతో ‘ఓం నమఃశివాయా’ పంచాక్షరీ మంత్రంతో మారుమ్రోగుతున్నాయి. ఆది దేవుడి దర్శించుకుని మొక్కులు తీర్చుకున్నారు. వేములవాడ, కాళేశ్వర ముక్తేశ్వర ఆలయం, నల్లగొండ ఛాయా సోమేశ్వర ఆలయం, చెర్వుగట్టుతోపాటు హైదరాబాద్లోని శైవ క్షేత్రాల్లో భక్తుల రద్దీ నెలకొన్నది.

కార్తిక సోమవారం ఉపవాసం ఆచరించిన వ్యక్తికి కైలాస ప్రవేశం ఉంటుందని భక్తులు ప్రగాఢంగా నమ్ముతారు. కార్తీక సోమవారం వత్రం చేయడం వల్ల సకల పాపాలు తొలగిపోయి.. కుటుంబంలో సుఖసంతోషాలు, అష్ట ఐశ్వర్యాలు కలుగుతాయని.. వివాహం కానీ స్త్రీలకు మంచి భర్త వస్తారని.. వివామైన వాళ్లకు మాంగల్య బలం పెరుగుతుందని నమ్మకం. ఇక ఈరోజున కార్తీక సోమవారం కథ విన్నా, చదివినా విశేషమైన పుణ్య ఫలం దక్కుతుందని భక్తుల విశ్వాసం.
