HYDRAA | హైదరాబాద్, అక్టోబర్ 21 (నమస్తే తెలంగాణ): సొంతిల్లు.. మధ్యతరగతి ప్రజల జీవితకాల స్వప్నం. ఈ కలలు ఇప్పుడు చెదిరిపోతున్నాయి. మారిన ఆర్థిక పరిస్థితులు, మార్కెట్ స్వరూపం, ప్రభుత్వ విధానాలు.. అన్నీ కలిసి రాష్ట్రంలో సగటు కుటుంబాల సొంతింటి కలలను చిదిమేశాయి. రాష్ట్రంలో రియల్ఎస్టేట్ రంగం కుప్పకూలింది. కొనేవారు లేక అమ్మేవారి పరిస్థితి అగమ్యగోచరంగా తయారైంది. పెట్టిన పెట్టుబడులు రాక బిల్టర్లు అప్పుల ఊబిలో కూరుకుపోతున్నారు. రాష్ట్రంలో కరోనా నాటి పరిస్థితులు మళ్లీ దాపురించాయి. ఇందుకు స్టాంపులు, రిజిస్ట్రేషన్ల శాఖ గణాంకాలే ఉదాహరణ. 2020-21లో కొవిడ్ కారణంగా ఏప్రిల్ నుంచి సెప్టెంబర్ మధ్య కాలంలో 4.81 లక్షల రిజిస్ట్రేషన్లు మాత్రమే నమోదయ్యాయి. 2021-22 తొలి ఆరు నెలల్లో 9.25 లక్షల రిజిస్ట్రేషన్లు జరిగాయి. తర్వాత రెండేండ్లు వరుసగా ఆరు నెలల్లోనే 10 లక్షలకుపైగా రిజిస్ట్రేషన్లు నమోదయ్యాయి. ఈ ఏడాది ఏప్రిల్ నుంచి సెప్టెంబర్ మధ్య కేవలం 9.19 లక్షల రిజిస్ట్రేషన్లు జరిగాయి. అంటే 2021-22 కన్నా తక్కువ. కొవిడ్ రెండో వేవ్, మూడో వేవ్ ముప్పును కూడా తట్టుకున్న రాష్ట్ర రియల్ఎస్టేట్ రంగం.. ప్రభుత్వ అసంబద్ధ విధానాలతో అంతకుమించిన విపత్తును ఎదుర్కొంటున్నదని నిపుణులు చెప్తున్నారు.
ఆగిన ప్రాజెక్టులు
రాష్ట్ర రియల్ఎస్టేట్ మార్కెట్‌కు ప్రధాన కేంద్రమైన హైదరాబాద్‌లో నెలకొన్న పరిస్థితులు యావత్తు విపణినే ప్రభావితం చేస్తున్నాయి. కొత్త ప్రాజెక్టులు ఆగిపోయాయి. హైదరాబాద్ నగరం చుట్టుపక్కల, రంగారెడ్డి, మేడ్చల్-మల్కాజిగిరి శివారు ప్రాంతాల్లో ఎక్కడిదక్కడే అన్నట్టు తయారైంది. కొల్లూరులో హాల్‌మార్క్ ప్రాజెక్ట్ నిలిచిపోయింది. మరెన్నో ప్రాజెక్టులదీ ఇదే పరిస్థితి.100-200 గజాల్లో ఇండిపెండెంట్ హౌజ్‌లు నిర్మించినవారి కష్టాలైతే అన్నీ ఇన్నీ కావు. మార్కెట్ బాగుంది కదా అని అప్పులు చేసి నిర్మాణాలు చేపట్టినవారిని నష్టాలు వెంటాడుతున్నాయి. 10-20 ఫ్లాట్లతో నిర్మించిన అపార్ట్మెంట్లలో పనులకు బిల్డర్లు విరామం ప్రకటించారు.
పైసా.. రాక-పోక లేదు
అమ్మకాల్లేక బిల్డర్లు నగదు కొరతను ఎదుర్కొంటున్నారు. ఇన్నాళ్లూ సజావుగా సాగిన రియల్ఎస్టేట్ కార్యకలాపాలు, లావాదేవీలు ఇప్పుడు ఒక్కసారిగా నిలిచిపోవడంతో చేతుల్లో పైసల్లేని దుస్థితి నెలకొంటున్నది. బ్యాంకులు రుణాలిచ్చేందుకూ మొహం చాటేస్తుండటంతో పరిస్థితులు కఠినంగా మారిపోయాయి. ఒక్క హైదరాబాద్లోనేగాక రాష్ట్రంలోని ఇతర ప్రాంతాల్లోనూ నిర్మాణ రంగం కుదేలవడం ఆందోళనకరం. తెలంగాణ వచ్చిన తర్వాత తొలి తొమ్మిదిన్నరేండ్లలో పెరుగుతూపోయిన భూముల ధరలు.. ఇప్పుడు మళ్లీ నేలచూపులు చూస్తున్నాయి. రాష్ట్రంలో కొత్త జిల్లాల ఏర్పాటుతో అంతటా రియల్ఎస్టేట్ బూమ్ ఏర్పడింది. ఎందరో మధ్యతరగతి కుటుంబాల ఆర్థిక స్థితిగతులు మెరుగయ్యాయి. కానీ, రియల్ఎస్టేట్ డౌన్‌తో అంతా తలకిందులవుతున్నది.
రిజిస్ట్రేషన్ల ఆదాయం ఆవిరి
రియల్ఎస్టేట్లో నెలకొన్న మందగమనం.. రిజిస్ట్రేషన్ల ఆదాయాన్ని ఆవిరి చేసింది. ఒక్క సెప్టెంబర్ నెలలోనే రాష్ట్రవ్యాప్తంగా రిజిస్ట్రేషన్ శాఖ రెవెన్యూ 30% పడిపోవడం గమనార్హం. గత నెలలో 80 వేల లావాదేవీలే నమోదయ్యాయి. వీటి విలువ రూ.650 కోట్లు మాత్రమే. హైడ్రా రాకతో రంగారెడ్డి, మేడ్చల్-మల్కాజిగిరి శివారు ప్రాంతాల్లో రియల్ఎస్టేట్ లావాదేవీలు పూర్తిగా తగ్గిపోయాయని చెప్తున్నారు. రాష్ట్రవ్యాప్తంగా పరిశీలించినా.. ఈ ఏడాది ఆగస్టు, సెప్టెంబర్‌లో రిజిస్ట్రేషన్లు సంఖ్య, ఆదాయం గణనీయంగా పడిపోయిందని గణాంకాలు చెప్తున్నాయి. జూలైతో పోల్చితే ఆగస్టులో రిజిస్ట్రేషన్లు 27.39% తగ్గగా, ఆదాయం 30% పడిపోయింది. ఆగస్టుతో పోల్చితే సెప్టెంబర్‌లో రిజిస్ట్రేషన్లు 13% తగ్గగా.. ఖజానాకు 28% రాబడి తగ్గినట్టు గణాంకాలు స్పష్టంచేస్తున్నాయి. మొత్తంగా హైడ్రా రాకముందు జూలైలో స్టాంపులు, రిజిస్ట్రేషన్ల శాఖకు రూ.1,531 కోట్ల ఆదాయం రాగా.. సెప్టెంబర్ నాటికి రూ.770 కోట్లకు పడిపోయిందని చెప్తున్నారు. అంటే రాబడి సగం తగ్గిందని పేర్కొంటున్నారు.
ఆఫీస్ మార్కెట్.. ఔట్
హైదరాబాద్ ఆఫీస్ మార్కెట్ అంటేనే హాట్ కేక్. అయితే ఇదంతా ఒకప్పుడు. ఇప్పుడు నగరంలో ఆఫీస్ స్పేస్‌లకు డిమాండే కరువైంది. గచ్చిబౌలి, ఫైనాన్షియల్ డిస్ట్రిక్ట్ల్లో ‘ఏ’ గ్రేడ్ ఆఫీస్ బిల్డింగులు చాలావరకు ఖాళీగానే దర్శనమిస్తుండటం ఇందుకు అద్దం పడుతున్నది. 15 లక్షల చదరపు అడుగుల నుంచి 50 లక్షల చదరపు అడుగుల వరకున్న ఆఫీస్ స్పేస్‌లు లీజింగ్‌కు నోచుకోవడం లేదు. కొత్త కంపెనీలు రాక, పెట్టుబడులు లేక ఆఫీస్ స్పేస్ కళ తప్పింది. నిజానికి గత బీఆర్ఎస్ ప్రభుత్వ హయాంలో రాష్ట్రంలోకి ఐటీ, డాటా కంపెనీలు పెద్ద ఎత్తున రావడంతో ఇక్కడ భారీగానే నిర్మాణాలు జరిగాయి. కానీ ప్రభుత్వం మారడం, వ్యాపార, పారిశ్రామిక రంగాలు నిరాదరణకు గురవడంతో మార్కెట్లోనూ ఆ నీరసం కనిపిస్తున్నది.
విజన్ లేని రాష్ట్ర ప్రభుత్వం
రాష్ట్ర ప్రభుత్వానికి ఒక విజన్ అంటూ లేకపోవడం కూడా రియల్ఎస్టేట్ మార్కెట్‌కు శాపంలా తయారైందన్న అభిప్రాయం వ్యక్తమవుతున్నది. వ్యాపార, పారిశ్రామిక రంగాలపై దృష్టి కొరవడటంతో పెట్టుబడులు రాక ఆఫీస్ స్పేస్ మార్కెట్ ఆగమైపోయింది. మరోవైపు హైడ్రా పేరిట తీసుకుంటున్న చర్యలు, నిర్ణయాలు.. రెసిడెన్షియల్ మార్కెట్‌ను కుదేలు చేస్తున్నాయి. ఇకపై కూడా ఇలాగే ఉంటే రియల్ఎస్టేట్ మార్కెట్ దారుణంగా దెబ్బతింటుందని, అనుబంధ రంగాలూ కోలుకోలేవని ఇండస్ట్రీ నిపుణులు అభిప్రాయపడుతున్నారు. గత ప్రభుత్వం అవలంభించిన విధానాలతో వచ్చిన ప్రయోజనం అంతా దూరమైపోతున్నదన్న ఆవేదన వారిలో కనిపిస్తున్నది.
పాతికేండ్ల సాగర్ ప్రైవేట్ కంపెనీలో ఉద్యోగి. ఐదంకెల జీతం వస్తుండటంతో ఇల్లు కొనేందుకు సిద్ధమయ్యాడు. కానీ, ఇప్పుడున్న పరిస్థితితో కొంతకాలం ఆగడమే ఉత్తమమని మానుకున్నాడు.శేషగిరి ఒక బిల్డర్. రెండు దశాబ్దాలుగా నిర్మాణ రంగంలోనే స్థిరపడ్డాడు. ఇండ్లు, అపార్ట్మెంట్లు నిర్మించి విక్రయిస్తూ జీవనం సాగిస్తున్నాడు. కానీ, పది నెలలుగా సీన్ రివర్సైంది. కట్టిన ఇండ్లు అమ్ముడుపోక, పెట్టుబడి భారంగా మారింది. అప్పుల భయంతో ఆత్మహత్యే శరణ్యం అన్నట్టుగా పరిస్థితి తయారైంది.
ఒక్క సాగర్, శేషగిరిలదే కాదు ఈ పరిస్థితి. ఇలాంటి వారెందరో కనిపిస్తున్నారు ఇప్పుడు. మూడు పువ్వులు, ఆరు కాయలుగా సాగుతున్న రాష్ట్ర రియల్ఎస్టేట్ మార్కెట్.. పది నెలలుగా కళ తప్పింది. అటు బయ్యర్లు, ఇటు సెల్లర్లు ఒక్కసారిగా డైలమాలో పడిపోయారు. ఫలితంగా భారీ మొత్తంలో లావాదేవీలు స్తంభించిపోయాయి.కొత్త నిర్మాణాల్లేక, పూర్తయినవి అమ్ముడుపోక కరోనా నాటి భయానక పరిణామాలు మళ్లీ తలెత్తడం ప్రస్తుతం అత్యంత ఆందోళనకరం.
హైడ్రాతో కుదేలు
తెలంగాణలో గత రెండు నెలలుగా రియల్ఎస్టేట్ మార్కెట్ కార్యకలాపాలు, లావాదేవీలు క్షీణించాయి. హైదరాబాద్ అభివృద్ధి ప్రయోజనాలను కాపాడటంలో ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి విఫలమయ్యారు. అమాయక ప్రజల ఇండ్ల మీదికి కాంగ్రెస్ సర్కారు బుల్డోజర్లను తోలుతున్నది. ఏరకంగానూ రాష్ట్ర సంపదను పెంచలేకపోతున్న రేవంత్‌రెడ్డి.. ఇక్కడి ఆదాయ వనరులను మాత్రం పూర్తిగా ధ్వంసం చేసే పనిలోపడ్డారు. ఇదంతా చూస్తుంటే తెలంగాణ భవిష్యత్ ఏమిటా? అన్న ఆందోళన కలుగుతున్నది.
– ‘ఎక్స్’లో బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్
కన్సల్టెంట్ల నివేదికలివి
ఈ ఏడాది మొదలు హైదరాబాద్‌లో స్థిరాస్తి అమ్మకాలు పడిపోతూనే ఉన్నాయి. జనవరి-మార్చిలో 19,660 ఇండ్ల అమ్మకాలు జరిగితే, ఏప్రిల్-జూన్‌లో 15,085 యూనిట్లకే పరిమితమయ్యాయి. 23% క్షీణించాయి.
– అనరాక్
ఈ సంవత్సరం జూలై-సెప్టెంబర్ త్రైమాసికంలో హైదరాబాద్ హౌజింగ్ సేల్స్‌లో 19% పతనం కనిపించింది. గత ఏడాది ఇదే వ్యవధిలో 14,191 యూనిట్ల అమ్మకాలు జరిగితే, ఈ ఏడాది జూలై-సెప్టెంబర్‌లో 11,564 యూనిట్లే అమ్ముడుపోయాయి.
– ప్రాప్‌టైగర్
హైదరాబాద్ రియల్ఎస్టేట్ మార్కెట్ నిరాశాజనకంగా ఉన్నది. ఈ జూలై-సెప్టెంబర్‌లో మొదలైన కొత్త ప్రాజెక్టులు తక్కువే. పూర్తయిన ఇండ్ల విక్రయాలూ అంతంతే. నిరుడుతో పోల్చితే కొత్త నిర్మాణాలు 54%, ఇండ్ల అమ్మకాలు 42% పడిపోయాయి. దేశంలోని ప్రధాన మెట్రో నగరాల్లో ఇదే అత్యధికం. – ప్రాప్‌ఈక్విటీ
హైదరాబాద్ ఆఫీస్‌స్పేస్ మార్కెట్లో స్తబ్ధత నెలకొన్నది. ఈ జూలై-సెప్టెంబర్ త్రైమాసికంలో వర్క్‌స్పేస్ లీజింగ్ 26% క్షీణించింది. నిరుడు ఇదే వ్యవధిలో 29 లక్షల చదరపు అడుగుల్లో లీజింగ్ జరిగింది. ఈసారి మాత్రం 22 లక్షల చదరపు అడుగులకే పరిమితమైంది.
– నైట్ ఫ్రాంక్
‘రియల్’కష్టాలు
స్థిరాస్తి అమ్మకాలపై బిల్డర్లు, రియల్టర్లు తీవ్ర భయాందోళనలకే గురవుతున్నారు. సోషల్ మీడియా వేదికగా తమ ఆవేదనను వెలిబుచ్చే పరిస్థితి కూడా లేకుండాపోతున్నది. పోస్టులు పెడితే మరే కష్టం ఏవైపు నుంచి వస్తుందోనన్న గుబులు. ఏదిఏమైనా ఇండస్ట్రీ ఇప్పుడు ఒత్తిడిలో ఉన్నది. ఇండ్లు, ఫ్లాట్లు, వెంచర్లను సందర్శించేవారే లేరు. అమ్మకాల్లేక నిర్మాణ రంగం బాగా దెబ్బతిన్నది.
– క్రెడాయ్ హైదరాబాద్ సభ్యుడు
నిరుడు పండుగ సీజన్లో ఇండ్లు బాగా అమ్ముడుపోయినయ్. కానీ ఈ యేడు ఆ సంబురం లేదు. ఇండ్లు కొనేటోళ్లే లేరు. చూసేందుకూ వస్తలేరు. ఇంకెంత కాలం ఈ తిప్పలు పడాల్నో అర్థమైతలేదు.
-దేవన్న, రియల్ఎస్టేట్ మధ్యవర్తి
అప్పులు తీసుకొచ్చిమరీ ఇండ్లు కట్టాం. ఇప్పుడు అమ్ముడుపోక కష్టపడుతున్నాం. హైడ్రా భయాలతో ఏది కొంటే ఏమవుతుందోనన్న ఆందోళనలు జనాల్లో ఉన్నాయి. ఈ అయోమయం తగ్గేదాకా కొనుగోళ్ల జోలికి పోకపోవడమే మంచిదనుకుంటున్నారంతా.
-జగన్నాథ్‌రెడ్డి, హైదరాబాద్‌లోని బిల్డర్
వివిధ సంవత్సరాల్లో ఏప్రిల్-సెప్టెంబర్ మాసాల్లో రిజిస్ట్రేషన్లు
సంవత్సరం రిజిస్ట్రేషన్లు (లక్షల్లో)