హైదరాబాద్, అక్టోబర్ 19 (నమస్తే తెలంగాణ): జూబ్లీహిల్స్ నియోజకవర్గంలో బీఆర్ఎస్లోకి చేరికలు ఉపందుకున్నాయి. కాంగ్రెస్ సహా ఇతర పార్టీల నుంచి కూడా పెద్ద సంఖ్యలో నాయకులు గులాబీ గూటికి చేరుతున్నారు. జాతీయ పార్టీల్లో కీలకంగా వ్యవహరించిన నేతలు కూడా కారెక్కుతున్నారు. సాధారణంగా అధికార పార్టీ నుంచి ప్రతిపక్ష పార్టీలోకి వలసలు చాలా అరుదు. కానీ, రెండేండ్లుగా కాంగ్రెస్ ప్రభుత్వం చేపట్టిన ప్రజావ్యతిరేక కార్యక్రమాలు, చర్యలను జీర్ణించుకోలేని చాలామంది హస్తం నేతలు బీఆర్ఎస్లోకి వస్తున్నారు. నిత్యం గులాబీ గూటికి చేరుతున్న వారితో బీఆర్ఎస్ పార్టీ ప్రధాన కార్యాలయం తెలంగాణ భవన్ కిటకిటలాడుతున్నది. ఆదివారం కూడా వివిధ పార్టీలకు చెందిన కీలక నాయకులు, కార్యకర్తలు, తమ అనుచరులతో తెలంగాణభవన్‌లో బీఆర్ఎస్ వరింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ సమక్షంలో పార్టీలో చేరారు. ఈ సందర్భంగా కేటీఆర్ వారికి గులాబీ కండువా కప్పి, పార్టీలోకి సాదరంగా ఆహ్వానించారు. మాజీ మంత్రి, సిద్దిపేట ఎమ్మెల్యే హరీశ్‌రావు సమక్షంలోనూ చేరికలు జరిగాయి.
అంజిబాబు దంపతుల సంచలన చేరిక
జూబ్లీహిల్స్ నియోజకవర్గ పరిధిలోని ఎల్లారెడ్డిగూడకు చెందిన బీఎస్పీ పార్టీ సీనియర్ నేత అంజిబాబు- పల్లవి దంపతులు ఆదివారం బీఆర్ఎస్లో చేరారు. అంజిబాబు గతంలో జూబ్లీహిల్స్ నియోజకవర్గంలో బీఎస్పీ తరఫున పోటీ చేసి భారీగా ఓట్లు సాధించారు. ఈ సందర్భంగా తమ చేరికకు గల కారణాలను అంజిబాబు వివరించారు. ‘తెలంగాణ ఏర్పడిన తర్వాత కేసీఆర్ నాయకత్వంలో రాష్ట్రం అద్భుతమైన అభివృద్ధి సాధించింది. గత రెండేండ్లుగా తెలంగాణ ప్రగతి అస్తవ్యస్తమైంది. తిరిగి కేసీఆర్ నాయకత్వంలోనే తెలంగాణ బాగుపడుతుందన్న ఏకైక ఉద్దేశంతో ఈ రోజు పార్టీలో చేరిన’ అని ఆయన చెప్పారు. రాష్ట్ర ఏర్పాటుకు ముందు కూడా బీఆర్ఎస్లో కీలకంగా పనిచేసిన విషయాన్ని ఈ సందర్భంగా ఆయన ప్రస్తావించారు. మరోసారి తెలంగాణను కాపాడుకునేందుకు తన శాయశక్తులా కృషి చేస్తానని తెలిపారు.
వివిధ డివిజన్ల నుంచి భారీగా చేరికలు
జూబ్లీహిల్స్ నియోజకవర్గంలోని వివిధ డివిజన్ల నుంచి కూడా నాయకులు పెద్దసంఖ్యలో బీఆర్ఎస్లో చేరారు. ముస్లిం మైనారిటీ మహిళా నాయకులు కూడా గులాబీ కండువాలు కప్పుకున్నారు. కేటీఆర్ సమక్షంలో బండారి లక్ష్మారెడ్డి, ఎంకే బద్రుద్దీన్ మార్గదర్శకత్వంలో గులాబీ గూటికి చేరారు. గతంలో కాంగ్రెస్ పార్టీలో సేవలు అందించిన సీనియర్ ముస్లిం మైనారిటీ మహిళా నాయకురాళ్లు ముసాన్ బాను, షెహజాది బేగం, బుష్రా బేగం, నస్రీన్ సుల్తానా బీఆర్ఎస్ పార్టీలో చేరారు. వీరితోపాటు మాజీ కార్పొరేటర్ షఫీ ఆధ్వర్యంలో రహ్మత్నగర్కి చెందిన వివిధ పార్టీలకు చెందిన 200 మంది బీఆర్ఎస్ చేరారు.