హైదరాబాద్ : నిజామాబాద్ జిల్లాలోని శ్రీరాంసాగర్ ప్రాజెక్టుకు భారీగా వరద ప్రవాహం కొనసాగుతున్నది. ఎగువ ప్రాంతాలతో పాటు పరీవాహక ప్రాంతాల్లో భారీ వర్షాలు కురుస్తుండడంతో జలాశయంలోకి భారీగా వరద నీరు వచ్చి చేరుతున్నది. ప్రస్తుతం ప్రాజెక్టుకు 4.83లక్షల క్యూసెక్కుల ఇన్‌ఫ్లో వస్తున్నది. డ్యామ్‌లో ప్రస్తుతం 1084 అడుగుల మేర నీరుంది. పూర్తిస్థాయి నీటిమట్టం 1091 అడుగులు. ప్రస్తుతం ప్రాజెక్టులో నీటి నిలువ 64.677 టీఎంసీలు కాగా.. పూర్తిస్థాయి నీటి నిల్వ సామర్థ్యం 90.3 టీఎంసీలు. ఇదిలా ఉండగా.. గత మూడు రోజులుగా నిజామాబాద్ జిల్లాలో భారీ వర్షాలు కురుస్తున్నాయి.
దీంతో ప్రాజెక్టులు, చెరువులు జలకళను సంతరించుకున్నాయి. నిజామాబాద్‌లోని సింగీతం, పోచారం ప్రాజెక్టుల అలుగులు పారుతున్నాయి. మరో వైపు అధికారులు కల్యాణి ప్రాజెక్టు గేట్లు ఎత్తి నీటిని దిగువకు వదులుతున్నారు. నవీపేట మండలం సీరన్పల్లిలో జన్నపల్లి మాటుకాలువకు గండిపడగా.. వంద ఎకరాల్లో పంట నీటమునిగింది. భారీ వర్షాల కారణంగా నిజామాబాద్ జిల్లావ్యాప్తంగా 12 ఇండ్లు దెబ్బతిన్నాయి. నవీపేట, నందిపేట్‌లో అత్యధికంగా 20 సెంటీమీటర్ల వర్షపాతం నమోదైంది. భారీ వర్షాల దృష్ట్యా నిజామాబాద్ కలెక్టరేట్లో కంట్రోల్ రూం ఏర్పాటు చేశారు. జిల్లావాసులు 08462-220183 నంబరులో సంప్రదించాలని అధికారులు సూచించారు.