మహబూబ్నగర్: ఎగువ ప్రాంతాల్లో కురిసిన వర్షాలకు కృష్ణ, తుంగభద్ర నదులకు వరద మొదలైంది. కృష్ణమ్మకు ఒక్కసారిగా ప్రవాహం పెరగడంతో జూరాల ప్రాజెక్టుకు (Jurala Project) వరద కొనసాగుతున్నది. ఎగువనుంచి 97 క్యూసెక్కుల వరస్తుండటంతో ప్రాజెక్టు 10 గేట్లను తెరిచిన అధికారులు దిగువకు 90,394 క్యూసెక్కులను శ్రీశైలం జలాశయం వైపు విడుదల చేశారు. ప్రాజెక్టు పూర్తిస్థాయి నీటి నిల్వ సామర్థం 9.657 టీఎంసీలు కాగా, ఇప్పుడు 7.740 టీఎంసీలు ఉన్నాయి. జూరాల నిటీమట్టం 318.51 మీటర్లు. ప్రస్తుతం 317.55 మీటర్ల వద్ద నీటిమట్టం ఉన్నది.
ఎగువ ప్రాంతాల నుంచి శ్రీశైలం జలాశయానికి వరద కొనసాగుతున్నది. జూరాల ప్రాజెక్టు నుంచి 90,394 క్యూసెక్కులు, సుంకేశుల జలాశయం నుంచి 8,824 క్యూసెక్కుల వరద వస్తున్నది. దీంతో ఉదయం 6 గంటల సమయానికి ప్రాజెక్టులో 818.20 అడుగల నీటిమట్టం ఉంది. నీటి నిల్వ 39.55 టీఎంసీలు ఉన్నాయి.
కాగా, వర్షాకాలం ఇంకా ప్రారంభం కాకముందే ప్రధాన నదులకు వరద పోటెత్తడం ఇదే తొలిసారి. నాలుగు రోజుల కిందట కృష్ణానదికి స్వల్పంగా వచ్చిన వరద క్రమంగా పెరుగుతూ కొన్ని గంటల్లోనే జూరాల నిండిపోయింది. శుక్రవారం వరకు ప్రవాహం పెరిగే అవకాశం ఉన్నదని, దీంతో మరిన్ని గేట్లు తెరిచే అవకాశం ఉన్నదని అధికారులు పేర్కొన్నారు. ప్రజలు అప్రమత్తంగా ఉండాలని సూచించారు.