Telangana | హైదరాబాద్, జనవరి 23 (నమస్తే తెలంగాణ) : ఏడాది పాలనలో రాష్ర్టాన్ని అద్భుతంగా పాలించామని కాంగ్రెస్ ప్రచారం చేసుకుంటున్నది. ప్రజాపాలన విజయోత్సవాల పేరుతో ఉత్సవాలు నిర్వహించింది. కానీ, వాస్తవాలు వేరుగా ఉన్నాయి. ఏడాది పాలనలో రాష్ట్ర ఖజానాకు వచ్చే ఆదాయం క్షీణించినట్టు ఆర్థిక శాఖ గణాంకాలు స్పష్టంచేస్తున్నాయి. ఈ ఆర్థిక సంవత్సరం తొమ్మిది నెలలకు సంబంధించిన ఆదాయ, వ్యయాల వివరాలను ప్రభుత్వం తాజాగా కాగ్‌కు అందించింది. 2023-24తో పోల్చితే గత తొమ్మిది నెలల్లో 10% ఆదాయం పడిపోవడం కాంగ్రెస్ ప్రభుత్వ పనితీరుకు అద్దంపడుతున్నది. కాగ్‌కు ఇచ్చిన నివేదిక ప్రకారం.. గత ఏడాది ఏప్రిల్ నుంచి డిసెంబర్ వరకు ప్రభుత్వానికి రెవెన్యూ రాబడులు రూ.1,12,307.30 కోట్లు వచ్చాయి. ఇదే సమయంలో 2023-24 ఆర్థిక సంవత్సరంలో డిసెంబర్ నాటికి రూ.1,25,002 కోట్ల ఆదాయం వచ్చింది. అంటే.. ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో ఏకంగా రూ.12,694.42 కోట్ల క్షీణత నమోదైంది. అంటే దాదాపు 10%. కరోనా కాలాన్ని మినహాయిస్తే రాష్ట్ర చరిత్రలో ఈ స్థాయిలో క్షీణత నమోదవడం ఇదే తొలిసారి.
రాష్ట్రంలో రియల్ఎస్టేట్ రంగంలో స్తబ్ధత నెలకొన్నదని గణాంకాలు స్పష్టంచేస్తున్నాయి. రాష్ట్ర ప్రభుత్వ అసంబద్ధ నిర్ణయాలు, హైడ్రా, మూసీ వెంబడి కూల్చివేతలు, అవినీతి ఆరోపణలు వంటి కారణాలతో రియల్ఎస్టేట్ రంగంలో స్తబ్ధత నెలకొన్నది. కొత్త ప్రాజెక్టుల ప్రకటన ఆగిపోగా.. పాతవి పూర్తికావడం లేదు. పూర్తయినా అమ్ముడుపోక రియల్టర్లు లబోదిబోమంటున్నారు. కాగ్‌లో పేర్కొన్న గణాంకాలు ఇదే విషయాన్ని స్పష్టంచేస్తున్నాయి. 2023-24లో మొదటి తొమ్మిది నెలల్లో స్టాంపులు, రిజిస్ట్రేషన్ల ద్వారా ప్రభుత్వానికి రూ.10,654 కోట్ల ఆదాయం సమకూరింది. కానీ, ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో రూ.10,571 కోట్లు వచ్చినట్టు ప్రభుత్వం చెప్తున్నది. ఆదాయం పెరగాల్సిందిపోయి రూ.83 కోట్ల మేర తగ్గుదల నమోదైంది. రిజిస్ట్రేషన్ల ఆదాయంలో రూ.3,046 కోట్లను స్థానికసంస్థలకు వాటాగా పంచినట్టు ప్రభుత్వం చెప్తున్నది. మొత్తంగా ఈ ఆర్థిక సంవత్సరంలో స్టాంపులు, రిజిస్ట్రేషన్ల శాఖ ఆదాయ లక్ష్యంలో తొమ్మిది నెలల్లో 41.28% సాధించినట్టు కాగ్‌కు వెల్లడించింది. ఇది గత ఏడాది (2023-24) 57.59 శాతంగా నమోదైంది. ఈ ఏడాది రెవెన్యూ రాబడుల లక్ష్యం రూ.2.21 లక్షల కోట్లు కాగా, తొమ్మిది నెలల్లో 50.76% మాత్రమే వచ్చింది. గత ఆర్థిక సంవత్సరంలో ఇది 57.72 శాతంగా ఉండేది. ఈ ఏడాది జీఎస్టీ రాబడుల లక్ష్యంలో 64% మాత్రమే చేరుకోగా, గత ఏడాది 67 శాతంగా నమోదైంది. దీనినిబట్టే రాష్ట్ర ఆర్థిక పరిస్థితి ఎటువైపు వెళ్తున్నదో అర్థం చేసుకోవచ్చని ఆర్థిక నిపుణులు ఆందోళన వ్యక్తంచేస్తున్నారు.