హైదరాబాద్/సిటీబ్యూరో అక్టోబర్ 31 (నమస్తే తెలంగాణ): చేనేతపై జీఎస్టీని పూర్తిగా ఎత్తివేయాలన్న డిమాండ్‌తో నేతన్నలు కదం తొక్కారు. సోమవారం లక్షల పోస్టుకార్డులతో హైదరాబాద్‌లో భారీ ప్రదర్శన నిర్వహించారు. నిజాం కాలేజీ నుంచి జనరల్ పోస్టాఫీస్ వరకు ర్యాలీగా వెళ్లి, ప్రధాని మోదీకి ఉత్తరాలు పోస్టు చేశారు. చేనేతపై జీఎస్టీని వెంటనే రద్దు చేయాలని, నేతన్నలకు జీవితబీమా, యార్న్ సబ్సిడీ వంటి పథకాలను పునరుద్ధరించాలని, రద్దుచేసిన హ్యాండ్లూమ్, పవర్లూమ్ బోర్డులను పునరుద్ధరించాలని నినదించారు. చేనేతపై జీఎస్టీకి వ్యతిరేకంగా ప్రధానికి పోస్టుకార్డులు రాయాలని మంత్రి కేటీఆర్ ఇచ్చిన పిలుపు మేరకు రాష్ట్రంలోని అన్ని జిల్లాల నుంచి నేతన్నలు ఉత్తరాల సంచులతో తరలివచ్చారు.
కేంద్రానికి గోరి కడతాం: ఎల్ రమణ
లక్షలాది చేనేత కార్మికుల దుఃఖాన్ని లక్షల ఉత్తరాలతో కేంద్రానికి పంపుతున్నామని, చేనేత కార్మికుల గోడు వినకుంటే.. కేంద్రానికి గోరి కట్టే రోజులు దగ్గరలోనే ఉన్నాయని ఎమ్మెలఎల్ రమణ హెచ్చరించారు. చేనేత ఉత్పత్తులపై విధించిన 5% జీఎస్టీని ఎత్తివేయకపోతే ఉద్యమాన్ని ఉధృతం చేస్తామని హెచ్చరించారు. కేంద్రం చేనేత కార్మికుల పట్ల క్రూరంగా వ్యవహరిస్తున్నదని, నేతన్నలను వృత్తికి దూరం చేస్తున్నదని ఆరోపించారు. ఒకప్పుడు గాంధీ మహాత్ముడు స్వాతంత్య్రం కోసం ఆయుధంగా వాడిన చేనేత ఉత్పత్తులపైన చరిత్రలో లేనివిధంగా జీఎస్టీ విధించడం దారుణమన్నారు. చేనేతపై 12శాతం జీఎస్టీ విధించేందుకు కుట్ర పన్నిన కేంద్రం దేశవ్యాప్త నిరసనలతో 5 శాతానికి పరిమితమైందని చెప్పారు. జీఎస్టీని రద్దు చేసే వరకు పోరాటం ఆగదని స్పష్టంచేశారు.
దుఃఖంలో చేతివృత్తులు: రాపోలు
లక్షలాది పోస్టుకార్డులను పంపించడం ద్వారా చేనేత కార్మికులు తమ బాధను తెలియజేశారని, ఇప్పటికైనా ప్రధాని స్పందించి జీఎస్టీని పూర్తిగా రద్దు చేయాలని మాజీ ఎంపీ రాపోలు ఆనందభాస్కర్ డిమాండ్ చేశారు. సమాజంలోని చేతివృత్తులు దుఃఖంలో ఉంటే విప్లవం రాజుకుంటుందని హెచ్చరించారు. నాగలి, నాడ, సూది, సుత్తె ఆపదలో ఉంటే దేశానికి మంచికాదని హితవు చెప్పారు.
చేనేత బీమా తెలంగాణ ఘనత: చింతా
రైతుబీమా తరహాలో చేనేతబీమా కల్పించిన ఘనత తెలంగాణ ప్రభుత్వానిదేని రాష్ట్ర చేనేత కార్పొరేషన్ చైర్మన్ చింతా ప్రభాకర్ పేర్కొన్నారు. జీఎస్టీని రద్దు చేసి చేనేత కళాసంపదను కాపాడాలని కేంద్రాన్ని డిమాండ్ చేశారు. కార్యక్రమంలో వరంగల్ మేయర్ గుండు సుధారాణి, తెలంగాణ వవర్లూమ్, టెక్స్టైల్ డెవలప్మెంట్ కార్పొరేషన్ చైర్మన్ గూడూరి ప్రవీణ్, టీఆర్ఎస్ నాయకులు కర్నాటి విద్యాసాగర్‌తోపాటు చేనేత సంక్షేమ సంఘాలు, చేనేత కార్మిక సంఘాలు, పద్మశాలి సంఘాల ప్రతినిధులు పాల్గొన్నారు.
ప్రధానికి పోస్టుకార్డు పంపిన మంత్రి తలసాని
చేనేతపై జీఎస్టీకి వ్యతిరేకంగా సాగుతున్న పోస్టుకార్డు ఉద్యమంలో మంత్రి తలసాని శ్రీనివాస్‌యాదవ్ భాగస్వాములయ్యారు. సోమవారం తన కార్యాలయంలో చేనేత రంగానికి చెందిన పలువురు ప్రముఖులు మంత్రితో భేటీ అయ్యారు. ఈ సందర్భంగా జీఎస్టీ రద్దు కోరుతూ మంత్రి ప్రధానికి పోస్టుకార్డు రాసి పంపారు. చేనేత కార్మికులు గ్రామీణ ప్రాంతాలకు చెందిన నిరుపేదలని, జీఎస్టీ విధించడం సబబుకాదని పేర్కొన్నారు. కళాకారుల నైపుణ్యం, సృజనాత్మకతపై ఆధారపడి మనుగడ సాగిస్తున్న ఈ రంగంపై జీఎస్టీ వేయడం వల్ల తీరని అన్యాయం జరుగుతుందన్నారు. రాష్ట్ర బీసీ కమిషన్ సభ్యుడు కిశోర్‌గౌడ్ సైతం చేనేత ఉత్పత్తిదారులు, యువకులతో కలిసి అంబర్‌పేట పోస్టాఫీసు వద్ద ప్రధానికి పోస్టుకార్డు రాసి పంపారు.