Rajiv Yuva Vikasam | హైదరాబాద్, మే 4 (నమస్తే తెలంగాణ): రాజీవ్ యువ వికాసం పథకం కింద ప్రభుత్వం మంజూరు చేసిన యూనిట్ల కంటే దాదాపు మూడు, నాలుగు రెట్లు అధికంగా దరఖాస్తులు వచ్చాయి. ఈ పథకం కింద లబ్ధిదారులకు రూ.6 వేల కోట్లను సబ్సిడీ రుణాలుగా అందజేస్తామని ప్రకటించిన ప్రభుత్వం.. పరిమిత స్థాయిలోనే యూనిట్లను మంజూరుచేసింది. నియోజకవర్గానికి 3,500 చొప్పున రాష్ట్రవ్యాప్తంగా 4,16,500 మందికి రుణాలను మంజూరు చేయాలని నిర్ణయించింది. ఏప్రిల్ 14తో దరఖాస్తులకు తుది గడువు ముగియగా, రాష్ట్రవ్యాప్తంగా 16 లక్షలకుపైగా దరఖాస్తులు వచ్చాయి. ఎస్సీ సంక్షేమ శాఖకు 1.44 లక్షల యూనిట్లను కేటాయించగా, 3.92 లక్షలకుపైగా దరఖాస్తులు వచ్చాయి. బీసీ సంక్షేమ శాఖకు తొమ్మిది లక్షలకుపైగా దరఖాస్తులు వచ్చినట్టు అధికారవర్గాలు వెల్లడించాయి. ఎస్టీ, మైనార్టీ శాఖలకు కూడా కేటాయించిన యూనిట్ల కంటే మూడింతలు, నాలుగింతల దరఖాస్తులు వచ్చినట్టు అధికారవర్గాలు వివరిస్తున్నాయి.
రూ.4 లక్షల యూనిట్‌పైనే ఆసక్తి
ప్రభుత్వం మొత్తం ఐదు క్యాటగిరీలుగా విభజించి యూనిట్లను మంజూరు చేసింది. ఇందులో ఒక్కొక్క యూనిట్‌కు రూ.50 వేలు, రూ.లక్ష, రూ.2 లక్షలు, రూ.3 లక్షలు, రూ.4 లక్షల చొప్పున మొత్తం ఐదు క్యాటగిరీలుగా సబ్సిడీ రుణాలు అందజేయనున్నది. రూ.యాభై వేల క్యాటగిరీలో లబ్ధిదారులకు పూర్తి సబ్సిడీ లభించనున్నది. వచ్చిన దరఖాస్తులు దాదాపు 75% రూ.నాలుగు లక్షల క్యాటగిరీలో రాగా, ఇతర యూనిట్లకు తక్కువ సంఖ్యలో వచ్చినట్టు అధికారులు చెప్తున్నారు. ఉదాహరణకు మేడ్చల్ మల్కాజిగిరి జిల్లాలో 38 వేల దరఖాస్తులు రాగా, అందులో దాదాపు 35 వేల దరఖాస్తులు రూ.4 లక్షల క్యాటగిరీలో ఉండటం గమనార్హం. మిగతా నాలుగు యూనిట్లకు కలిపి మూడు వేలకు మించి దరఖాస్తులు రాలేదని తెలుస్తున్నది. అన్ని జిల్లాలోనూ ఇదే పరిస్థితి నెలకొన్నదని అధికారులు చెప్తున్నారు.
అధికారుల మల్లగుల్లాలు
ప్రభుత్వం నిర్దేశించిన యూనిట్లు తక్కువగా ఉండటం, దరఖాస్తులు అంతకు మూడు, నాలుగింతలు ఉండటంతో లబ్ధిదారుల ఎంపిక కోసం అధికారులు మల్లగుల్లాలు పడుతున్నారు. లబ్ధిదారుల ఎంపిక కోసం ప్రభుత్వం అనేక ప్రాధాన్యాలు నిర్ణయించింది. మొత్తం యూనిట్లలో మహిళలకు 25%, దివ్యాంగులకు 5% కేటాయించాలని, ఆపై మండలం, జిల్లా యూనిట్‌గా ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనారిటీ, ఈబీసీ, ఈడబ్ల్యూఎస్ వర్గాలకు దామాషా ప్రకారం యూనిట్లను కేటాయించాలని నిర్దేశించింది. అవి పోను ఒంటరి, వితంతు మహిళలకు, తెలంగాణ ఉద్యమకారులు, ఎస్సీ వర్గీకరణ అమరవీరుల కుటుంబాలు, ఇప్పటికే స్వయం ఉపాధి పొందుతున్నవారికి, తొలిసారిగా సబ్సిడీ రుణం కోసం దరఖాస్తు చేసుకున్నవారికి ప్రాధాన్యం ఇవ్వాలని స్పష్టంచేసింది.