Harish Rao | ఒకవైపు కాళేశ్వరం నీళ్లతో మూసీ పునరుజ్జీవం చేస్తామని చెబుతున్నారని.. మళ్లీ ఇవే నీళ్లను హైదరాబాద్ తాగునీటి వసతి కోసం ఉపయోగిస్తామని ప్రకటిస్తున్నారని హరీశ్‌రావు తెలిపారు. ఇందులో ఏది నిజం అని ప్రశ్నించారు. మీరు చెబుతున్న కాళేశ్వరం ప్రాజెక్ట్ కూలిపోవడం నిజమా? దాని ద్వారా అందిన ప్రతిఫలం నిజమా? అని నిలదీశారు. హుజూరాబాద్ నియోజకవర్గంలో ఆదివారం హరీశ్‌రావు మీడియాతో మాట్లాడుతూ.. గత ప్రభుత్వాల ఘనతను మెచ్చుకొని మెడలో వేసుకోకపోయినా పర్వాలేదు, కానీ అసలు ఏ ఘనత లేదని చెప్పుకోవడమే దుర్మార్గమని మండిపడ్డారు. సగం తెలంగాణకు మంచి నీరులో ఇచ్చేది కాళేశ్వరం ప్రాజెక్టు అని స్పష్టం చేశారు. రేవంత్ అబద్ధాలను ప్రజలు నమ్మే పరిస్థితి లేదని తెలిపారు.
కాళేశ్వరం ప్రాజెక్టు కూలిపోయిందని చెబుతున్న రేవంత్ రెడ్డి.. కొండ పోచమ్మ, మల్లన్న సాగర్ల నుంచి హైదరాబాద్ నగరానికి 20 టీఎంసీల నీటిని మిషన్ భగీరథ ద్వారా ఇవ్వాలని ఎలా ప్రణాళికలు చేస్తున్నారని ప్రశ్నించారు. దీన్నిబట్టే ప్రాజెక్టులు విఫలమయ్యాయన్న కాంగ్రెస్ నేతల మాటలు అబద్ధమని తేలిపోయాయని అన్నారు. అసలు కాళేశ్వరం ప్రాజెక్టు లేదని, అది కుప్పకూలిందని, లక్ష కోట్ల అవినీతి అని అబద్ధపు ప్రచారం చేసి మీరు సాధించింది ఏంటంటే.. కుప్పకూలిన కాళేశ్వరం ప్రాజెక్టు నీళ్లను మీ మంత్రిగారు మల్లన్న సాగర్ నుంచి, రంగనాయక సాగర్ నుంచి పంట పొలాలకు విడుదల చేశారని తెలిపారు.
కూలిపోయిన కాళేశ్వరం నుండి హైదరాబాద్ కు నీళ్లు ఎట్లా ఇస్తావ్ సిగ్గులేని రేవంతూ?
– మాజీ మంత్రి, ఎమ్మెల్యే @BRSHarish 🔥 pic.twitter.com/KCg4fmYDuh
— BRS Party (@BRSparty) November 24, 2024
తెలంగాణలో 1.61 కోట్ల మెట్రిక్ టన్నుల పంట పడితే అది తమ గొప్పతనం అని కాంగ్రెస్ నాయకులు అంటున్నారని హరీశ్‌రావు మండిపడ్డారు. 2014లో తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన నాడు 30 లక్షల మెట్రిక్ టన్నుల ధాన్యం పండిస్తే, మేము 141 లక్షల మెట్రిక్ టన్నులకు పెంచామని.. రాష్ట్రాన్ని ధాన్యాగారం చేశామని తెలిపారు. 50 ఏళ్లు కాంగ్రెస్ పార్టీ, 16 ఏళ్లు తెలుగుదేశం పార్టీ పాలనలో ఎందుకని కేవలం 30 లక్షల మెట్రిక్ టన్నుల ధాన్యమే తెలంగాణలో పండిందని ప్రశ్నించారు. ఏ కష్టం చేయకుండా విత్తనం వేయకుండానే అది వృక్షమై ఫలాలను అందించిందా అని నిలదీశారు. తెలంగాణ రికార్డు స్థాయిలో కోటి 60 లక్షల ధాన్యం పండిందని, ఇది కాళేశ్వరం గొప్పతనం కాదని, కాంగ్రెస్ పార్టీ గొప్పతనం అని చెప్పుకోవడం సిగ్గుచేటు అని విమర్శించారు. ఇది ముమ్మాటికీ కేసీఆర్ గొప్పతనం అని స్పష్టం చేశారు.
రైతుల సంక్షేమం కోసం కేసీఆర్ గారు అనేక కార్యక్రమాలు చేపట్టారని హరీశ్‌రావు తెలిపారు. రైతుబంధు, రైతు రుణమాఫీ, వ్యవసాయ పనిముట్లు అందించడం, 24 గంటల నాణ్యమైన విద్యుత్తు ఇవ్వడం, చెరువులను రిజర్వాయర్లతో అనుసంధానం చేయడం, మిషన్ కాకతీయ ద్వారా చెరువుల పూడిక తీయడం వంటి ఎన్నో కార్యక్రమాలను చేపట్టారని అన్నారు. ఇలా అనేక కార్యక్రమాలు చేయడం ద్వారా వ్యవసాయాన్ని పండుగగా మార్చారని పేర్కొన్నారు. అందుకనే ఈ రోజు తెలంగాణ దేశానికి అన్నం పెట్టే అన్నపూర్ణగా ఎదిగిందని చెప్పారు. ఇది ఎవరు ఒప్పుకున్నా, ఒప్పుకోకపోయినా, దేశం గుర్తించిన నిజమని స్పష్టం చేశారు. భూమికి బరువయ్యే పంటను పండించామని.. మద్దతు ధర ఇచ్చి పండిన ప్రతి గింజలు కొనుగోలు చేశామని స్పష్టం చేశారు..
ప్రాజెక్టుల కింద తూములు పెట్టని చరిత్ర కాంగ్రెస్‌ది అని హరీశ్‌రావు విమర్శించారు. కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చి చేసింది ఏమున్నదని ప్రశ్నించారు. రైతు బంధు ఎగ్గొట్టారని.. రుణమాఫీ ఎగొట్టారని అన్నారు. వరంగల్ డిక్లరేషన్ ఎందుకు అమలు చేయలేదని నిలదీశారు. మహబూబ్ నగర్లో రైతు వారోత్సవాలు జరపడంపైనా ఆగ్రహం వ్యక్తం చేశారు. మార్కెట్ లో వడ్లు కొనే పరిస్థితి లేదని అన్నారు. రూ.7500 మద్దతు ధర ఉంటే పత్తి రైతులకు రూ.6500 మాత్రమే లభించిందని అన్నారు. రూ.1600, 1700కే వరి ధాన్యం అమ్ముకుంటున్నారని పేర్కొన్నారు.