హైదరాబాద్, ఫిబ్రవరి 24 (నమస్తే తెలంగాణ) : పదో తరగతిలో గ్రేడింగ్ విధానం ఎత్తివేత నేపథ్యంలో విద్యార్థులకు అందించే మెమోలను ఎలా ముద్రించాలన్న దానిపై విద్యాశాఖ తేల్చుకోలేకపోతున్నది. ఏ పద్ధతిలో ముద్రించాలన్న అంశంపై తర్జనభర్జన పడుతున్నది. సూచనలు, సలహాలు స్వీకరించేందుకు హెచ్ఎంలు, నిపుణులతో సోమవారం సంప్రదింపులు జరిపింది. పదో తరగతిలో ఈ విద్యాసంవత్సరం నుంచి గ్రేడింగ్ విధానాన్ని ఎత్తివేసింది. గతంలో మార్కుల విధానం అమలైనప్పుడు విద్యార్థులు సాధించిన మార్కులను బట్టి ఫస్ట్‌క్లాస్, సెకండ్ క్లాస్, థర్డ్ క్లాస్, పాస్ అని మెమోలపై ముద్రించేవారు.
తాజాగా మార్కులతో మెమోలను ముద్రించాల్సి ఉండటంతో పాత విధానాన్ని కొనసాగించడమా లేక కేవలం ఎన్ని మార్కులు వస్తే అన్ని మార్కులేయడమా? అన్న దిశగా చర్చలు సాగించారు. గతంలో ఎస్సెస్సీలో ఫెయిలైన వారికి రెండు లేదా మూడేండ్లపాటు అవకాశం కల్పించి, ఆ తర్వాత కొత్త విధానంలోకి మార్చాలని కొందరు అధికారులు సూచించారు. పలు అంశాలపై స్పష్టతరాగా వాటిపై ప్రతిపాదనలు రూపొందించి ప్రభుత్వ ఆమోదం కోసం పంపించనున్నట్టు తెలిసింది.