14.50 లక్షల కోట్ల అప్పుల్ని బ్యాంకులు రైటాఫ్ చేసినప్పుడు లేని సెల్ఫ్ డిక్లరేషన్ రైతులకు మాత్రం ఎందుకు? బ్యాంకులను ముంచేటోళ్లకే సెల్ఫ్ డిక్లరేషన్ లేదుకానీ, అందరికీ అన్నం పెట్టే రైతులు సెల్ఫ్ డిక్లరేషన్ ఇవ్వాల్నా?
KTR | హైదరాబాద్, జనవరి 1 (నమస్తే తెలంగాణ): రీజినల్ రింగు రోడ్డు (ఆర్ఆర్ఆర్) ప్రాజెక్టులో భారీ కుంభకోణం జరగబోతున్నదని, రూ.12 వేల కోట్లు దోచుకొనేందుకు మంత్రి కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డి స్కెచ్ వేశారని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ చెప్పారు. ‘మళ్లీ అధికారంలోకి వస్తమో రామో.. దీపం ఉన్నప్పుడే ఇల్లు చక్కబెట్టుకోవాలె అన్నట్టు కాంగ్రెస్ నేతలు అందినకాడికి దండుకోవాలనుకుంటున్నరు’ అని కేటీఆర్ విమర్శించారు. ఖాజాగూడ చెరువు పరిధిలోని నాలుగు ఎకరాల భూమిపై కాంగ్రెస్ నేతల కన్ను పడిందని, అందుకే హడావుడిగా హైడ్రాతో పేదల ఇండ్లపై దాడులు చేయించారని ఆగ్రహం వ్యక్తంచేశారు. ఏడాది పాలనలోనే రూ.1.38 లక్షల కోట్లు అప్పు చేసిన కాంగ్రెస్ సర్కారు.. ఢిల్లీకి కప్పం కింద ఎంత చెల్లించిందని నిలదీశారు. కాంగ్రెస్ నేతలు బడా కాంట్రాక్టర్ల నుంచి పెద్ద మొత్తంలో వసూలు చేసి ఢిల్లీకి డబ్బులు పంపిస్తున్నారని విమర్శించారు. తెలంగాణభవన్‌లో బుధవారం ఆయన మీడియాతో నిర్వహించిన చిట్‌చాట్‌లో మాట్లాడుతూ తనను తప్పుడు కేసులో ఇరికించాలని సీఎం రేవంత్‌రెడ్డి ఇప్పటికే ఆరుసార్లు ప్రయత్నించారని, ఇప్పుడు ఈ కార్ రేస్ అని మరో ప్రయత్నం చేశారని చెప్పారు. ఫార్ములా ఈ-కార్ రేస్‌లో పైసా అవినీతి జరగలేదని.. ఇదో లొట్టపీసు కేసు అని వ్యాఖ్యానించారు.
ఖాజాగూడలో కూడా పేదల ఆస్తులపై కాంగ్రెస్ నాయకులు కన్నేశారు. పెద్దలకు ఇచ్చేందుకు అకడ నాలుగు ఎకరాల భూములను గుంజుకొని పేదలను తరిమేశారు. ఇండ్లను బలవంతంగా కూలగొట్టారు. ఇదేనా ఇందిరమ్మ రాజ్యమంటే? హైకోర్టు, సుప్రీంకోర్టు ఎన్నిసార్లు మొట్టికాయలు వేసినా రేవంత్‌రెడ్డి సర్కారుకు బుద్ధి రావడం లేదు.
సీఎం రేవంత్‌రెడ్డి ఈ రేసును రద్దు చేయడం వల్ల రాష్ర్టానికి రూ.600 కోట్ల నష్టం జరిగిందని కేటీఆర్ విమర్శించారు. ‘ఏసీబీ కేసులో అస్సలు పస లేదు. ఫార్ములా ఈ కేసు లొట్టపీసు కేసు. పైసా అవినీతి లేదు. అవినీతే లేనప్పుడు.. కేసు ఎకడిది? ఏసీబీ ఎఫ్ఐఆర్ తప్పు. ఈ కేసు నిలవదు కాబట్టి ఈడీ కేసు కూడా ఉండదు. జడ్జి అడిగే ప్రశ్నలకు ఏజీ దగ్గర సమాధానం లేదు. రేసు కావాలని నేను నిర్ణయం తీసుకున్న.. వద్దనేది రేవంత్ నిర్ణయం. ఇద్దరి నిర్ణయాలపై క్యాబినెట్లో చర్చ జరగలేదు. నాపై కేసు పెడితే.. రేవంత్‌పై కూడా కేసు పెట్టాలి. రేవంత్‌రెడ్డి.. ఒక ముఖ్యమంత్రి అని పెట్టడం లేదా? నాకు న్యాయస్థానాల మీద నమ్మకం ఉన్నది. ఫార్ములా ఈ కేసులో హైకోర్టులో ఏం తీర్పు వస్తుందో చూ ద్దాం. 7న ఈడీ విచారణకు హాజరుపై మా లాయర్లు నిర్ణయిస్తారు’ అని కేటీఆర్ పేర్కొన్నారు. ఏసీబీ ఎఫ్ఐఆర్ తప్పులతడకగా ఉన్నదని, సంబంధంలేని అన్ని అంశాలను అందు లో ప్రభుత్వ ఆదేశాల మేరకు ఇరికించారని విమర్శించారు. కెమెరాల ముందు డబ్బుతో అడ్డంగా దొరికిన రేవంత్‌రెడ్డి తనపై తప్పుడు కేసులు పెడుతున్నారని నిప్పులుచెరిగారు. ‘నేను ఏ తప్పూ చేయలేదు కాబట్టే ధైర్యంగా మాట్లాడుతున్న.. వాస్తవాలు ప్రజలు చూస్తున్నరు’ అని స్పష్టంచేశారు.
రైతు భరోసాలో కోత పెట్టేందుకు రేవంత్ ప్రభుత్వం కుట్రపూరితంగా వ్యవహరిస్తున్నదని కేటీఆర్ మండిపడ్డారు. గతంలో ఎకడా లేని విధంగా పంట పొలాల సాగు అంశంలో సెల్ఫ్ డిక్లరేషన్ అంశాన్ని రైతులపై రుద్దేందుకు ప్రయత్నిస్తున్నదని విమర్శించారు. 14.50 లక్షల కోట్ల అప్పును బ్యాంకులు రైటాఫ్ చేసినప్పుడు లేని సెల్ఫ్ డిక్లరేషన్ రైతుల విషయానికి వచ్చేసరికి ఎందుకని నిలదీశారు. బ్యాంకులను ముంచేటోళ్లకే సెల్ఫ్ డిక్లరేషన్ లేదుకాని, అందరికీ అన్నం పెట్టే రైతులకు సెల్ఫ్ డిక్లరేషన్ ఎందుకు? అని ప్రశ్నించారు. రైతు భరోసాను ప్రభుత్వం నామమాత్రంగా అమలుచేయాలని చూస్తున్నదని, ఉద్యోగులు, పాన్‌కార్డ్ ఉన్నవాళ్లకు ఎగ్గొట్టే ప్రయత్నం చేస్తున్నదని మండిపడ్డారు. రైతు భరోసాతో రేవంత్ సరార్‌పై ప్ర జల్లో తిరుగుబాటు రాబోతున్నదని చెప్పారు.
దీపం ఉన్నప్పుడే ఇల్లు చకబెట్టుకొనే పనిలో కాంగ్రెస్ మంత్రులు, ముఖ్యమంత్రి, ఎమ్మెల్యేలున్నరు. ఒక్కో మంత్రి ఒకో అవినీతి దుకాణం తెరిచిండ్రు. ఉప ముఖ్యమంత్రి నుంచి మొదలుకొని కోమటిరెడ్డి దాకా ప్రతి ఒకరూ డబ్బులు సంపాదించే పనిలో పడ్డరు. మంత్రులు ఎంతదోచుకుంటున్నరో అధికారులను అడిగితే తెలుస్తుంది.
కాంగ్రెస్ సర్కార్‌కు పేదలు కనిపించడం లేదని, కేవలం పెద్దల కోసమే పనిచేస్తున్నదని కేటీఆర్ విమర్శించారు. సుప్రీంకోర్టు నుంచి తిట్లు పడ్డ ఏకైక ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి అని ఎద్దేవాచేశారు. చివరికి కోర్టుకు క్షమాపణ చెప్పారని గుర్తుచేశారు. ఖాజాగూడలో పేదల ఆస్తులపై కాంగ్రెస్ నాయకులు కన్నేశారని నాలుగు ఎకరాల భూములు గుంజుకొని పేదలను అక్కడి నుంచి వెళ్లగొట్టారని మండిపడ్డారు. బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు పార్టీ మారడం, ఎమ్మెల్యేల అనర్హత పిటిషన్‌పై సుప్రీంకోర్టుకు వెళ్తామని చెప్పారు. తమకు అనుకూలంగా తీర్పు వచ్చి, ఈ సంవత్సరం ఉప ఎన్నికలు రావచ్చని, వస్తాయనే నమ్మకం తనకు ఉన్నదని తెలిపారు.
కాంగ్రెస్ ఏడాది పాలనకు ప్రజల నుంచి, తమ పార్టీ నుంచి ఇచ్చేది మైనస్ మారులేనని కేటీఆర్ దెప్పిపొడిచారు. ‘తెలంగాణ ప్రజలు ఒకరు కూడా ఈ ప్రభుత్వం బాగున్నదని చెప్తున్నరా? ఒకరైనా ఈ సీఎం గురించి మం చిగ మాట్లాడుతున్నరా? సమాజంలో ఎవరిని తట్టినా కాంగ్రెస్ ప్రభుత్వాన్ని ఘోరంగా తిడుతున్నారు’ అని ఎద్దేవాచేశారు. ‘ఎన్నికల సమయంలో అప్పు చేయకపోవడమే మేము చేయబోయే అభివృద్ధి అన్న రేవంత్, ఇప్పుడు ఏడాదిలోనే రూ.1.38 లక్షల కోట్ల అప్పు ఎందుకు చేశారో చెప్పాలి. ఢిల్లీ కాంగ్రెస్‌కు ఎంత డబ్బు పోతున్నదో వెల్లడించాలి. ఆర్ఆర్ ట్యాక్స్ రూపంలో ఢిల్లీ పెద్దలకు ముడుపులు ఎంతెంత వెళ్తున్నాయో చెప్పాలి’ అని నిలదీశారు.
గ్రాడ్యుయేట్స్ ఎమ్మెల్సీ ఎన్నికల అభ్యర్థిపై నిర్ణయం తీసుకోలేదని, పట్టభద్రుల ఎన్నికల్లో పార్టీ తరఫున అభ్యర్థులను పెట్టి ఉద్యమ సమయంలో తామే కొత్త సంప్రదాయం తెచ్చామని కేటీఆర్ చెప్పారు. ‘ప్రతిపక్ష పార్టీ పాత్రను మేము చాలా స్పష్టంగా నిర్వహిస్తున్నం. మేము ప్రభుత్వ అన్యాయాలను, అక్రమాలను ఎదిరిస్తున్నం. ఆరు గ్యారెంటీలు, 420 హామీలు నెరవేర్చేవరకు ఈ ప్రభుత్వాన్ని నిలదీస్తూనే ఉంటం’ అని తేల్చిచెప్పారు. ఈ ఏడాది మొదటి హాఫ్‌లో బీఆర్ఎస్ బహిరంగ సభ నిర్వహిస్తామని, ఎప్పుడు, ఎక్కడ జరుపాలనేది పార్టీ నిర్ణయిస్తుందని కేటీఆర్ తెలిపారు. బీఆర్ఎస్ సభ్యత్వ నమోదు కార్యక్రమం సైతం ఉంటుందని పేర్కొన్నారు. తర్వాత గ్రామస్థాయి నుంచి రాష్ట్రస్థాయి కమిటీలు పూర్తి చేస్తామని వెల్లడించారు. పార్టీ అధ్యక్షుడి ఎన్నికకు అక్టోబర్ దాకా సమయమున్నదని తెలిపారు. 60 లక్షల భారత రాష్ట్ర సమితి కార్యకర్తల అభీష్టం మేరకు మరోసారి పార్టీ అధినేత కేసీఆర్‌ను అధ్యక్షుడిగా ఎన్నుకుంటామని, అనంతరం పార్టీ నాయకులు, కార్యకర్తలకు శిక్షణ కార్యక్రమాలు ఏర్పాటు చేస్తామని వెల్లడించారు.
నన్ను ఏదో రకంగా జైలుకు పంపాలని కాంగ్రెస్ ప్రభుత్వం చూస్తున్నది. రేవంత్‌రెడ్డి తప్పుడు కేసులు పెట్టిస్తున్నరు. ఫామ్‌హౌస్ అన్నరు! డ్రగ్స్ కేసు అన్నరు! ఫోన్ ట్యాపింగ్ అన్నరు! లగచర్ల అన్నరు! ఇంకేదో అన్నరు.. ఇప్పుడు ఈ-కార్ రేసు అంటున్నరు! నాపై ఇది ఆరో ప్రయత్నం. రేవంత్‌కు ఏమీ దొరకటం లేదు. అందుకే నాపై కేసులు పెడుతున్నరు. రేవంత్‌రెడ్డికే కాదు.. ఆయన తాతముత్తాతలకు కూడా భయపడేదిలేదు.
-కేటీఆర్
స్థానిక సంస్థల ఎన్నికల్లో బీఆర్ఎస్ సత్తా చాటుతుందని కేటీఆర్ ఆశాభావం వ్యక్తంచేశారు. స్థానిక ఎన్నికల్లో బీసీలకు 42 శాతం రిజర్వేషన్లు ఇవ్వాలన్న ఆలోచన రేవంత్‌రెడ్డి సర్కారుకు లేదని చెప్పా రు. అందుకే ప్రణాళికబద్ధంగా కుట్రకు తెర లేపిందని విమర్శించారు. కుట్రలో భాగంగానే శాసనసభలో చేసిన స్థానిక సంస్థల చట్ట సవరణలో బీసీలకు మరింత రిజర్వేషన్లు కల్పించేందుకు సుప్రీంకోర్టు కేసు ప్రస్తావన, ఆర్ఆర్ఆర్ టెస్ట్, ప్రత్యేక బీసీ కమిషన్ సిఫార్సుల నివేదిక వంటి కారణాలను ప్రస్తావించిందని వెల్లడించారు. ఇవన్నీ అడ్డుపెట్టుకొని ఎవరిరో ఒకరితో కేసు వేయించి స్థానిక సంస్థల ఎన్నికలు పూర్తి చేసేందుకు ప్రభుత్వం ప్రయత్నిస్తున్నదని విమర్శించారు.