హైదరాబాద్ సిటీబ్యూరో, అక్టోబర్ 8 (నమస్తే తెలంగాణ): హెచ్ఎండీఏ పరిధిలో ఎన్ని చెరువులున్నాయి.. వాటి ఎఫ్టీఎల్, బఫర్‌జోన్ వివరాలను తేల్చాలి.. క్షేత్రస్థాయిలో సమగ్రంగా సర్వే చేసి రిపోర్టులను మూడు నెలల్లోగా అందించాలని ప్రభుత్వం ఆదేశాలు జారీచేసింది. ఈ నేపథ్యంలో హైడ్రా కమిషనర్ రంగనాథ్ ఆధ్వర్యంలో జరిగిన లేక్ ప్రొటెక్షన్ కమిటీ సమావేశంలో రీసర్వే, కూల్చివేతలకు సంబంధించి కీలక చర్చ జరిగింది. ఈ సందర్భంగా రంగనాథ్ మాట్లాడుతూ.. ‘హెచ్ఎండీఏ పరిధిలో అసలు ఎన్ని చెరువులు, కుంటలున్నాయి.. వాటి వివరాలేంటి? ఎఫ్టీఎల్ , బఫర్‌జోన్ నిర్ధారించడానికి ఎలా సర్వే చేస్తారు? శాటిలైట్ మ్యాపులతో పాటు డిజిటల్ సర్వే చేసి తొందరగా పూర్తిచేస్తే హైడ్రా పని మొదలుపెట్టొచ్చు. గతంలో ఉన్నవాటితో పాటు ప్రస్తుతం ఉన్న పరిస్థితిని నిర్ధారించడానికి ఎంత సమయం పడుతుంది? రీసర్వే చేస్తే టెక్నికల్‌గా బలంగా ఉంటుంది కదా!’ అని అన్నారు. దీంతో అధికారులు.. రీసర్వే చేయటం సాధ్యం కాదని తేల్చేశారు. శాఖల పరంగా సర్వేయర్ల కొరత, సొంత శాఖల్లో పని ఒత్తిడితో పాటు గ్రేటర్ చుట్టుపక్కల సర్వే చేయాలంటే చాలా కష్టమని చెప్పారు. గత ఇరవై ఏండ్లలో సాధ్యం కాని సర్వేలు ఇప్పుడెలా సాధ్యమని స్పష్టంచేశారు.
చెరువులకు సంబంధించి పాత రిపోర్టులు ఆధారంగా చేసుకుని ముందుకెళ్తే బాగుంటుందని కమిషనర్ అభిప్రాయపడ్డారని తెలిసింది. దీనికి ఇరిగేషన్, రెవెన్యూ శాఖల అధికారులు.. ఈ మధ్యకాలంలో కొన్ని చోట్ల కూల్చివేతలకు వెళ్లినప్పుడు ఎదురైన పలు సందర్భాలను చర్చకు తీసుకొచ్చారు. సర్వే సమయంలో వచ్చే సమస్యలపైనా చర్చ జరిగింది. ఇవన్నీ ఒక ఎత్తయితే సిబ్బంది కొరతతో పాత రిపోర్టులే ఆధారంగా సైట్లో పెడదామా! అన్న అంశం కూడా తెరపైకి వచ్చింది. పలు రెగ్యులరైజ్ భూముల విషయాన్నీ రెవెన్యూ అధికారులు ప్రస్తావించారు.