హైదరాబాద్ : పెట్రోల్(Petrol ), డీజిల్( Diesel ) ధరల పెంపుతో సామాన్యులపై నేరుగా ప్రభావం పడుతుందని సీపీఐ(ఎం) పొలిట్‌బ్యూరో సభ్యులు బీవీ.రాఘవులు (BV Raghavulu ) అన్నారు. పెట్రోల్, డీజిల్ ధరల పెంపుపై నిరసన కార్యక్రమంలో శనివారం హైదరాబాద్‌లోని సుందరయ్య విజ్ఞాన కేంద్రం వద్ద సీపీఐ(ఎం) ( CPM) ఆధ్వర్యంలో నిరసన తెలిపారు. మోదీ ప్రభుత్వ ప్రజావ్యతిరేక విధానాలు నశించాలి. పెంచిన పెట్రోల్, డీజిల్ ధరలను తగ్గించాలి అంటూ నినాదాలు చేశారు.
ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. ఇరాన్‌పై అమెరికా, ఇజ్రాయిల్ చేస్తున్న యుద్ధాన్ని ఆపేలా కృషిచేయాలని డిమాండ్ చేశారు. మోదీ చెబుతున్న పొదుపు మంత్రంతో దేశాభివృద్ధి ఎలా సాధ్యమని ప్రశ్నించారు. గ్యాస్ ధరల పెంపుతో ఇప్పటికే అనేక పరిశ్రమలు మూతపడి కార్మికులు ఉపాధి కోల్పోయి రోడ్డున పడుతున్నారని ఆందోళన వ్యక్తం చేశారు.దేశం నేడు తీవ్రమైన దుర్భర పరిస్థిలో ఉందని చెప్పారు.
నేరం చేసేవాడు ఒకడైతే ప్రజలకు శిక్ష వేసే పరిస్థితి నేడు నెలకొందని ఆరోపించారు. అమెరికా, ఇజ్రాయిల్ యుద్ధం ఆగితే ఈ ధరలు పెంచాల్సిన అవసరం ఉండదన్నారు. అయితే, ప్రధాన మంత్రి మోడీ యుద్ధ నివారణ చర్యలు తీసుకోకుండా, అమెరికాకు దాసోహం అయిపోయి ట్రంప్‌నకు సాష్టాంగ నమస్కారం చేస్తూ ప్రజలు ధరలను భరించాలని చెప్పడం విడ్డూరంగా ఉందన్నారు.
ఈ కార్యక్రమంలో సీపీఐ(ఎం) రాష్ట్ర కార్యదర్శి జాన్‌వెస్లీ, కేంద్ర కమిటీ సభ్యులు జ్యోతి, రాష్ట్ర కార్యదర్శి వర్గ సభ్యులు జి నాగయ్య, పాలడుగు భాస్కర్, మల్లు లక్ష్మి, బండారు రవికుమార్, సీనియర్ నేత డీజీ.నర్సింహారావు, రాష్ట్ర కమిటీ సభ్యులు పాల్గొన్నారు.