తానూర్/మఠంపల్లి, ఆగస్టు 6 : పొలం పనులు చేస్తుండగా ప్రమాదవశాత్తు విద్యుత్తు తీగలు తగలడంతో షాక్కొట్టి ఇద్దరు రైతులు మృతి చెందారు. ఈ ఘటనలు నిర్మల్, సూర్యాపేట జిల్లాల్లో చోటుచేసుకున్నా యి. నిర్మల్ జిల్లా తానూర్ మండలం మహాలింగి గ్రామానికి చెందిన రైతు మేఘాజీ నారాయణ (49) తనకున్న ఎకరం వ్యవసాయ భూమిలో పత్తి వేశాడు. గురువారం సాయంత్రం నీరు పెట్టడానికి పొలానికి వెళ్లాడు. బోరు మోటరు ఆన్ చేస్తుండగా.. తెగిపోయిన సర్వీస్ వైర్‌కు ప్రమాదవశాత్తు తగలడంతో షాక్‌కు గురై మృతిచెందాడు.
భార్య లక్ష్మి ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి, దర్యాప్తు చేస్తున్నట్టు ఎస్సై షేక్ జుబేర్ తెలిపారు. కాగా కాగా సూర్యాపేట జిల్లా మఠంపల్లి మండలం రామచంద్రాపురం తండా గ్రామానికి చెందిన మాలోతు మణికంఠ (19) ట్రాక్టర్‌తో పొలం దున్నుతుండగా పైన వేలాడుతున్న కరెంటు వైర్లు ప్రమాదవశాత్తు తగలడంతో అక్కడికక్కడే మృతి చెందాడు. పోలీసులు ఘటన స్థలానికి చేరుకొని మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం ప్రభుత్వ దవాఖానకు తరలించారు. కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్టు మఠంపల్లి ఎస్సై ప్రవీణ్ తెలిపారు.