కంటోన్మెంట్, జూన్ 12: కేవలం 10 నెలల్లో సుమారు రూ.400 కోట్ల విలువైన ప్రభుత్వ భూమి ప్రైవేట్ భూమిగా ఎలా మారిందని బీఆర్ఎస్ అధికార ప్రతినిధి, కంటోన్మెంట్ సభ్యత్వ నమోదు ఇన్చార్జి మన్నె క్రిశాంక్ ప్రశ్నించారు. కంటోన్మెంట్ పరిధిలోని సర్వేనంబర్ 157/1లోని 8 ఎకరాల స్థలం వద్ద క్రిశాంక్ శుక్రవారం మీడియాతో మాట్లాడారు. 2025లో ఆ 8 ఎకరాల స్థలంలో కాంగ్రెస్ ప్రభుత్వం 6,000 ఇందిరమ్మ ఇండ్ల నిర్మాణం విషయమై ప్రస్తావిస్తే, ఇదే ప్రభుత్వ భూమిలో ఇండ్లు నిర్మించాలని మంత్రులు పొంగులేటి శ్రీనివాస్‌రెడ్డి, సీతక్క, ముఖ్యమంత్రి అప్పటి సలహాదారుడు వేం నరేందర్ రెడ్డికి ఎమ్మెల్యే వినతిపత్రాలు ఇచ్చారని చెప్పారు. తీరా ఇప్పుడు రాత్రికి రాత్రి అదే భూమిలో రేకులతో ప్రహరీ ఏర్పాటుచేసి ప్రైవేట్ వ్యక్తులు కబ్జా చేశారని ఆరోపించారు.
మంత్రి పొంగులేటి శ్రీనివాస్‌రెడ్డికి, కంటోన్మెంట్ ఎమ్మెల్యే శ్రీగణేశ్‌కు కమీషన్లు ఏమైనా ముట్టాయా? అని ప్రశ్నించారు. గత ప్రభుత్వాలు 400 కోట్ల విలువైన 8 ఎకరాల భూమిని కాపాడితే.. ఇప్పుడు కాంగ్రెస్ సర్కార్ ప్రభుత్వ భూమిగా గుర్తించిన ఏడాదిలోపే ప్రైవేట్ వ్యక్తుల చేతుల్లోకి ఎలా వెళ్లిందని ప్రశ్నించారు. దీనిపై సమగ్ర విచారణ చేపట్టి, ఆ ప్రభుత్వ ఆస్తిని కాపాడి హామీ ఇచ్చినట్టుగానే పేదలకు 6 వేల ఇందిరమ్మ ఇండ్లు నిర్మించి ఇవ్వాలని బీఆర్ఎస్ పార్టీ తరఫున డిమాండ్ చేశారు. సమావేశంలో బోర్డు మాజీ సభ్యుడు పీ శ్యాంకుమార్, బీఆర్ఎస్ సీనియర్ నాయకులు గంగారామ్, చంద్రశేఖర్, సాయి. సోమయ్య. రఘు, ఉదయ్, ఉమాశంకర్, వెంకట్ తదితరులు పాల్గొన్నారు.
కంటోన్మెంట్ పరిధిలో సర్వేనంబర్ 57లోని 8 ఎకరాల ప్రభుత స్థలాన్ని కాపాడాలని బీఆర్ఎస్ నాయకులు, రాష్ట్ర బేవరేజేస్ కార్పొరేషన్ మాజీ చైర్మన్ గజ్జేల నగేశ్ ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. ఆ స్థలాన్ని 157/1గా మార్చి రౌడీమూకలను పెట్టి కొందరు ప్రైవేట్ వ్యక్తులు తమ కబంధ హస్తాల్లోకి తీసుకొన్నారని, స్థానికులను భయభ్రాంతులకు గురిచేస్తున్నారని ఆరోపించారు.