హైదరాబాద్, డిసెంబర్ 11 (నమస్తే తెలంగాణ) : ప్రతినెలా నిధులు విడుదల చేస్తామని ఆరోగ్యశాఖ మంత్రి, హెల్త్ సెక్రటరీ, ఆరోగ్యశ్రీ ట్రస్టు సీఈవో ఇచ్చిన హామీ నీటి మూటగానే మారిందని ఆరోగ్యశ్రీ నెట్వర్క్ దవాఖానలు ఆవేదన వ్యక్తం చేస్తున్నాయి. సీఎం రేవంత్‌రెడ్డి పలుమార్లు ఇది కాంగ్రెస్ పార్టీ డ్రీమ్స్కీమ్ అని చెబుతున్నా బిల్లుల చెల్లింపులో మాత్రం నిర్లక్ష్యం వీడకపోవడంతో దవాఖానలకు ఇబ్బందులు తప్పడం లేదు. ఈ ఏడాది జనవరిలో రూ.1100 కోట్ల బకాయిలు చెల్లించాలనే డిమాండ్‌తో సేవలు నిలిపివేయగా రెండు నెలల్లో చెల్లిస్తామని ప్రభుత్వం హామీ ఇవ్వగా వెనక్కి తగ్గిన విషయం తెలిసిందే. అయినా, బకాయిల చెల్లింపులో ప్రభుత్వం పట్టింపులేనట్టుగా వ్యవహరించడంతో సెప్టెంబర్‌లో మరోసారి సేవలు నిలిచిపోయాయి. ప్రతినెల విడుదల కావాల్సిన రూ.100కోట్లతో పాటు బకాయి రూ.1,400 కోట్లు విడుదల చేస్తేనే సేవలు అందిస్తామని తేల్చిచెప్పడంతో చర్చలు జరిపిన ప్రభుత్వ పెద్దలు హామీ ఇవ్వడంతో సేవల పునరుద్ధరణ జరిగింది. ఒక్కనెలా సక్రమంగా నిధులిచ్చిన రేవంత్ ప్రభుత్వం తర్వాత షరా మామూలుగానే వ్యవహరిస్తుండడంపై ఆసుపత్రుల యాజమాన్యాలు ఆందోళన చెందుతున్నాయి. ప్రభుత్వం నుంచి ఆరోగ్యశ్రీ, ఉద్యోగుల ఆరోగ్య పథకం(ఈహెచ్ఎస్), జర్నలిస్టుల ఆరోగ్య పథకం కింద అందిస్తున్న సేవలకు చెల్లింపులు లేక నిర్వహణ భారంగా మారాయంటున్నారు.
హామీలిచ్చినా ఫలితం శూన్యం
సెప్టెంబర్‌లో సేవలు నిలిపివేసిన తర్వాత చర్చల అనంతరం రూ.140 కోట్లు తక్షణమే విడుదల చేస్తామన్న ప్రభుత్వం రూ.100 కోట్లు మాత్రమే విడుదల చేసిందని, అక్టోబర్ నెలకు మాత్రం కేవలం రూ.50 కోట్లు విడుదల చేసి చేతులు దులుపుకొన్నదని యాజమాన్యాలు వాపోతున్నాయి. నవంబర్, డిసెంబర్‌కు నిధుల విడుదలే జరుగలేదని, ఇలాగైతే సేవలు కొనసాగించడం మరింత కష్టతరంగా మారుతుందని ప్రభుత్వానికి తెలిపాయి. ఆరోగ్యశ్రీ ద్వారా పేషెంట్లకు సేవలు అందుతున్నాయని, ప్రభుత్వానికి పనులు జరుగుతున్నాయని తమకు మాత్రం ఇబ్బందులు తప్పడం లేదని గోడు వెల్లబోసుకుంటున్నాయి. సేవలు భారంగా మారుతున్నాయని, ఈ క్రమంలో సేవలపై ప్రతిసారీ సర్కార్ చర్చలకు పిలువడం నిధులిస్తామని చెప్పి పట్టించుకోకపోవడంపై యాజమాన్యాలు ఆవేదన వ్యక్తం చేస్తున్నాయి. ఇప్పటికైనా ప్రభుత్వం స్పందించి పెండింగ్ బకాయిలతో పాటు ప్రతినెలా రూ.100 కోట్లు విడుదల చేయాలని యాజమాన్యాలు డిమాండ్ చేస్తున్నాయి.
ఆరోగ్యశ్రీ సేవలు అందిస్తున్న నెట్వర్క్ దవాఖానల పెండింగ్ బిల్లులకు సంబంధించి ప్రతి నెలా నిధులు విడుదల చేస్తాం. ఇతరత్రా సమస్యలపై సానుకూల నిర్ణయం తీసుకుంటాం.
– ఆరోగ్యశాఖ మంత్రిదామోదర్ రాజనర్సింహ
ఆరోగ్యశ్రీ కాంగ్రెస్ బ్రాండ్ స్కీమ్. మసకబారిన ఈ పథకానికి పూర్వవైభవం తెచ్చాం. బాధ్యతలు స్వీకరించిన వెంటనే ఆరోగ్యశ్రీ పరిధిని రూ.5లక్షల నుంచి రూ.10లక్షలకు పెంచాం. ఇది మేమిచ్చిన భరోసా.
– సీఎం రేవంత్ రెడ్డి