Mahmood Ali | శాంతిభద్రతల రక్షణలో తెలంగాణ పోలీసులు దేశంలోనే ముందంజలో ఉన్నారని హోంమంత్రి మహమూద్ అలీ అన్నారు. రంగారెడ్డి జిల్లా చేవెళ్లలో అత్యాధునిక వసతులతో నిర్మించిన పోలీస్‌స్టేషన్‌ను మంత్రి డీజీపీ అంజనీకుమార్, ఎంపీ రంజిత్‌రెడ్డి, చేవెళ్ల ఎమ్మెల్యే కాలె యాదయ్య, ఎమ్మెల్సీలు పట్నం మహేందర్ రెడ్డి, సురభి వాణీదేవి, పోలీస్ హౌసింగ్ కార్పొరేషన్ చైర్మన్ కోలేటి
దామోదర్ కలిసి ప్రారంభించారు. అనంతరం మంత్రి మాట్లాడుతూ రాష్ట్రంలో శాంతిభద్రతలకు సీఎం కేసీఆర్ ప్రాధాన్యం ఇచ్చారన్నారు. ఇందులో భాగంగా పోలీస్‌శాఖకు అత్యధికంగా నిధులు కేటాయించారన్నారు. ఎక్కడైతే శాంతిభద్రతలు బాగుంటాయో అక్కడికే పెట్టుబడులు అధికంగా వస్తాయన్నారు.
తెలంగాణ పోలీస్ వ్యవస్థ దేశానికే రోల్ మోడల్ అని తెలిపారు. ప్రజలకు ఏదైనా సమస్య ఉంటే 100 నంబర్‌కు డయల్ చేస్తే తక్షణమే స్పందిస్తారని చెప్పారు. చేవేళ్ల పోలీస్‌స్టేషన్‌ను అత్యాధునిక హంగులతో నిర్మించామన్నారు. పోలీసులు ప్రజలకు అందుబాటులో ఉంటూ మెరుగైన సేవలు అందించాలని కోరారు. నియోజకవర్గంలోని పలు మండలాలకు చెందిన స్టేషన్లకు సంబంధించిన సమస్యలను సీఎం దృష్టికి తీసుకెళ్లి పరిష్కరిస్తానని హామీ ఇచ్చారు. అనంతరం ఎంపీ రంజిత్‌రెడ్డి మాట్లాడుతూ సీసీ కెమెరాల ఏర్పాటుతో పోలీసులు విజయవంతమయ్యారన్నారు. కార్యక్రమంలో రంగారెడ్డి జడ్పీ చైర్పర్సన్ టీ అనిత, సైబరాబాద్ కమిషనర్ స్టీఫెన్ రవీంద్ర, జాయింట్ సీపీ అవినాష్ మహంతి, ట్రాఫిక్ జాయింట్ సీపీ నారాయణ నాయక్, ఇతర పోలీసు అధికారులు, ప్రజాప్రతినిధులు పాల్గొన్నారు.