Home Guards | హైదరాబాద్, జనవరి 19 (నమస్తే తెలంగాణ): హోంగార్డుల నోట్లో కాంగ్రెస్ ప్రభుత్వం మట్టి కొట్టింది. చనిపోయిన హోంగార్డుల స్థానంలో వారి కుటుంబీకులకు ఇచ్చే కారుణ్య నియామకంపై ప్రభుత్వం యూటర్న్ తీసుకున్నది. నాడు అసెంబ్లీ ఎన్నికల వేళ అలవిగాని హామీలు ఇచ్చి.. నేడు వాటిని నెరవేర్చకుండా వందలాది హోంగార్డుల కుటుంబాలను రోడ్డున పడేసే కుట్ర చేసింది. కారుణ్య నియామకాల కింద ఇక నుంచి హోంగార్డులకు ఉద్యోగాలు ఇచ్చేది లేదని రాష్ట్ర ప్రభుత్వం తేల్చి చెప్పింది. ఈ మేరకు గత డిసెంబర్ 30న సర్క్యులర్ జారీ చేసింది. అది బయటికి రాకుండా ఇన్నాళ్లూ ఎన్నో తంటాలు పడింది. అయితే, తాజాగా ఆ ఉత్తర్వులు బయటకురావడంతో ఇటు హోంగార్డులు, అటు వివిధ కారణాలతో చనిపోయిన హోంగార్డుల కుటుంబాలు లబోదిబోమంటున్నాయి. ఇన్నేండ్లుగా కారుణ్య నియామకాల కోసం ఎదురుచూస్తున్న తమ నోట్లో.. ఏరి కోరి తెచ్చుకున్న కాంగ్రెస్ ప్రభుత్వం మట్టి కొట్టిందని కన్నీటి పర్యంతమవుతున్నారు.
కారుణ్య నియామకాలను భర్తీ చేసేది లేదంటూ గత డిసెంబర్ 30న రాష్ట్ర హోంశాఖ ప్రత్యేక కార్యదర్శి రవిగుప్తా పేరిట ఉత్తర్వులు వెలువడ్డాయి. ‘తెలంగాణ రాష్ట్రంలో మరణించిన హోంగార్డుల కుటుంబసభ్యులకు కారుణ్య నియామకాలు ఇవ్వాలన్న హోంగార్డ్స్ సంస్థ ప్రతిపాదనను హోంశాఖ తిరస్కరించింది. తాత్కాలిక సేవలను పొందేందుకు జారీ చేసిన మార్గదర్శకాల ప్రకారం.. మరణించిన తాత్కాలిక ఉద్యోగిపై ఆధారపడిన వారికి కారుణ్య నియామకం కింద ఉద్యోగం ఇవ్వాలని ఎలాంటి నిబంధనలు లేవని తెలంగాణ డీజీపీ దృష్టికి తీసుకొస్తున్నాను. హోంగార్డులు స్వచ్ఛంద సేవలు మాత్రమే అందిస్తున్నందున వారికి కారుణ్య నియామకాలు అందించడం సాధ్యం కాదు’ అని ఆ ఉత్తర్వుల్లో పేర్కొన్నారు. ఈ ఉత్తర్వులు వెలువడిన దగ్గర్నుంచి తమ గోడు ఎవరికి చెప్పుకోవాలో తెలియక హోంగార్డులు బోరున విలపిస్తున్నారు.
హోంగార్డులకు బీఆర్ఎస్ ప్రభుత్వం భిక్షమేస్తున్నదని, తాము అధికారంలోకి వస్తే వారిని పర్మినెంట్ చేస్తామని, 2016 నుంచి మరణించిన 800 మంది హోంగార్డుల కుటుంబ సభ్యుల్లో ఒకరికి కారుణ్య నియామకం కింద ఉద్యోగం ఇస్తామని రాష్ట్ర అసెంబ్లీ ఎన్నికల సమయంలో ప్రతిపక్షంలో ఉన్న రేవంత్‌రెడ్డి హామీలు ఇచ్చారు. ఎన్నికల వేళ హోంగార్డులకు రేవంత్‌రెడ్డి ఇచ్చిన హామీలను నెరవేర్చాలని మంత్రి సీతక్కకు గత జూలైలో హోంగార్డులు వినతిపత్రం ఇచ్చారు. ప్రజా భవన్లో నిర్వహిస్తున్న ప్రజావాణిలో పలు దఫాలుగా తమ గోడు వెళ్లబోసుకున్నారు. కానీ, ఎలాంటి ఫలితం దక్కలేదు. దీంతో హోంగార్డులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. దేశవ్యాప్తంగా కారుణ్య నియామకాలు కొనసాగుతున్నా.. తెలంగాణలో అడ్డుకుంటున్నారని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.
హోంగార్డుల సంక్షేమాన్ని పట్టించుకున్న కేసీఆర్‌ను కాదనుకొని.. కాంగ్రెస్‌కు ఓటు వేసినందుకు తమకు తగిన బుద్ధి చెప్పారని కారుణ్య నియామకాల కోసం ఎదురుచూస్తున్న హోంగార్డుల కుటుంబ సభ్యులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఎస్పీఏ తెచ్చిన కేసీఆర్‌ను వదులుకొని, నాడు బీఆర్ఎస్కు వ్యతిరేకంగా ఓట్లు వేయించామని, దాని ఫలితాన్ని ఇప్పుడు అనుభవిస్తున్నామని అంటున్నారు. బీఆర్ఎస్ హయాంలో ఎనిమిదన్నరేండ్లలో రూ.17 వేలు పెంచి ఆదుకుంటే.. రేవంత్‌రెడ్డి తమ బతుకుల్లో మట్టికొట్టారని వేలాది మంది హోంగార్డులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. హోంగార్డులకు కొత్త రేషన్‌కార్డులు ఇవ్వకుండా అడ్డుకుంటున్నారని, ‘గవర్నమెంట్ డ్యూటీ’ అని చెప్పి రేషన్‌కార్డుల్లో ప్రాధాన్యం ఇవ్వడం లేదని వాపోతున్నారు. కాంగ్రెస్ ప్రభుత్వంలో తమకు కారుణ్య నియామకాలు వస్తాయని ఎదురుచూసి భంగపడ్డామని అంటున్నారు. తమను పర్మినెంట్ చేసేందుకు ఎస్పీఏ తీసుకొచ్చి.. విడుదల చేసిన జీవోను సాకుగా చూపి కారుణ్య నియామకాలు ఇవ్వకపోవడం దారుణమని మండిపడుతున్నారు. తమ న్యాయమైన హక్కును సాధించుకునేందుకు రోడ్ల మీదకు వచ్చి నిరసనలు తెలుపుతామని హోంగార్డులు స్పష్టం చేస్తున్నారు.