హైదరాబాద్ సిటీబ్యూరో, అక్టోబర్ 1 (నమస్తే తెలంగాణ): రాష్ట్రంలో కాంగ్రెస్ అధికారంలోకి వచ్చాక అందరూ చెప్తున్నట్టు గ్రేటర్ హైదరాబాద్లో రియల్ ఎస్టేట్ రంగం నిజంగానే నేలచూపులు చూస్తున్నది. ఇటీవల హెచ్ఎండీఏ భారీ అంచనాలతో రంగారెడ్డి, మేడ్చల్ మల్కాజిగిరి జిల్లాల పరిధిలోని వేర్వేరు వెంచర్లలో 103 ప్లాట్లను వేలానికి పెడితే 3 ప్లాట్లు మాత్ర మే అమ్ముడుపోయాయి. దాదాపు రూ.500 కోట్లు వస్తాయన్న అంచనాతో ఈ వేలాన్ని నిర్వహిస్తే కనీసం ఖర్చులు కూడా రాలేదు. కంగుతిన్న హెచ్ఎండీఏ.. ఆఫ్సెట్ ధరలను, ఈఎండీని తగ్గించాలని యోచిస్తున్నది. తద్వారా రంగారెడ్డి జిల్లా గండిపేట మండలంలోని బైరాగి గూడ, కోకాపేట, పుప్పాలగూడ, శేరిలింగంపల్లి మండలంలోని చందానగర్తోపాటు మేడ్చల్ మల్కాజిగిరి జిల్లా పరిధిలోని బాచుపల్లి, బౌరంపేట, చెంగిచర్ల, సూరారం తదితర ప్రాంతాల్లో డెవలప్ చేసిన 35,875 చదరపు గజాల్లోని ప్లాట్లను మళ్లీ వేలం వేయనున్నది.
ఆఫ్సెట్ ధర తగ్గింపునకు యోచన
ఇటీవల నిర్వహించిన వేలంలో ఆ ప్లాట్ల సగ టు ధరను చదరపు గజానికి కనిష్ఠంగా రూ.35-50 వేలు, గరిష్ఠంగా రూ.75 వేల నుంచి రూ.1.75 లక్షలుగా నిర్ణయించడంతో ఆశించిన స్పందన రాలేదు. ఆ ప్లాట్ల ఆఫ్సెట్ ధరను మార్కెట్ విలువ కంటే 15-20 తగ్గించినా కొనుగోలుదారులు ముందుకు రాలేదు. దీంతో ప్రస్తుతమున్న ఆఫ్సెట్ ధరను 20-35%, ఈఎండీని 25% మేరకు తగ్గించి మళ్లీ వేలం వేయాలని హెచ్ఎండీఏ యోచిస్తున్నట్టు సమాచారం.
నేలరాలిన రియల్ ఆశలు
వాస్తవానికి గత రెండేండ్లలో హైదరాబాద్ రియల్ ఎస్టేట్ రంగం దారుణంగా కుదేలైంది. ఇప్పటికే నిర్మితమైన ఇండ్లకు, ప్లాట్లకు గిరాకీ లేక, కొత్త ప్రాజెక్టులు చేపట్టేందుకు డెవలపర్లు ముందుకు రాక స్టాంపులు, రిజిస్ట్రేషన్ల ఆదాయం గణనీయంగా పడిపోయినట్టు గణాంకాలు స్పష్టం చేస్తున్నాయి. అయినప్పటికీ రియల్ ఎస్టేట్ రంగంలో హైదరాబాద్ దూసుకుపోతున్నదని అవాస్తవాలు ప్రచారం చేసిన హెచ్ఎండీఏ ఉన్నతాధికారులు, ప్రభుత్వ పెద్దలు.. ఎక్కడా భూములు అమ్మిందే లేదని స్వయంగా రియల్ ఎస్టేట్ పెద్దలే చెప్తున్నారు. ప్రస్తుతం హైడ్రా కూల్చివేతలు, మూసీ ఆక్రమణల పేరుతో కొనసాగుతున్న వేధింపులు స్తిరాస్థి కొనుగోలుదారులను, పెట్టుబడిదారులను తీవ్రంగా భయపెడుతున్నాయి. దీంతో మరో రెండేండ్ల వరకు వాటి జోలికి వెళ్లకపోవడమే ఉత్తమమని భావిస్తున్నారు.