హైదరాబాద్,డిసెంబర్ 4 (నమస్తే తెలంగాణ): హిల్ట్ పాలసీపై తక్షణమే అఖిలపక్ష సమావేశాన్ని ఏర్పాటు చేసి, శాసనసభలో చర్చించి నిర్ణయం తీసుకోవాలని రాష్ట్ర ప్రభుత్వాన్ని సీపీఎం రాష్ట్ర కార్యదర్శి జాన్‌వెస్లీ డిమాండ్ చేశారు. హైదరాబాద్ నగరంలోని లక్షల కోట్ల రూపాయల విలువైన భూములను పారిశ్రామికవేత్తలకు ధారాదత్తం చేయడమే హిల్ట్ ఉద్దేశమని, ఇది ఒక సామ్లా మారే పరిస్థితి కనబడుతున్నదని పేర్కొన్నారు.
రాష్ట్ర ప్రభుత్వం హైదరాబాద్ నగరంలోని 22 పారిశ్రామిక కేంద్రాల్లోని పరిశ్రమలన్నింటినీ నగరం బయటికి తరలించేందుకు జీవో- 27ను విడుదల చేసిందని, దీని ప్రకారం 9,300 ఎకరాల భూమిని అతి తకువ ధరలకే పారిశ్రామికవేత్తలకు కట్టబెట్టడం వల్ల లక్షల కోట్ల రూపాయలు ప్రభుత్వానికి నష్టం వాటిల్లుతుందని ఆందోళన వ్యక్తంచేశారు.
కన్వర్షన్ పేరుతో రియల్‌ఎస్టేట్‌కు కట్టబెడతారనే ఆరోపణలొస్తున్న నేపథ్యంలో.. ఆ భూములను ప్రజల సౌకర్యాల కోసం, ఇంటి స్థలాలు, క్రీడా స్థలాలు, సూళ్లు, హాస్టళ్ల వంటి వాటి కోసం కేటాయించాలని సూచించారు. కాలుష్యాన్ని సృష్టించే పరిశ్రమలను మాత్రమే నగరం నుంచి తరలించాలి తప్ప, మిగతా పరిశ్రమలనన్నింటినీ ఎందుకు తరలిస్తున్నారని ప్రశ్నించారు. పరిశ్రమలను తరలిస్తే కార్మికుల పరిస్థితి, వారి భద్రతకు తీసుకుంటున్న చర్యలేమిటని నిలదీశారు. పరిశ్రమలను బయటికి తరలిస్తే, ఈ భూములను ఆ పారిశ్రామికవేత్తలకే మారెట్ ధరకు కాకుండా, అతి తకువ ధరకే ఎందుకివ్వాలని ప్రశ్నించారు. ప్రజాధనం దుర్వినియోగంచేస్తే ఆందోళనలు చేపడుతామని హెచ్చరించారు.